iDreamPost
android-app
ios-app

12 కాదు.. 6తోనే స‌రిపెట్ట‌కోమ‌న్న బీజేపీ..!

12 కాదు.. 6తోనే స‌రిపెట్ట‌కోమ‌న్న బీజేపీ..!

భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన పొత్తు ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టి నుంచీ.. జ‌న‌సేన‌కు అన్యాయం జ‌రుగుతూనే ఉంది. ఏకంగా ఆ పార్టీ తెలంగాణ‌లో గాజు గ్లాసు గుర్తునే కోల్పోయింది. అద‌లా ఉంచితే.. పొత్తు పేరుతో జ‌న‌సేన‌ను వాడుకుని వ‌దిలేస్తోంద‌ని జ‌న‌సైనికులు ప‌దే ప‌దే ఆరోపిస్తూనే ఉన్నారు. స్వ‌యానా ఆ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం త‌మ‌కు స‌ముచిత గౌర‌వం ఇస్తుంటే, రాష్ట్ర నాయ‌క‌త్వం ప‌ట్టించుకోవ‌డం లేదంటూ బ‌హిరంగంగా విమ‌ర్శించారు. అంతేకాదు.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అపోజిష‌న్ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చి షాక్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఖ‌మ్మం మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు మ‌రోసారి బీజేపీ షాక్ ఇచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. బీజేపీతో పొత్తులో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 12 డివిజన్లలో జనసేన పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ పొత్తు ఖ‌రారైన మొద‌ట్లో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న అనంత‌రం చూస్తే స‌గానికే ప‌రిమితం అయిన‌ట్లు తెలుస్తోంది.

పొత్తు లో భాగంగా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కొన్ని సీట్ల‌లో అయినా పోటీ చేద్దామ‌ని జ‌న‌సేన నేత‌లు ఉత్సాహం చూపారు. కొన్ని చోట్ల నామినేష‌న్ కూడా వేశారు. జనసేనతో బీజేపీకి పొత్తేలేదు పొమ్మని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్ర‌క‌ట‌న‌పై అసంతృప్తితో ఉన్న ప‌వ‌న్ ను ఎలాగోలా బుజ్జ‌గించి.. మొత్తానికి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండానే చేశారు. మునిసిపోల్స్ సంద‌ర్భంగా ఇప్పుడు మ‌రోసారి ఇరు పార్టీల పొత్తు ముచ్చ‌ట చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఈ నెల 21వ తేదీన ఖ‌మ్మం కార్పొరేష‌న్ లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను జ‌న‌సేన విడుద‌ల చేసింది. చిత్రం ఏమిటంటే ఆందులో 6 డివిజన్లకు మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. నామినేష‌న్లు వేసింది కూడా అంతే. బీజేపీతో పొత్తుల్లో భాగంగా ఆరుమంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నట్లు మిగిలిన డివిజన్లలో బీజేపీనే పోటీచేస్తుందని ప్రెస్ నోట్లో స్పష్టంగా ఉంది. మరి ఇదే నిజమైతే 18వ తేదీన 12 డివిజన్లలో పోటీ చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించింది ? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

నాలుగు రోజుల వ్యవధిలో పోటీచేసే డివిజన్ల సంఖ్య సగానికి సగం ఎందుకు తగ్గిపోయింది ? అన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు. అభ్యర్ధులు లేక జనసేనే డివిజన్లను తగ్గించుకుందా ? లేకపోతే జనసేనకు అంతసీన్ లేదని బీజేపీయే డివిజన్లను తగ్గించేసిందా అన్నదే అర్ధం కావటంలేదు. ఏదేమైనా జనసేనకు బీజేపీ గట్టి షాకిచ్చిందనే చెప్పాలి. విచిత్రమేమిటంటే ఇప్పటివరకు జనసేనతో తమకు పొత్తు ఉందన్న విషయం బీజేపీ అధ్యక్షుడు బండి ఎక్కడా ప్రకటించినట్లులేదు. గతంలో పొత్తులేదని ప్రకటించిందే అధికారికం. ఆ తర్వాత బండి ఇప్పటివరకు పొత్తుల గురించి మాట్లాడలేదు. రెండుపార్టీల మధ్య పొత్తున్నదంటే రెండుపార్టీల నేతలు ఆ విషయాన్ని ప్రకటించాలి. కానీ ఇక్కడ పొత్తుంది అనే విషయాన్ని జనసేన మాత్రమే ప్రకటిస్తోంది. పొత్తు విషయాన్ని అసలు బీజేపీ నేతలు ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌క‌టించ లేదు. ఆ ఆరు డివిజ‌న్ల‌లో మాత్రం త‌మ అభ్య‌ర్థుల‌ను నిల‌ప‌లేదు. కానీ, ఉన్న‌ట్టుండి స‌గానికి స‌గం సీట్ల‌ను జ‌న‌సేన‌కు త‌గ్గించేయ‌డంతో ఇరు పార్టీల పొత్తు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది.