iDreamPost
android-app
ios-app

సూపర్ స్టార్ నిర్మాతగా మరో క్రేజీ ప్రాజెక్ట్

  • Published Mar 29, 2021 | 5:57 AM Updated Updated Mar 29, 2021 | 5:57 AM
సూపర్ స్టార్ నిర్మాతగా మరో క్రేజీ ప్రాజెక్ట్

నాన్న సూపర్ స్టార్ కృష్ణ లాగా సినిమాల్లో నటించడంతో పాటు నిర్మాతగా కూడా రెండు పడవల ప్రయాణం సమర్ధవంతంగా చేస్తున్న మహేష్ బాబు సోనీ సంస్థతో కలిసి అడవి శేష్ హీరోగా మేజర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీని తాలూకు వ్యవహారాలన్నీ మహేష్ టీమే చూసుకుంటోంది. సోనీది ఒకరకంగా స్లీపింగ్ పార్ట్ నర్ తరహా పాత్ర అనుకోవచ్చు. జూన్ లో విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. అప్పటికంతా కరోనా పూర్తిగా కుదురుకుని నార్త్ వైపు థియేటర్లు తెరుచుకుని ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. లేదంటే వాయిదా తప్పకపోవచ్చు. ఇప్పటికే దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా మహేష్ బాబు నిర్మాతగా మరో క్రేజీ ప్రాజెక్టుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇటీవలే జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ తో తన రేంజ్ అమాంతం పెంచేసుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా ఛలో, భీష్మ ఫేమ్ వెంకీ కుడుములు డైరెక్షన్ లో ఓ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఇది ఇంకా అధికారికంగా బయటికి రానప్పటికీ ప్రాధమిక దశలో ఓ అంగీకారం అయితే జరిగిందని సమాచారం. టీమ్ మొత్తం పక్కాగా సెట్ చేసుకున్నాక అప్పుడు అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. మహేష్ ప్రొడక్షన్ అందులోనూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాంబో అంటే నవీన్ మాత్రం ఎందుకు వదులుకుంటాడు.

శ్రీమంతుడుతోనే మహేష్ నిర్మాణ భాగస్వామిగా మారినప్పటికీ షేర్ తీసుకోవడం తప్ప తాను వాటికి సంబందించిన ప్రొడక్షన్ లో పెద్ద యాక్టివ్ గా లేరు. కానీ మేజర్ నుంచి ఫోకస్ మారుస్తున్నాడు. ఒకవైపు తాను నటించే సినిమాలతో పాటు మరోవైపు ఇలా మీడియం రేంజ్ కాంబోస్ మూవీస్ ని ఇతర హీరోలతో ప్లాన్ చేస్తున్నారట. ఒకప్పుడు పద్మాలయ సంస్థ అధిక శాతం ఘట్టమనేని హీరోలతోనే సినిమాలు నిర్మించేది. కానీ మహేష్ అలా కాకుండా ఇలా రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఇదే ఏడాది వెబ్ సిరీస్ లు కూడా డిస్కషన్స్ లో ఉన్నాయట. వెనుక మహేష్ బాబు బ్రాండ్ ఉంటే అంతకన్నా మార్కెటింగ్ కావాల్సింది ఏముంటుంది