iDreamPost
android-app
ios-app

సంచలనాల సునామి మహేష్ ‘ఒక్కడు’ – Nostalgia

  • Published Jan 28, 2020 | 9:18 AM Updated Updated Jan 28, 2020 | 9:18 AM
సంచలనాల సునామి మహేష్  ‘ఒక్కడు’ – Nostalgia

2002 సంవత్సరం

అంతకుముందు ఏడాది డిజాస్టర్ అందుకున్న ఓ దర్శకుడు. తనకో పెద్ద హిట్ ఇచ్చాడన్న నమ్మకంతో మెగాస్టార్ చిరంజీవి ఏరికోరి మరీ రెండో అవకాశాన్ని అందిస్తే అది కాస్తా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. పరిశ్రమలో ఉద్దండులైన రచయితలు కలిసి పనిచేసి హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రాసుకున్న కథ తెరపైకి వచ్చేటప్పటికి తేడా కొట్టేసింది. అదే మృగరాజు. గుణశేఖర్ దానికి కెప్టెన్. 2001లో నిర్మాత దేవివరప్రసాద్ కు, కోట్లు గుమ్మరించి హక్కులు కొనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు కొన్నాళ్ల పాటు నిద్రలో కూడా గుర్తొచ్చేలా చేసింది

అదే 2002

సూపర్ స్టార్ కృష్ణగారి వారసుడు మహేష్ బాబు. డెబ్యూ సినిమా ‘రాజకుమారుడు’ పెద్ద హిట్టయ్యింది కానీ కుర్రాడు మరీ లేతగా ఉన్నాడనే ఫీడ్ బ్యాక్ . రెండోది ‘యువరాజు’ పోయింది. మూడోది ‘వంశీ’ ఇంకా దారుణం. నాలుగోది ‘మురారి’ చాలా పేరు తీసుకొచ్చింది కానీ అదో సంప్రదాయ నమ్మకాల మీద నడిచిన సినిమా. హీరోతో సమానంగా దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ క్రెడిట్ పంచుకున్నారు. ఐదోది ‘టక్కరిదొంగ’ కౌబాయ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తే సోసోగానే ఆడింది. ఆరోది ‘బాబీ’ వారం గడిచే లోపే బాక్సులు వెనక్కు వచ్చాయి. ఇప్పటికీ మాస్ లో సరైన ఇమేజ్ రాలేదు. అభిమానులు ఇంకేదో కోరుతున్నారు. తానెక్కడో లెక్క తప్పుతున్నాడు. మహేష్ బాబు చాలా సీరియస్ గా ఆలోచిస్తున్న టైం అది.

ఆలోచనకు పునాది

సాధారణంగా మనిషి కన్నా ఎక్కువ సక్సెస్ కే విలువిచ్చే సినిమా పరిశ్రమలో చెరో వైపు డిజాస్టర్లు మోస్తున్న హీరో దర్శకుడు కలవడం చాలా అరుదు. ఒకవేళ అలాంటిది జరిగినా దెప్పి పొడవడం ఖాయం. గుణశేఖర్-మహేష్ కాంబినేషన్ ని ఏంఎస్ రాజు సెట్ చేసుకున్నప్పుడు అదే జరిగింది. అప్పటికే టాప్ ప్రొడ్యూసర్ గా వరుస బ్లాక్ బస్టర్లతో దివ్యంగా వెలిగిపోతున్న నిర్మాత రాజుగారు సోషియో ఫాంటసీ ‘దేవి పుత్రుడు’ తో షాక్ తిని ఉన్నారు. ఈయనకు మహేష్ తో చేయడానికి ఇంకో దర్శకుడే దొరకలేదా అనే కామెంట్స్ ఎక్కువయ్యాయి. వాటిని ఆయన ఖాతరు చేయలేదు. కారణం స్క్రిప్ట్ చెబుతున్నప్పుడే ఎంఎస్ రాజు గారికి బాక్స్ ఆఫీస్ దగ్గర జరగబోయే ఊచకోత కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది. అంతకు ముందే రామోజీరావు, ఎంఎస్ రెడ్డి గార్ల వద్దకు వెళ్లి వెనక్కు వచ్సిన స్క్రిప్ట్ కాబట్టి గుణశేఖర్ టెన్షన్ తోనే ఉన్నాడు. ఎంత ఖర్చైనా పర్లేదు సరే అన్నారు ఎంఎస్ రాజు గారు. ఆకుపచ్చ జెండా ఊపేశారు.

అలా ఒక చరిత్రకు శ్రీకారం చుట్టారు ఈ ముగ్గురు. ఎంఎస్ రాజు-గుణశేఖర్ -మహేష్ బాబు. మీడియా ద్వారా అభిమానులకు అనౌన్స్ చేశారు. హీరోయిన్ భూమికతో సహా టీమ్ మొత్తం సెట్ అయిపోయింది. ముందు యండమూరి గారి పాపులర్ నవల అతడే ఆమె సైన్యంని టైటిల్ గా అనుకున్నారు. కానీ ఓల్డ్ స్టైల్ లో ఉందని తర్వాత కబడ్డీ ఆలోచించారు. అదీ నచ్చలేదు. ఆఖరికి అందరి ఓటు ‘ఒక్కడు’ కి పడింది.

కార్యేసాహసే లక్ష్మి

సిటీ అవుట్ స్కర్ట్స్ లో రామానాయుడు గారి పదెకరాల ఖాళీ స్థలంలో చార్మినార్ సెట్ వేయడం మొదలుపెట్టారు. మూడు నెలలు మూడొందల మంది కష్టపడితే కేవలం ఆ ఒక్క సెట్ కే రెండు కోట్ల దాకా బడ్జెట్ అయ్యింది. అనుకున్నంత సాఫీగా జరగలేదు. ఎన్నో ఆటుపోట్లు. విపరీతమైన ఖర్చు. కథలో కీలకమైన కబడ్డీ ఆట ప్రాక్టిస్ చేస్తూ హీరో మహేష్ మోకాలికి దెబ్బలు తగులుతున్నా అలాగే కసిమీద షూటింగ్ చేస్తున్నాడు. దేవిపుత్రుడు నష్టాలతో ఉన్న రాజుగారు ఇవేవి లెక్క చేయడం లేదు. ఎంత అడిగితే అంతా ధారాళంగా ఖర్చు పెట్టేస్తున్నారు. సినిమా అయిపోయేలోపు 15 కోట్ల దాకా బడ్జెట్ తేలి ఇండస్ట్రీ నివ్వెరపోయింది. అప్పుడు టికెట్ రేట్లు హైదరాబాద్ లాంటి నగరాల్లోనే గరిష్టం 50 రూపాయలే. మరి అంత మొత్తం షేర్ రూపంలో వస్తుందా. రాజుగారు ఈసారి నిండా మునగబోతున్నారా. ఇదే అప్పటి ఫిలిం నగర్ సర్కిల్స్ లో జరిగిన తీవ్రమైన చర్చలు

నమ్మకమే ధైర్యం

2003లో సంక్రాంతి విడుదలకు ముందు ఎంఎస్ రాజు ఓ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిన మాట హెడ్ లైన్ గా వచ్చింది. “దమ్మున్న కథ పడితే మహేష్ దుమ్ము దులుపుతాడు”. ఇది చూసి నవ్వుకున్న వాళ్ళు లేకపోలేదు. మురారి లాంటి కన్నీళ్ల సినిమాతో హిట్టు కొట్టిన మహేష్ లో నిజంగా అంతా సత్తా ఉందా. అభిమానులకు సందేహం లేదు, రాదు. కానీ సామాన్య ప్రేక్షకులు అలా కాదుగా. రిలీజ్ కోసం ఎదురు చూశారు. రానే వచ్చింది జనవరి 15.

అప్పటికి సరిగ్గా 5 రోజుల ముందు జూనియర్ ఎన్టీఆర్ నాగ భారీ ఎత్తున విడుదలై డివైడ్ టాక్ తో హిట్టో ఫట్టో తెలియని అయోమయంలో సాగుతోంది. ఆ టైంలో ఫుల్ స్వింగ్ లో ఉన్న రవితేజ ఈ అబ్బాయి చాలా మంచోడు 14న వచ్చి ఇంకా పూర్తి రిపోర్ట్ బయటికి రాలేదు. ఒక్కడు మరుసటి రోజు అంటే 16న ఎస్వి కృష్ణారెడ్డి తన పెళ్ళాం ఊరెళితేని లైన్ లో పెట్టారు. ఇంత టఫ్ కాంపిటీషన్ లో ఒక్కడు ధియేటర్లలో అడుగు పెట్టాడు.

ఒక్కడు వచ్చాక

మొదటి ఆట కాగానే బయటికి వచ్చిన మహేష్ అభిమానులు మాట్లాడ్డం లేదు. నిజం చెప్పాలంటే ఎవరూ కనిపించడం లేదు. టాక్ ఇదని చెప్పేందుకు ఎవరైనా దొరికితేనా. కారణం ఉంది. ఆలస్యం చేస్తే ఇంకోసారి చూసేందుకు రోజులు గడిచేకొద్ది టికెట్లు దొరకవని వాళ్ళకు అర్థమైపోయింది. తర్వాత ఆటకు క్యులో నిలబడి సిద్ధం కావడం తప్ప ఇంకో ఆలోచన లేదు. భుజం పట్టుకుని ఒక్కడు ఎలా ఉన్నాడని ఎవరిని అడిగినా పూనకంతో ఊగిపోతున్నారు. ఇది మా మహేష్ అంటూ గంగవెర్రులెత్తుతూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ముందు వచ్చినవి తర్వాత వచ్చినవి అన్ని సినిమాలు రేస్ లో ఒక్కడుకి అందనంత దూరంలో వెనక్కు జరిగిపోయాయి. ఎంఎస్ రాజు ముందే ఊహించిన వసూళ్ళ సునామి ధియేటర్లలో మొదలైంది

కథ చాలా సింపుల్

ఓ హైదరాబాద్ కుర్రాడు అజయ్(మహేష్ బాబు)కబడ్డీ పోటీల కోసం కర్నూల్ వచ్చినప్పుడు అక్కడి ఫ్యాక్షన్ లీడర్ ఓబుల్ రెడ్డి బలవంతంగా చెరపట్టబోయిన స్వప్న(భూమిక)ను విడిపించి తనతో పాటు ఇంటికి తీసుకెళ్తాడు. దీంతో శివాలెత్తిన రెడ్డి అజయ్ స్వప్నలను వెతుక్కుంటూ నగరానికి వస్తాడు. అక్కడి నుంచి వీళ్ళ ప్రయాణం ఏ గమ్యం చేరుకుందనేదే ఒక్కడు స్టొరీ. సింపుల్ గా రెండు లైన్లలో చెప్పాలంటే కథ ఇదే. ఇంతకు మించి ఏమి లేదు. కానీ ఒక్కడు బ్రహ్మరధం దక్కించుకోవడానికి కారణం అదొక్కటేనా. కాదు. కానే కాదు. అసలు మ్యాటర్ వేరే ఉంది.

