వొరే పుల్లారావు మనం బీహార్ ప్రచార సభలకు ఎల్లోద్దామ ఆశగా అడిగాడు వెంగల్రావు…
కరోనా తాండవం చేస్తుంటే బీహార్ వెళ్తా అంటున్నావ్.. పిచ్చి ఏమైనా పట్టిందా నీకు? ఆశ్చర్యంగా అన్నాడు పుల్లారావు..
అది కాదురా బాబు.. అక్కడ బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా..బీహార్ వెళ్లి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాల్గొనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశగా ఉందిరా అసలు విషయం బయట పెట్టాడు వెంగల్రావు..
ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాలకు దిక్కులేదు కానీ నీకు బీహార్ రాజకీయాలు కావాల్సి వచ్చాయా? పుల్లారావు ప్రశ్నార్థకంగా చూసాడు.
అదేం లేదురా బాబు.. బీహార్ వెళ్తే మనకి కొన్ని కలిసొస్తాయ్.. ఆ విషయం నీకు తెలీదు.. తన మదిలో ఉన్న ఆలోచనకు తనకు తానే శభాష్ అనుకుని మురిసిపోయి ముసిముసిగా నవ్వుకున్నాడు వెంగల్రావు..
ఇంతకీ నీకు బీహార్ ఎలక్షన్స్ పై మనసు ఎందుకు మళ్లిందో చెప్పు.. అదీ కాక నితీశ్ కుమార్ సభలకు మాత్రమే వెళ్తాను అంటున్నావు అంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది. అసలు విషయం చెప్పు ఆసక్తిగా అడిగాడు పుల్లారావు.
సరే ఈ సీక్రెట్ మనిద్దరి మధ్యే ఉండాలి ఎవరికి తెలియనివ్వను అని ఒట్టేయ్ అని గుసగుసగా అన్నాడు వెంగల్రావు..
సరే ఎవ్వరికి చెప్పను.. అసలు విషయం ఏంటో చెప్పేయ్ రా బాబు టెన్షన్ పెట్టకుండా అంటూ విసుగ్గా వెంగల్రావు వైపు చూసాడు పుల్లారావు..
సరే అసలు విషయం చెప్పేస్తా విను..బయట ఉల్లిపాయల రేట్లు ఎంతలా మండిపోతున్నాయో తెలుసు కదా..కిలో వంద దాటింది.. అదే నితీశ్ సభలకు వెళ్ళాం అనుకో మనకు ఉల్లిపాయలు ఫ్రీగా వస్తాయి.. డబ్బులు మిగుల్తాయి..అసలు రహస్యాన్ని చెప్పేసాడు వెంగల్రావు..
అంటే తన ప్రచార సభలకు వస్తే నితీశ్ కజమార్ ఉల్లిపాయలు ఫ్రీగా ఇస్తానని చెబుతున్నాడా.. అర్థం కాక బుర్ర గోక్కున్నాడు పుల్లారావు..
ఎహె నీకేం తెలీదు.. నితీశ్ కుమార్ సభల్లో ప్రసంగం చేస్తుంటే అక్కడ ప్రజలు ఉల్లిపాయలతో కొడుతున్నారంట..మధుబనిలోని హర్లాఖీ ర్యాలీలో ఉల్లిపాయల దాడి జరిగితే భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై చుట్టూ కవచంలా చేరారు. అదే మనం అక్కడ ఉంటే ఎంచక్కా ఆ ఉల్లిపాయలు ఏరుకుని తెచ్చుకునేవాళ్ళం. ఆ ఉల్లిపాయలు విసిరినోళ్లు కోటీశ్వరులు అయ్యుంటారు. లేకుంటే ఖరీదైన ఉల్లిపాయలతో కొట్టడం ఏంటి.. అది సరే కానీ రేపు బీహార్ వెళ్ళడానికి ట్రైన్ టికెట్లు బుక్ చేస్తున్నా నువ్ వస్తున్నావ లేదా? గదమాయించి అడిగాడు వెంగల్రావు.
పుల్లారావు ఆశ్చర్యంతో చూస్తూ అసలిలాంటి అవుడియాలు ఎలా ఒస్తాయిరా బాబు నీకు.. ఏదో కొందరు వ్యక్తులు ఉల్లిపాయలతో నితీశ్ కుమార్ పై దాడి చేసారని బీహార్ వెళ్లిపోతావ? ఎంత ఉల్లి ఖరీదైన కూరగాయగా మారిపోతే మాత్రం ఇంత వెంగలప్పలా ఆలోచిస్తే ఎలా? నీకో నిజం చెప్తా విను.. ఏదో నిన్నటి వార్తలు చూసి నువ్విలా బీహార్ వెళ్ళడానికి తయారవుతున్నావ్ కానీ కొన్ని రోజుల ముందు అదే నితీశ్ కుమార్ పై చెప్పులతో దాడి చేశారు కొందరు వ్యక్తులు. నువ్వెళ్లిన వేళా విశేషంలో కర్రలతోనో రాళ్లతోనో దాడి చేసారనుకో ముక్కు మూతి పగలకొట్టుకుని రావాలి. లేకుంటే కంపుకొట్టే చీకిపోయిన చెప్పులు మొహానికి తగులుతుంటే వాటినుండి తప్పించుకోవడానికి అటూ ఇటూ పరిగెత్తాలి. ఇవన్నీ మనకి అవసరమా చెప్పు..నువ్ చెప్పింది నిజమే ఖరీదైన ఉల్లిపాయల కోసం బీహార్ సభలకు వెళ్లి తెచ్చుకోవాలని నాక్కూడా ఆశగా ఉంది. కానీ మన ఆశలకు కూడా హద్దులు ఏర్పరుచుకోవాలి. లేకుంటే బీహారోల్ల గురించి తెలిసిందేగా.. ముక్కు మొహం ఏకం చేసి పంపిస్తారు.. మనకు ఇవన్నీ అవసరమా చెప్పు.. ఉల్లిపాయల కోసం బీహార్ వెళ్లి ఎదురుదెబ్బలు తిన్న వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోవడం నాకిష్టం లేదు.. నీకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళు.. హితోపదేశం చేసాడు పుల్లారావు.
బ్రతికుంటే ఉల్లిపాయలు లేని కూరలు వండుకుని తినొచ్చేమో కానీ ఉల్లిపాయల కోసం బీహార్ వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాడు వెంగల్రావు..