iDreamPost
android-app
ios-app

మ‌హా మ‌లుపుల రాజ‌కీయం, అదే అస‌లు కార‌ణం

  • Published Nov 23, 2019 | 5:03 AM Updated Updated Nov 23, 2019 | 5:03 AM
మ‌హా మ‌లుపుల రాజ‌కీయం, అదే అస‌లు కార‌ణం

టీ20 క్రికెట్ మ్యాచ్ ల‌కు వ‌ర్త‌మాన రాజ‌కీయాల‌కు పెద్ద వ్య‌త్యాసం క‌నిపించ‌డం లేదు. ఏక్ష‌ణాన ఏమి జ‌రుగునో..ఎవ‌రూహించెద‌రు అన్న‌ట్టుగా త‌యార‌య్యింది రాజ‌కీయ ప‌రిస్థితి. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌గా మ‌హారాష్ట్ర వ్య‌వ‌హారం క‌నిపిస్తోంది. అర్థ‌రాత్రి మారిన వ్య‌వ‌హారాల‌తో అనూహ్యంగా మ‌రోసారి బీజేపీ ప్ర‌భుత్వం కొలువు దీరింది. రాష్ట్ర‌ప‌తిపాల‌న ఎత్తివేసి, వెంట‌నే బీజేపీ సీఎం, ఎన్సీపీ డిప్యూటీ సీఎంల‌తో ప్ర‌మాణ‌స్వీకారం నిర్వ‌హించేందుకు గ‌వ‌ర్న‌ర్ స‌న్న‌ద్ధం కావ‌డం అనూహ్యంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ కేంద్ర‌లోని బీజేపీ పెద్ద‌ల వ్యూహాత్మ‌క అడుగులుగా స్ప‌ష్టం అవుతోంది. ప్ర‌స్తుత ప‌రిణామాలు శివ‌సేన‌కు త‌గిలిన షాక్ నుంచి తేరుకుంటుందా.. ఎన్సీపీ యూట‌ర్న్ తో ఏం జ‌రుగుతుంది.. కాంగ్రెస్ కోలుకుంటుందా అన్న విష‌యాలు భ‌విష్య‌త్ రాజ‌కీయాల్లో కీల‌కంగా మార‌బోతున్నాయి. మ‌హారాష్ట్ర వ్య‌వ‌హారాల్లో మ‌రింత వేడి పుట్టించే దిశ‌గా సాగుతున్నాయి.

అనూహ్య ప‌రిణామాలు, ఆశ్చ‌ర్య‌క‌ర ఫ‌లితాలు

మహారాష్ట్రలో నెలరోజుల నుంచి సాగుతున్న రాజకీయ హైడ్రామాకి తెర‌ప‌డుతున్న‌ట్టు అంతా భావించారు. కానీ అనూహ్యంగా శివ‌సేన‌, ఎన్సీపీ, కాంగ్రెస్ కూట‌మి ప్ర‌భుత్వం కొలువు తీరుతుంద‌నుకుంటే క‌మ‌లం పార్టీ మ‌ళ్లీ పాగా వేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఊహించని మలుపులో ఆ మూడుపార్టీల‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరికొద్ది గంటల్లో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందనూ అంచ‌నాలు త‌ల‌కింద‌లు చేస్తూ మ‌ళ్లీ ఫ‌డ్న‌విస్ ప‌గ్గాలు చేప‌ట్టారు. కాంగ్రెస్ తో మంత‌నాలు, శివ‌సేన‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన ఎన్సీపీ చివ‌ర‌కు బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం కావ‌డ‌మే ఈ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామంగా చెప్ప‌వ‌చ్చు. ఆగమేఘాల మీద శనివారం ఉదయం దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగానూ, ఉప ముఖ్య‌మంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది క్షణాలకే ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ అభినందనలు తెలపడం గమనార్హం. ‘‘మహారాష్ట్ర భవిష్యత్తు కోసం వారు కష్టించి పనిచేస్తారని నమ్ముతున్నాను..’’ అంటూ మోడీ ట్వీట్ చేశారు.

Also Read : అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి

ఎన్సీపీ నిర్ణ‌య‌మే కీల‌కం..

ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవర్ స్వయానా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్న కొడుకు కావడం విశేషం. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందంటూ.. నిన్న ఈ మూడు పార్టీల భేటీ తర్వాత శరద్ పవార్ ప్రకటించిన మ‌రునాడే ఈ మార్పులు జ‌ర‌గ‌డం వెనుక ఎన్సీపీ పాత్ర ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది. నాలుగు రోజుల క్రిత‌మే శ‌ర‌ద్ ప‌వార్ స్వ‌యంగా మోడీతో భేటీ అయ్యారు. ఆసంద‌ర్భంగా జ‌రిగిన చ‌ర్చ‌ల నేప‌థ్యం నుంచి ఎన్సీపీ ఈ నిర్ణ‌యానికి వ‌చ్చి ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. నేరుగా ప్ర‌ధాని మోడీ ఈ విష‌యంలో జోక్యం చేసుకుని ప‌వార్ తో ప‌వ‌ర్ గేమ్ ఆడిన‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. త‌మ‌ను విడిచిపెట్టినందుకు శివ‌సేన‌కు త‌గిన శాస్తి చేయాల‌నే ల‌క్ష్యంతో మోడీ ఇలాంటి ఎత్తులు వేసిన‌ట్టుగా భావిస్తున్నారు. భ‌విష్య‌త్తులో ఇత‌ర మిత్ర‌ప‌క్షాలు ఎవ‌రైనా త‌మ‌తో రాజీప‌డాలే త‌ప్ప రాయ‌బేరాలు స‌హించేది లేద‌ని చెప్ప‌డానికి శివ‌సేన ఉదంతాన్ని మోడీ వాడుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు

అయితే బీజేపీతో చేతులు కలపాలన్నది తన సొంత నిర్ణయమేనని అజిత్ పవార్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కోసమే తాము బీజేపీకి మద్ధతు ఇచ్చామని ఆయ‌న‌ వెల్లడించారు. డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయ‌న మాట్లాడుతూ మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడాక ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని, భారీవర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని అందువల్లే తాము బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అజిత్ పవార్ చెప్పారు.

ఎన్సీపీలో చీల‌క త‌ప్ప‌దా

ఈ ప‌రిణామాల త‌ర్వాత మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయంగా దాగుడుమూత‌ల‌కు చెక్ ప‌డిన‌ట్టేనా అనే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డానికి అజిత్ ప‌వార్ సిద్ధం కావ‌డం, దానికి ప్ర‌తిఫ‌లంగా డిప్యూటీ సీఎం హోదా ద‌క్కించుకోవ‌డం ఎన్సీపీ లోని కొంద‌రికి మింగుడుప‌డ‌డం లేద‌ని స‌మాచారం. ఎన్సీపీలోని మెజార్టీ స‌భ్యులు శివ‌సేన‌తో జ‌ట్టుక‌ట్టేందుకు సిద్ధంగా లేక‌పోవ‌డ‌మే అజిత్ ప‌వార్ నిర్ణ‌యానికి మూలంగా చెబుతున్నారు. అయితే బీజేపీతో క‌లిసి సాగ‌డాన్ని కూడా కొంద‌రు ఎన్సీపీ ఎమ్మెల్యేలు అంగీక‌రించ‌డం లేద‌నే ప్ర‌చారం మొద‌ల‌య్యింది. దాంతో 288 మంది స‌భ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 105 మంది స‌భ్యులున్న‌ బీజేపీ 105, 54 మంది ఎమ్మెల్యేల బ‌ల‌మున్న‌ ఎన్సీపీ ఐక్యంగా సాగితే స‌ర్కారుకి ఢోకా ఉండ‌దు. కానీ నెంబ‌ర్ గేమ్ లో సంఖ్య అటూ ఇటూ అయితే మాత్రం చిక్కులు త‌ప్ప‌వు. ప్ర‌స్తుతానికి అలాంటి ముప్పు రాక‌పోవ‌చ్చ‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఇక శివ‌సేన 56 మంది స‌భ్యుల‌లో కొంద‌రు చేజారిపోయే ప్ర‌మాదం కూడా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికే బీజేపీకి దూరం కావ‌డాన్ని ప‌లువురు జీర్ణం చేసుకోలేక‌పోతున్నార‌ని, దాంతో శివ‌సేన కూడా చీలిక అంచున ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. 44 మంది స‌భ్యులున్న కాంగ్రెస్ విప‌క్షానికే ప‌రిమితం కావాల్సి ఉంటుంది.