సీన్ నెం 1

కొండారెడ్డి బురుజు దగ్గర వందల మంది చూస్తుండగా నిస్సహాయ స్థితిలో ఉన్న స్వప్నను బలవంతంగా తీసుకెళ్లడానికి ఓబుల్ రెడ్డి రెడీ అవుతున్నాడు. వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. అక్కడికి అడుగుల దూరంలో ఉన్న ఎస్టిడి బూత్ లో ఇంట్లో వాళ్ళతో ఫోన్ లో మాట్లాడి బయటికి వచ్చిన అజయ్ కు ఇది అన్యాయం అనిపించింది. దగ్గరికి వెళ్లి ఓబుల్ రెడ్డి గూబ పగిలిపోయేలా ఒక్కటిచ్చి స్వప్నను అక్కడి నుంచి చాకచక్యంగా తీసుకెళ్లిపోయాడు.

ఈ సీన్ వచ్చినప్పుడు డైలాగులు ఉండవు. కేవలం ఎక్స్ ప్రెషన్లు మాత్రమే ఉంటాయి. అయినా ప్రతి ఊరిలో థియేటర్లు ఈలలు కేకలతో దద్దరిల్లిపోయాయి. ఏం తీశాడ్రా అని అనుకోని ప్రేక్షకుడు లేడు

సీన్ నెం 2

చేతుల్లో మరణాయుధాలతో ఓబుల్ రెడ్డి అనుచరులు జీపులు లారీల మధ్య అజయ్ స్వప్నలను చుట్టుముట్టారు. తప్పించుకోవడం అసాధ్యం. సినిమా హాల్ జనాల్లో విపరీతమైన ఉత్కంఠ. ఏం జరుగుతుందా అని బిగదీసుకుని చూస్తున్నారు. ఊహించని ట్విస్ట్ తో అజయ్ స్వప్న మెడపై కత్తి పెట్టి ఓబుల్ రెడ్డి ని బురదలో తోసేసి వెళ్ళిపోయినప్పుడు రేగిన అల్లరిని ఆ టైంలో థియేటర్ లో సినిమా చూసిన ఏ ప్రేక్షకుడైనా మర్చిపోవడం అసాధ్యం

సీన్ నెం 3

ఓబుల్ రెడ్డి గ్యాంగ్ కి, పోలీసులకు దొరక్కుండా అజయ్ స్వప్నలు ఛార్మినార్ పైన తలదాచుకున్నారు. అయినా వీళ్ళ జాడ తెలిసిపోయింది. ఇప్పుడెలా. గుణశేఖర్ ఏం చేస్తాడు. అందరి మదిలో ఇదే ప్రశ్న. ఎంత ఆలోచించినా తట్టడం లేదు. అప్పుడు ఇచ్చాడు షాక్. దిమ్మదిరిగిపోయేలా అంత మంది పోలీసులు రౌడీల నుంచి మహేష్ భూమికలు తప్పించుకోవడం చూసి తెరుచుకున్న నోళ్లు అలాగే కాసేపు చూస్తూ ఉండిపోయాయి

ఇలా రాసుకుంటూ పోతే అదో పెద్ద పుస్తకమే అవుతుంది కానీ ఇక్కడితో ఆపేద్దాం. కమర్షియల్ సినిమా ఎప్పుడూ కొన్ని సూత్రాలకు లోబడి సాగుతుందన్నది వాస్తవం. దానికి ఎవరూ మినహాయింపు కాదు. దీన్ని డీల్ చేయడంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా మొత్తం తారుమారైపోతుంది. అందులోనూ మహేష్ లాంటి స్టార్ బాయ్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. గుణశేఖర్ – పరుచూరి బ్రదర్స్ ఎక్కడా ట్రాక్ తప్పలేదు. రెండు ముప్పావు గంటల నిడివి ఉన్నా ఎక్కడా బోర్ కొట్టించకుండా కథనం నడిపించిన తీరు ఇప్పటికీ మెస్మరైజ్ చేస్తుంది.

ఏంటి ఒక్కడులో ప్రత్యేకత

పాతాళభైరవిలో తోటరాముడి ప్రేయసిని మాంత్రికుడు ఎత్తుకుపోతాడు. వాళ్ళను వెతుక్కుంటూ వచ్చిన కథానాయకుడు దుష్టసంహారం చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు. కానీ ఒక్కడు లో రివర్స్. విలన్ ఇష్టపడిన అమ్మాయిని హీరో తీసుకెళ్లిపోతాడు. వాళ్ళను పట్టుకోవడం కోసం ప్రతినాయకుడు వస్తాడు. ఆఫ్ కోర్స్ చివరికి గెలిచేది హీరోనే అయినా ఈ రివర్స్ పాయింట్ బ్రహ్మాండంగా వర్కవుట్ అయ్యింది. కారణం కథ చుట్టూ అల్లుకున్న బలమైన సన్నివేశాలు, వాటికి ధీటుగా నటించి నిలబెట్టిన నటీనటుల పెర్ఫార్మన్స్. ఫలితంగా ఒక్కడిని ఎక్కడికో తెలిసింది.

ఓన్లీ మహేష్

మహేష్ బాబులోని రియల్ ఎనర్జీని పూర్తిగా బయట పెట్టింది ఒక్కడే . అంతకు ముందు ఉన్న మురారిలో ఎమోషన్స్ పరంగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన ప్రిన్స్ ఇందులో ఆల్ రౌండర్ గా డిస్టింక్షన్ కొట్టేశాడు. వర్షం ఫైట్ లో భూమికకు అభయం ఇస్తున్నప్పుడు, హావభావాలు మాత్రమే ఉపయోగించి మొదటిసారి ఓబుల్ రెడ్డిని కొట్టే సీన్ లో, క్లైమాక్స్ ఫైట్, ఎయిర్ పోర్ట్ లో స్వప్నను వదిలి వచ్చే సన్నివేశంలో తనని గుణశేఖర్ పూర్తిగా వాడేసుకున్నాడు. ఆపై మహేష్ ను టాకిల్ చేయబోయే దర్శకులకు ఒక మార్గదర్శిగా నిలిచాడు. మృగరాజు లాంటి సినిమా తర్వాత ఇలాంటి కథను రాసుకోవడంలోనే గుణశేఖర్ కసి ఆణువణువూ కనిపిస్తుంది. ఈ పనితనాన్ని ప్రేమించే మహేష్ తర్వాత గుణశేఖర్ మీద నమ్మకంతో అర్జున్, సైనికుడులను ఒప్పుకున్నాడు కాని జరిగింది వేరు. అది వేరే కథ.

ప్రకాష్ రాజ్ ఈ ఒక్కడులో ట్రూ విలనీకి డెఫినేషన్ గా నిలిచాడు. సంక్రాంతి గొబ్బెమ్మరా అంటూ స్వప్నను వర్ణిస్తున్నప్పుడు కామెడీని, ఆ అమ్మాయి అన్నయ్యలను దారుణంగా హత్య చేస్తున్నప్పుడు క్రూరత్వాన్ని బాలన్స్ చేయడం ఆయనకే చెల్లింది. బేల చూపులతో తనకో ధైర్యం కావాలని ఎదురు చూసి అది అజయ్ రూపంలో దొరికినప్పుడు నిబ్బరంగా మారే స్వప్న పాత్రలో భూమికను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం. కామెడీ, యాక్షన్, కలర్ఫుల్ సాంగ్స్, కళ్ళు చెదిరే సెట్టింగ్స్ ఇలా ఒకటేమిటి సుబ్బయ్య హోటల్ భోజనంలా ఒక్కడులో గుణశేఖర్ టీమ్ వడ్డించిన పదార్థాలకు కడుపు నిండిపోయి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించేలా చేయడం గురించి ఎంత చెప్పినా తక్కవే.

