iDreamPost
android-app
ios-app

నేడు మహారాష్ట్ర, హర్యానా కౌంటింగ్

నేడు మహారాష్ట్ర, హర్యానా కౌంటింగ్

మహారాష్ట్ర, హరియాణా శాసన సభ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ రోజు ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మరాఠాల ప్రభావం అత్యధికంగా ఉండే మహారాష్ట్రలో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవీస్‌కు, జాట్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే హరియాణాలో పంజాబీ అయిన ఖట్టర్‌కు పగ్గాలు అప్పగించి బీజేపీ చేసిన ప్రయోగాన్ని ఓటర్లు ఎంతవరకు ఆమోదిస్తారో, వరసగా రెండోసారి సీఎంలు అయ్యే చాన్స్‌ వారికి వస్తుందా అన్నది నేటి ఫలితాలతో తెలిసిపోనుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది.


మహారాష్ట్రలో…

మహారాష్ట్ర శాసనసభ 288 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 3,237 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బీజేపీ 164 స్థానాల్లో పోటీ  చేస్తే మిత్రపక్షం శివసేన 124 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ 147 స్థానాల్లో, ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీ చేశాయి. ఈ రెండు కూటముల మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ద్వయం రాజకీయ వ్యూహాల ముందు విపక్షాలు నిలబడలేవని ఇంచుమించుగా ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ అంచనా వేస్తున్నాయి.

హరియాణా పీఠం ఎవరిది ?

హరియాణాలో మొత్తం 90 శాసనసభ స్థానాలకు గాను  1,169 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. హరియాణాలో కశ్మీర్‌ ఆర్టికల్‌ 370 రద్దు, జాతీయ భద్రత వంటి అంశాలపైనే ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికంగా దృష్టి పెడితే కాంగ్రెస్‌ రైతు సమస్యలు, నిరుద్యోగం, శాంతి భద్రతల అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ హోరాహోరీగా పోటీ ఇచ్చింది. 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే హరియాణాలో పోలింగ్‌ 76.54 నుంచి 68 శాతానికి భారీగా పడిపోవడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. దేవీలాల్‌ స్థాపించిన ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ పార్టీ (ఐఎన్‌ఎల్‌డీ) చీలిక వర్గం, దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలో ఏర్పడిన జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) కింగ్‌ మేకర్‌ పాత్ర పోషిస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. బీజేపీకి 32–44, కాంగ్రెస్‌కు 30–42, ఇక జేజేపీకి 6–10 స్థానాలు వస్తాయని ఇండియా టుడే పోల్స్‌లో వెల్లడైంది.