iDreamPost
iDreamPost
తరతరాలుగా ఆ గ్రామాలు ఆంధ్ర రాష్ట్రంలో భాగంగా ఉన్నాయి. ఇప్పటికీ వారంతా ఈ రాష్ట్రంలోనే ఉండాలని కోరుకుంటున్నారు. కానీ గతంలో జరిగిన తప్పులు.. వాటిని సరిదిద్దడానికి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వారు ఇబ్బందుల్లో పడ్డారు. ఏ రాష్ట్రానికి చెందుతామో తెలియక సతమతం అవుతున్న ఆ గ్రామాలు కొటియా గ్రూపునకు చెందినవి. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని ప్రయత్నాన్ని ప్రస్తుత సీఎం జగన్ చేయడం.. తమ సమస్యపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో చర్చలు జరపడంతో వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తాము ఆంధ్రలోనే కొనసాగుతామన్న ధీమా వ్యక్తం అవుతోంది.
ఆంధ్రకు చెందినా.. ఒడిశాతో ఇబ్బందులు
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఐదు పంచాయతీల పరిధిలో 34 కొటియా గ్రామాలు ఉన్నాయి. 1936లో ఒడిశా రాష్ట్రం ఏర్పడినప్పుడు గానీ, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైనప్పుడు గానీ సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించినప్పుడు ఈ గ్రామాలను విస్మరించారు. దాంతో అవి తమవేనని ఒడిశా వాదించడం ప్రారంభించింది. 1963లో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. అయితే రెండు రాష్ట్రాలు పరస్పర చర్చలతో పరిష్కారించుకోవాలని.. అప్పటివరకు యదార్థ స్థితి కొనసాగించాలని కోర్ట్ 2006లో తీర్పు చెప్పింది. అయితే ఆ మేరకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చర్చలకు చొరవ తీసుకోలేదు. కాగా ఈ గ్రామాల్లో ఉన్న సుమారు 15 వేల మంది ప్రజలు పూర్వీకుల నుంచీ ఆంధ్రావాసులమేనని అంటున్నారు. ఇక్కడి ఆచార సంప్రదాయాలనే పాటిస్తున్నారు. ఆంధ్ర చిరునామాలతోనే ఆధార్, ఓటరు కార్డులు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ రేషన్ కార్డులతోనే సంక్షేమ పథకాలు అనుభవిస్తున్నారు.
జగన్ చొరవపై సంతోషం
ఈ గ్రామాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పనితీరుపై నమ్మకంతో ఏపీలోనే కొనసాగుతామని చెబుతున్నా.. ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు తరచూ గ్రామాల్లోకి వచ్చి ఒడిశాలో కొనసాగమని, ఆ రాష్ట్రవాసులమని చెప్పమని బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏపీ పథకాలు, పనులను అడ్డుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు. దాంతో విసిగిపోయిన స్థానికులు గత నెలలో ఒడిశా అధికారులపై తిరగబడ్డారు. తాము ఆంధ్రావాసులమేనంటూ.. పూర్వకాలంనాటి భూమి శిస్తుకు చెందిన తామ్రపత్రాలు చూపించారు. ఆంధ్రలోనే కొనసాగుతామని 16 గ్రామాల ప్రజలు తీర్మానాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఒడిశాకు వెళ్లడం, ఇతర సమస్యలతో పాటు కొటియా వివాదాన్ని కూడా ప్రస్తావించడాన్ని ఇక్కడి ప్రజలు ప్రశంసిస్తున్నారు. వివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాల ఉమ్మడి కమిటీని నియమించడంతో త్వరలోనే ఈ వివాదం కూడా సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Ap, Odisha – జాయింట్ కమిటీ పరిశీలించే అంశాలు ఇవే..