Also Read : నేను మద్దతు ఇవ్వలేదు -శరద్ పవార్

కాంగ్రెస్ ఆశ‌లు గల్లంతు

కీల‌క‌మైన మ‌హారాష్ట్ర‌లో బీజేపీకి బ్రేకులు వేయాల‌ని క‌ల‌లుగ‌న్న కాంగ్రెస్ ఆశ‌లు ఫ‌లించ‌క‌పోవ‌డంతో ఆపార్టీ నేత‌లు ఆవాక్క‌యిన‌ట్టు క‌నిపిస్తోంది. తొలుత ఈ వార్త‌ల‌ను న‌మ్మ‌లేద‌ని, ఫేక్ అనుకున్నామంటూ అభిషేక్ మ‌ను సింఘ్వీ చేసిన వ్యాఖ్య‌లు దానికి నిద‌ర్శ‌నం. ఆయన ట్విటర్లో స్పందిస్తూ… ‘‘మహారాష్ట్ర గురించి నేను చదివింది నిజం కాదేమో. ఇది నకిలీ వార్త అనుకుంటున్నా. నిజానికి నా మనసులో మాట చెబుతున్నా… మా మూడు పార్టీల మధ్య చర్చలు మూడు రోజులకు మించి జరగాల్సింది కాదు. చర్చల్లో చాలా జాప్యం జరిగింది. మాకంటే వేగంగా వెళ్లినందుకే వారికి అవకాశం దక్కింది. పవార్ జీ… మీరు చాలా గ్రేట్.. ఇదే నిజమైతే నిజంగా ఆశ్చర్యమే..’’ అని వ్యాఖ్యానించారు.

Also Read : కేసు నిజ‌మైతే…”జ‌గ‌త్‌”కిలాడీలు అన‌రా? భూమా బ్ర‌ద‌ర్‌ ?

తెగేవ‌ర‌కూ లాగిన శివ‌సేన‌కు ఏం ఒరిగింది..

గ‌త నెల‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో హ‌ర్యానాలో హంగ్ ఏర్ప‌డుతుంద‌ని, మ‌హారాష్ట్ర స్ప‌ష్ట‌మైన తీర్పు వ‌చ్చింద‌ని భావించారు. కానీ తీరా చూస్తే వ్య‌వ‌హారం తారుమార‌య్యింది. హ‌ర్యానాలో ఫ‌లితాలు వ‌చ్చిన రెండు రోజుల‌కే మ‌ళ్లీ కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డితే, మ‌హారాష్ట్ర‌లో మాత్రం గ‌త 15 రోజులుగా రాష్ట్ర‌ప‌తి పాల‌నలో సాగుతోంది. దానికి ప్ర‌ధాన కార‌ణం కూట‌మిగా మెజార్టీ సాధించిన బీజేపీ, శివ‌సేన మ‌ధ్య వ‌చ్చిన విబేధాలు. ప‌ద‌వుల పంప‌కం వ‌ద్ద ఏర్ప‌డిన సందిగ్ధ‌మే. ముఖ్యమంత్రి పదవి సహా కేబినెట్ పదవులన్నీ సమానంగా పంచుకోవాల్సిందేనంటూ శివసేన డిమాండ్ చేయడం.. అందుకు బీజేపీ అంగీకరించక పోవడంతో ప్రభుత్వ ఏర్పాటు నిలిచి పోవ‌డంతో చివ‌ర‌కు నాట‌కీయ ప రిణామాల‌కు వేదిక‌య్యింది. బీజేపీ, శివ‌సేన మ‌ధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోవ‌డంతో ఎన్సీపీతో బీజేపీ చేతులు క‌లిపింది. మొన్న‌టి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో క‌లిసి బ‌రిలో దిగి సీట్ల సంఖ్య పెంచుకున్న ఎన్సీపీ, ఈసారి బీజేపీతో క‌లిసి అధికారం పంచుకోవ‌డానికి సన్న‌ద్ధ‌మ‌య్యింది. ఈ ప‌రిణామాల‌తో శివ‌సేన‌కు ఉన్న‌ది పోగా, ఉంచుకున్న‌ది పోయింద‌న్న‌ట్టుగా త‌యార‌య్యింది.

బీజేపీ మార్క్ రాజ‌కీయాలు

ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో జేడీఎస్, కాంగ్రెస్ స‌ర్కారుని కూల్చ‌డంలో అమిత్ షా పాత్ర గురించి ఆరాష్ట్ర ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప బాహాటంగానే ప్ర‌క‌టించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు పంపిణీల విష‌యంలో కేంద్ర హోం మంత్రి వ్య‌వ‌హారం తేట‌తెల్లం అయ్యింది. ఇక మ‌హారాష్ట్ర వ్య‌వ‌హారాల‌ను మాత్రం నేరుగా మోడీ ఢీల్ చేయ‌డంతోనే శ‌ర‌ద్ ప‌వార్ దిగివ‌చ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. శ‌ర‌ద్ ప‌వార్, ఆయ‌న  అన్న కొడుకు అజిత్ ప‌వార్ మీద ప‌లు కేసులున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు వారి ఆస్తుల‌పై వివిధ ద‌ర్యాప్తు సంస్థ‌లు దాడులు కూడా చేశాయి. ఈ నేప‌థ్యంలోనే సామ‌దాన‌బేధదండోపాయాల‌తో ఎన్సీపీని త‌మ దారికి తెచ్చుకోవ‌డంలో బీజేపీ మార్క్ రాజ‌కీయాలు మ‌రోసారి ఫ‌లించిన‌ట్టు క‌నిపిస్తోంది. రాజ‌కీయాల్లో విలువ‌ల‌కు పెద్ద‌గా చోటు లేద‌ని, వ‌ర్త‌మానంలో అధికారం కోసం ఏం చేసినా నేరం కాద‌ని మ‌రోసారి నిరూపితం అయ్యింది. ఈ విష‌యంలో ఆర్థిక రాజ‌ధాని ముంబై మీద ప‌ట్టు కోల్పోకూడ‌ద‌ని ఆశించిన బీజేపీ ఎట్ట‌కేల‌కు అందుకు అనుగుణంగా పైచేయి సాధించ‌గ‌లిగింది. ఎన్సీపీ స‌హ‌కారం సంపూర్ణంగా దక్కితే స‌భ‌లో మెజార్టీ నిరూపించుకోవ‌డం ఫ‌డ్న‌విస్ కి పెద్ద ప‌ని కాబోదు.

