ఆపరేషన్ దక్షిణ కమలంలో భాగంగా క్రమంగా దక్షిణ భారతదేశ రాజకీయాల మీద పట్టు పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ దీనికోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ ఏడాదే కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో క్రమక్రమంగా అక్కడి రాజకీయాలు వేడి పుంజుకుంటున్నాయి. శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ కీలక రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా కమ్యూనిస్టులకు కంచుకోట కేరళ పై భారతీయ జనతా పార్టీ గుర్తు పెట్టినట్లు తెలుస్తోంది. కేరళలో కచ్చితంగా ఈ సారి పాగా వేసేందుకు అవసరమైన సమీకరణాలు వేస్తోంది.
ఆమోదయోగ్యమైన వారిని తీసుకోవాలని..
కేరళలో అక్షరాస్యత శాతం ఎక్కువ. రాజకీయ చైతన్యం కూడా అధికం. ఇక్కడ గెలుపు సాధారణ విషయం కాదు. ఎంతో విజ్ఞతతో, అలోచించి ఓటేసేవారు కనిపిస్తారు. అందుకే బీజేపీ ఇప్పుడు కొత్త ఫార్ములా ను కేరళలో అనుసరిస్తోంది. వివిధ రంగాల్లో ప్రముఖులైన వారు మేధావివర్గం గా ఉన్నవారు నిజాయితీ పరులుగా దేశానికి సేవ చేసిన వారుగా ఉన్న కొందరిని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఖచ్చితంగా వారిని పార్టీలోకి తీసుకొచ్చి ఒక కొత్త రూపం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇప్పటికే మెట్రోమాన్ శ్రీధర్ న్ ను పార్టీలోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసిన బిజెపి త్వరలో పరుగుల రాణి పి.టి.ఉష ను సైతం బీజేపీ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పి.టి.ఉష సైతం బిజెపి ఆహ్వానాన్ని మన్నించి రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.అయితే వీటిని పి.టి.ఉష గాని ఆమె కుటుంబ సభ్యులు గానీ ధ్రువీకరించడం లేదు.
కొంతకాలంగా అనుకూలంగా
పరుగుల రాణి పి.టి.ఉష గత కొంతకాలంగా బిజెపి కు సానుకూలంగా మాట్లాడుతున్నారు. కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాల పైన కూడా బీజేపీకి ఆమె మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా ఇటీవల కొందరు అంతర్జాతీయ సెలబ్రిటీలు రైతు చట్టాల పై చేసిన వ్యాఖ్యలను సైతం పి.టి.ఉష ఖండించారు. రైతు చట్టాలు మంచిదే అన్న రీతిలో ట్విట్టర్లో కూడా స్పందించారు. దీంతో ఆమె త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు కేరళ మొత్తం మీద గట్టిగా వార్తలు వచ్చాయి. బిజెపి జాతీయ నాయకులు కేరళలో పర్యటించినప్పుడు ఆమె బిజెపి తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కేరళ పై ప్రత్యేక దృష్టి
దక్షిణాదిన దేవభూమిగా పిలుచుకునే కేరళలో వామపక్ష పార్టీ సీపీఎం అధికారంలో ఉంది. కేరళలో ఎప్పటినుంచో వామపక్షాలకు మంచి పట్టు ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రం మీద బిజెపి దృష్టిపెట్టినట్లు అర్థమవుతోంది. ఇక్కడ కచ్చితంగా పాగా వేసేందుకు సైతం బిజెపి తహతహలాడుతోంది. గతంలో శబరిమల లో మహిళల ప్రవేశానికి అనుకూలంగా బిజెపి ఉద్యమాన్ని ఉధృతం చేసిన అనుకున్న ఫలితం కనిపించలేదు. ఆ ఉద్యమం కూడా పక్కదారి పట్టింది. అయితే ఇప్పుడు పార్టీ మైలేజ్ రావాలంటే కచ్చితంగా అందరూ ఆమోదించే వారిని తీసుకుని, వారి ద్వారా రాజకీయాల్లో ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుందని కేరళలో ఖచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి భావిస్తోంది.
రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకం
శబరిమల వివాదం తర్వాత కేవలం హిందుత్వ వాదాన్ని నమ్ముకుంటే కేరళలో ముందుకు వెళ్లడం సాధ్యంకాదు అని భావించి, ఇప్పుడు పలు రంగాల నుంచి ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. మరో పక్క కాంగ్రెస్ కు సైతం కేరళ ఇప్పుడు కీలకమైంది. కేరళలోని వాయనాడ్ నుంచే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గెలిచారు. తమ సొంత నియోజకవర్గం ఆమేథి లో ఓడినా కేరళ ప్రజలు రాహుల్ ను ఆదరించారు. దీంతో ఇప్పుడు కేరళలో కచ్చితంగా పట్టు నిలుపుకోవడం అన్నది కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మక విషయం అయింది. దీంతో వచ్చే శాసనసభ ఎన్నికలను ఇటు భాజపా అటు కాంగ్రెస్ సైతం ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.