మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రే ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? అనే ప్రశ్న ప్రస్తుతం అందరిలోను నెలకొంది. తాజాగా లగడపాటి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను కలవడంతో ఈ చర్చ సాగుతోంది. కాంగ్రెస్ తరఫున రెండు సార్లు లగడపాటి రాజగోపాల్ ఎంపీగా గెలిచారు. ఆయన వైఎస్సార్ కి వీర విధేయుడిగా ఉండేవారు. ఇక వైఎస్సార్ మరణానంతరం ఆయన ఉమ్మడి ఏపీ విభజన మీద పోరాటం చేశారు. ఏపీ సమైక్యంగా ఉండాలన్నది ఆయన డిమాండ్.
అయితే మొత్తానికి ఏపీ విడిపోయింది. రాష్ట్రం విడిపోదని, అదే జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానకి లగడపాటి ప్రకటించారు. చెప్పినట్లుగానే రాజకీయాలకు స్వస్తి పలికారు. 2019 ఎన్నికల్లో ఏపీలో ఆయన టీడీపీ గెలుస్తుంది అని సర్వే నివేదిక ఇచ్చారు. అయితే అది కాస్తా బెడిసికొట్టడంతో ఆయన సర్వేలు మానుకున్నారు. ఇక ఆయన టీడీపీకి చంద్రబాబుకు సానుభూతిపరుడుగా ఉంటున్నారు అన్నదే ఇన్నాళ్ళుగా సాగిన ప్రచారం.
ఇక లగడపాటి పెద్ద కొడుకు ఆశ్రిత్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా గన్నవరం నుంచి దింపుతారని కూడా ఈ మధ్య ప్రచారం సాగింది. అయితే ఈ ఆఫర్ మీద లగడపాటి అంతగా సుముఖంగా లేరని అంటున్నారు. ఈ నేపధ్యంలో లగడపాటి సడెన్ గా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కనిపించారు. ఆయనతో కలసి డైనింగ్ టేబుల్ మీటింగ్స్ నిర్వహించారు.
ఇది ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. లగడపాటి ఎందుకు వైసీపీ ఎమ్మెల్యేను కలిశారు అన్నదే చర్చ. లగడపాటి రాజకీయ రీఎంట్రీ మీద కూడా అపుడే ప్రచారం మొదలైంది. ఆయన వైసీపీలో చేరుతారని, ఆయనకు విజయవాడ ఎంపీ సీటు ఇస్తే వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారనే ప్రచారం మీడియాలో జరుగుతోంది.
73107