ఒక్కడి స్థంభాలు

ఇళయరాజా, రెహమాన్, రాజ్ కోటి, కీరవాణిల తర్వాత కెరీర్ పరంగా గోల్డెన్ టైంని ఎంజాయ్ చేస్తున్న స్వరబ్రహ్మ మణిశర్మ ఒక్కడుకి ఇచ్చిన ఆరు పాటలు, నేపధ్య సంగీతం సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. అప్పటికి కేవలం కొన్నేళ్ళ క్రితమే మార్కెట్ లోకి వచ్చి ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తున్న డాల్బీ డిజిటిల్ సౌండ్ సిస్టంలో ఒక్కడు చూస్తూ మణిశర్మ ప్రతిభకు మంత్రముగ్దులు కానివాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. అనుమానం ఉంటే ఒక్కడుని ఒక్కసారి మ్యూట్ తో మ్యూజిక్ లేకుండా కేవలం సంభాషణలతో ఊహించుకోండి మీకే అర్థమవుతుంది. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ ఎంఎస్ రాజు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని తెరమీద చెక్కుచెదరకుండా చూపించింది.సినిమా చూసిన చాలా మంది ఛార్మినార్ మరియు ఓల్డ్ సిటీ సెట్ అంటే నమ్మలేదు. అక్కడే నిజంగా షూట్ చేసారని చెప్పుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ కు ఇంతకన్నా ప్రశంస కావాలా.

జనవరి 15న మొదలైన తుఫాను అలాగే వంద రోజులు దాటేసి డబుల్ సెంచరీ వైపు పరుగులు పెట్టింది. 15 కోట్లు ఖర్చు పెట్టారు కదా పెట్టుబడయినా వస్తుందా అనే అనుమానాల గోడలను బద్దలుకొడుతూ ఏకంగా 26 కోట్ల షేర్ వసూలు చేసి ఒక్కడు బయ్యర్ల పాలిట సినిమా దేవుడయ్యాడు. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండేదంటే తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల వాళ్ళు కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర నిజంగానే మర్డర్లు జరుగుతాయని నమ్మేటంత. గుణ శేఖర్ దర్శకుడిగా ఇక్కడే గొప్ప విజయం సాధించాడు. ఆరుగురు దర్శకులు ఇవ్వలేని సూపర్ స్టార్ ఇమేజ్ ని ఒక్కడుతో దిగ్విజయంగా కట్టబెట్టాడు. అందుకే ఒక్కడు ఒక సినిమా కాదు. చరిత్ర.

మరొక్కసారి ఒక్కడు రిలీజ్ కు ముందు ఎంఎస్ రాజు గారు అన్నమాట గుర్తు చేసుకుంటే “దమ్మున్న కథ పడితే మహేష్ దుమ్ము దులుపుతాడు”

నిజంగానే ఒక్కడు దులిపాడు. దుమ్మును కాదు. బాక్స్ ఆఫీస్ కు పట్టిన రికార్డుల బూజును, అభిమానులు కట్టుకున్న అంచనాల కొండలను. అందుకే ఒక్కడు ఎప్పటికీ ఇప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ కమర్షియల్ మాస్టర్ పీస్

చివరిగా ఒక మాట

ఒక్కడు ఇప్పటికే శాటిలైట్ ఛానల్స్ లో, యుట్యూబ్ లో కొన్ని వందల వేల లక్షల సార్లు వ్యూస్ కు నోచుకుంది. అయినా సరే మళ్ళీ రీ మాస్టర్ చేసి డాల్బీ అట్మోస్ సౌండ్ మిక్సింగ్ తో థియేట్రికల్ రీ రీలీజ్ చేస్తే గొప్ప ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇందులో మీకు ఏ మాత్రం అనుమానం ఉన్నా మరొక్కసారి హోమ్ థియేటర్ లో మంచి సౌండ్ బార్ తో ఒరిజినల్ ఒక్కడు డిజిటల్ ప్రింట్ తో చూడండి. అప్పుడు మీరే ఒప్పుకుంటారు. ఎక్స్ పైరి డేట్ లేని సినిమాల్లో ఒక్కడుది చాలా ప్రత్యేక స్థానమని.