Also Read : త్వరలో రచ్చబండ

అస్థిర రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు మ‌హారాష్ట్ర

మ‌హారాష్ట్ర‌లో బీజేపీ, శివ‌సేన మ‌ధ్య బంధం 30 ఏళ్ల పాటు కొన‌సాగింది. వారి అనుబంధం ప్ర‌స్తుతానికి తెర‌ప‌డింది. అదే స‌మ‌యంలో కాంగ్రెస్, ఎన్సీపీ మ‌ధ్య స్నేహం నిత్యం ఊగిస‌లాట‌గానే సాగింది. సోనియా గాంధీ విదేశీయ‌త‌ను చూపించి 1998లో కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌ప‌డి పీఏ సంగ్మా, తారిఖ్ అన్వ‌ర్ వంటి వారితో క‌లిసి పార్టీ ఏర్పాటు చేసుకున్న శ‌ర‌ద్ ప‌వార్ 2004 త‌ర్వాత మ‌ళ్లీ కాంగ్రెస్ కి చేరువ‌య్యారు. కానీ 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ తో క‌లిసి పోటీ చేసేందుకు కూట‌మి మ‌ధ్య సీట్ల స‌ర్థుబాటు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో విడిగా పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీకి అత్య‌ధికంగా 122 సీట్లు, శివసేన 63 సీట్లు గెలుచుకున్నాయి. ఇక కాంగ్రెస్ 42 స్థానాల‌కు ప‌రిమితం కాగా ఎన్సీపీ 21 సీట్ల‌కు ప‌డిపోయింది. దాంతో పృధ్వీరాజ్ చౌహ‌న్ స్థానంలో దేవేంద్ర ఫ‌డ్న‌విస్ ముఖ్య‌మంత్రి అయ్యారు. 1967-72 మ‌ధ్య వ‌సంత‌రావు నాయ‌క్ త‌ర్వాత ఐదేళ్ల ప‌ద‌వీకాలం పూర్తి చేసిన ముఖ్య‌మంత్రిగా ఫ‌డ్న‌విస్ గుర్తింపు పొందారు. అంత‌కుముందు విలాస్ రావు దేశ్ ముఖ్ కూడా 2004 నుంచి 2008 వ‌ర‌కూ నాలుగున్న‌రేళ్ల పాటు ప‌ద‌వీకాలం కొన‌సాగారు. మ‌హారాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఐదేళ్ల పాటు నిరంత‌రంగా కొన‌సాగిన ముఖ్య‌మంత్రులుగా వ‌సంత‌రావు నాయ‌క్, ఫ‌డ్న‌విస్ మాత్ర‌మే ఉండ‌డం గ‌మ‌నిస్తే ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎంత అస్థిర‌త ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. 18 ప్ర‌భుత్వాలు 14 మంది ముఖ్య‌మంత్రుల‌లో ఇద్ద‌రు మాత్ర‌మే పూర్తికాలం కొన‌సాగ‌గ‌లిగారు. మ‌ధ్య‌లో ప‌లువురు ప‌దే ప‌దే కుర్చీలు మారాల్సి వ‌చ్చింది. పీకే సావంత్ ప్ర‌భుత్వం కేవ‌లం 9 రోజులు మాత్ర‌మే అధికారంలో ఉండ‌గ‌లిగింది. 3 సార్లు రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించారు. ఈ నేప‌థ్యం గ‌మ‌నిస్తే ప్ర‌స్తుతం రెండోసారి పీఠం ఎక్కిన ఫ‌డ్న‌విస్ ఈసారి ఎంత కాలం ప‌ద‌విలో కొన‌సాగుతార‌న్న‌ది ఆస‌క్తిదాయ‌కం.