iDreamPost
android-app
ios-app

జగన్‌ సర్కార్‌ కీలక ముందడుగు

జగన్‌ సర్కార్‌ కీలక ముందడుగు

సంక్షేమ పథకాలు, అభివృద్ధితోపాటు ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో భూమి రికార్డుల ప్రక్షాళన, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంతా.. జగన్‌ సర్కార్‌ తలపెట్టిన సమగ్ర భూ రీ సర్వే ప్రక్రియలో తొలి అడుగు విజయవంతంగా పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వేలో భాగంగా పైలెట్‌ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో చేపట్టిన సర్వే పూర్తయింది. ఈ మేరకు అధికారులు పైలెట్‌ ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. పైలెట్‌ ప్రాజెక్టులో తలెత్తిన సమస్యలు, అడ్డంకులను పరిశీలించి, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే సర్వే సాఫీగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.

స్వాతంత్రం వచ్చి 74 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ బ్రీటీషు కాలం నాటి భూ రికార్డులే అందుబాటులో ఉన్నాయి. ప్రతి 30 ఏళ్లకు ఒక సారి భూముల రీ సర్వే చేసి రికార్డులను సఛ్చీకరణ చేయాల్సి ఉండగా.. ఆ పని జరగలేదు. మూడు, నాలుగు తరాలు మారడం, క్రయ విక్రయాలు జరగడంతో అనేక భూ వివాదాలు తలెత్తాయి. వీటి పరిష్కారం కోసం అటు అధికారులు, ఇటు భూ యజమానులు తలలుపట్టుకుంటున్నారు. అంతేకాకుండా అవినీతికి ఆస్కారం ఏర్పడుతోంది. కోర్టుల్లో ఏళ్ల తరబడి సివిల్‌ కేసులు నడుస్తున్నాయి. భూ సమస్యల అంశం ప్రజా సంకల్ప పాదయాత్రలో సీఎం జగన్‌ దృష్టికి ప్రతి గ్రామంలో వచ్చాయి. దీంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రైతులకు రూపాయి ఖర్చు లేకుండా భూములు రీ సర్వే చేసి వారికి యాజమాన్య హక్కులు శాశ్వతంగా కల్పిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేసే లక్ష్యంతోనే.. కొత్తగా ఏర్పాటు చేసిన 11,158 గ్రామ సచివాలయాల్లో సర్వేయర్లను నియమించారు. గతంలో మండలానికి ఒకరు చొప్పన సర్వేయర్‌ ఉండగా.. ప్రస్తుతం ప్రతి గ్రామ సచివాలయానికి ఒక సర్వేయర్‌ అందుబాటులో ఉన్నారు. కంటిన్యూస్‌లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్‌ (కార్స్‌) అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో భూముల రీ సర్వే చేయనున్నారు. ఇందుకు సంబంధించి సర్వేయర్లకు శిక్షణ జరుగుతోంది. మండలం యూనిట్‌గా మూడు దశల్లో భూముల రీ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రక్రియలో రైతులు ఎలాంటి సేవా రుసుము ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో 1.63 లక్షల చదరపు కిలోమీటర్ల ఉండగా… అటవీ భూమి పోను 1.22 లక్షల చదరపు కిలోమీటర్ల భూమిని రీ సర్వే చేయాల్సి ఉంది. అతి త్వరలో భూమల రీ సర్వే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు.