iDreamPost
iDreamPost
కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వారు నిరసిస్తున్నారు. ప్రైవేటు రంగానికి మద్దతు పలికేందుకు కార్మిక చట్టాలను అణిచివేయడం, మార్చడం, లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు/ ఆర్డినెన్స్‌లను జారీ చేస్తోందని ఉద్యోగవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ మేరకు ఎల్‌ఐసీలో ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ను వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు భోజన విరామసమయంలో బుధవారం దేశ వ్యాప్తంగా ఎల్‌ఐసీ కార్యాలయాల వద్ద నిరసనకు దిగాయి. కీలకమైన ఆర్ధిక, రైల్వే, రక్షణ, ఉక్కు, పెట్రోలియం, విద్యుత్ సంస్థలను ప్రైవేటు రంగానికి అప్పగిస్తోందన్నది వారి ప్రధాన ఆరోపణ. ఇందుకోసం నిరంతరం ఉద్యోగ కోతలు, వేతన కోతలు, బలవంతంగా ఉద్యోగ విరమణలు చేయిస్తోందంటున్నారు. ఇటువంటి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే నిరసనలకు తెరలేపారు.
ఎల్‌ఐసీ గురించి ఉద్యోగవర్గం చెబుతోందిదీ..
40 కోట్ల మంది పాలసీదారులు, 32 లక్షల కోట్ల ఆస్తులతో ఉన్న ఎల్‌ఐసీ క్లెయిమ్‌ల పరిష్కారశాతంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని చెబుతున్నాయి. ఇటువంటి సంస్థను ప్రైవేటు పరం చేయడాన్ని బలంగానే వ్యతిరేకిస్తున్నారు. 70శాతం మార్కెట్ వాటాతో, దేశ ఆర్ధిక వ్యవస్థలో 30 లక్షల కోట్లు పెట్టుబడులు ఎల్‌ఐసీ పెట్టిందని వివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, మౌలిక వనరుల ఏర్పాటుకై అందులో 24.10 లక్షల కోట్లు పెట్టుబడులుగా అందించిదన్నారు. యేడాదికి నాలుగు లక్షల కోట్లు అదనపు నిధులు సమీకరిస్తున్న ఎల్‌ఐసీ 2019–20లో రూ. 2,611 కోట్లు డివిడెండ్ రూపంలో, దాదాపు 10వేల కోట్లు పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించదని వివరిస్తున్నారు.
ఒక సారి ఎల్‌ఐసీని లిస్టింగ్ చేస్తే కేవలం మూడు శాతం మదుపుదారులకు మాత్రమే ప్రయోజనమని, 40 కోట్ల పాలసీదారుల ప్రయోజనాలకు, దేశాభివృద్ధికి ఈ సంస్థ ఉపయోగపడకుండా పోతుందని వారు వివరిస్తున్నారు. ఇటువంటి లాభదాయక సంస్థలో వాటాలను అమ్మడానికి ప్రయత్నిస్తే పాలసీదారులతో కలిసి దేశ వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ఉద్యోగ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఎల్‌ఐసీలో ఐపీఓ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.