iDreamPost
iDreamPost
జిహాద్ తదితర పేర్లతో ఉగ్రవాద సంస్థలకు విరాళాలు ఇవ్వడం, సేకరించడం తీవ్ర నేరమని, దేశద్రోహం కిందకే వస్తుందని పాకిస్తాన్ లోని లాహోర్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇద్దరు టెర్రరిస్టులు చేసుకున్న అప్పీళ్లను తిరస్కరించింది. వారికి యాంటీ టెర్రరిస్ట్ కోర్ట్ విధించిన శిక్షను సమర్థించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) అనే సంస్థకు చెందిన మహమ్మద్ ఇబ్రహీం, ఒబేదుర్ రెహ్మాన్ అనే ఇద్దరు ఉగ్రవాదులను సర్గోదా వద్ద పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి టీటీపీ పాంప్లెట్లు, చందా పుస్తకాలు, రసీదులు స్వాధీనం చేసుకున్నారు. వారికి సర్గోదా యాంటీ టెర్రరిస్ట్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ వారు లాహోర్ హైకోర్టులో అప్పీలు చేశారు.
నిందితుల వాదనలను తిరస్కరించిన ద్విసభ్య బెంచ్ జడ్జి అలీ బాకర్ నజఫీ.. నిందితుల వద్ద ఉన్న పాంప్లెట్లు, పుస్తకాలు నిషేధిత ఉగ్రవాద సంస్థకు చెందినవని ప్రస్తావించారు. ఆ సంస్థ దేశంలో అనేక విధ్వంస చర్యలకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా.. యుద్ధ సమయాల్లో అవసరం అనిపిస్తే ప్రభుత్వమే యుద్ధ నిధి పేరుతో విరాళాలు సేకరించవచ్చని అన్నారు. కానీ జిహాద్ (పవిత్ర యుద్ధం) పేరుతో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు ఇష్టం వచ్చినట్లు విరాళాలు వసూలు చేయడం కచ్చితంగా దేశద్రోహం కిందకే వస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితులకు కింది కోర్టు వేసిన శిక్షను సమర్థించారు.
దాడులు, విధ్వంసాలకే వసూళ్లు
ఉగ్రవాద సంస్థలు రకరకాల పేర్లతో విరాళాలు వసూలు చేయడం కొత్తకాదు. తమ సంస్థల నిర్వాహణ, లక్ష్యాలపై, దేశాలపై దాడులకు అవసరమైన ఆయుధ సామాగ్రి కొనుగోలుకు జిహాదీ తదితర పేర్లతో వసూలు చేసిన సొమ్మును ఖర్చు చేస్తుంటారు. ఇటువంటి వ్యవహారాలన్నీ పాకిస్తాన్ కేంద్రంగానే సాగుతుంటాయి.
నిషేధిత ఉగ్ర సంస్థల సభ్యులు ఆ దేశంలో విచ్చలవిడిగా సంచరిస్తూ ఇండియాపై దాడులకు పన్నాగాలు పన్నుతుంటారు. అంతర్జాతీయంగా టెర్రర్ ఫైనాన్సింగ్ ను అడ్డుకునేందుకు పనిచేస్తున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ ఏ టీ ఎఫ్) అనే సంస్థ పాకిస్తాన్ పై పలు రూపాల్లో ఒత్తిడి తేవడంతో.. కొంత కాలంగా పాక్ న్యాయ, పోలీస్ వ్యవస్థలు టెర్రర్ ఫైనాన్సింగుకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే అల్ ఖైదా, ఇతర టెర్రరిస్టు ముఠాల సభ్యులు పలువురిని అరెస్టు చేసి జైళ్లలో పెట్టాయి.. తాజాగా లాహోర్ కేసు కూడా ఆ కోవలోదే.
ముంబై పేలుళ్ల సూత్రధారికీ ఈ తరహా కేసులో శిక్ష
2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దావా అధినేత హఫీజ్ సయీద్ కూడా టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులోనే అరెస్టు అయ్యి శిక్ష అనుభవిస్తుండటం విశేషం. ముంబై పేలుళ్లకు పాల్పడిన లష్కర్ ఏ తోయిబా సంస్థ ప్రధాన పోషకుల్లో జమాత్ ఉద్ దవా ఒకటి. ఆ పేలుళ్ల వెనుక మాస్టర్ మైండ్ కూడా సయీద్ దే. 71 ఏళ్ల సయీద్ ను యునైటెడ్ నేషన్స్ సంస్థ గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించగా.. అమెరికా అతని తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది. చివరికి అతగాడు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో అరెస్ట్ కాగా 36 ఏళ్ల శిక్ష పడింది. ప్రస్తుతం లాహోర్ లోని కోట్ లఖ్ పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.