తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త చట్టం కేవలం రెవెన్యూ పరమైన మార్పులకే పరిమితం కాదు. దాన్ని ఆనుకుని మొత్తం వ్యవస్థ ప్రక్షాళనకు తొలి అడుగు వేసినట్లు తెలుస్తోంది. దీని వెనుక కేసీఆర్ కు సుదీర్ఘ విజన్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ కొత్త చట్టం అంతం కాదు.. ఆరంభం మాత్రమే అని శుక్రవారం జరిగిన శాసనసభలో కేసీఆర్ అన్న మాటలు మున్ముందు జరగబోయే మరిన్ని మార్పులకు శూచికగా భావించవచ్చు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజునే అన్ని రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తూ ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
శనివారం నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దేవాదాయ, వక్ఫ్ భూములు క్రయ, విక్రయాలు రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామన్నారు. ఆలయ భూములను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వీటన్నింటి వెనక సుదీర్ఘ కాలంగా నడుస్తున్న వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా కేసీఆర్ బలమైన వ్యూహం రచిస్తున్నట్లుగా సమీకరణాలు జరుగుతున్నాయి.
చట్టాల్లోని లొసుగులపై సుదీర్ఘ కసరత్తు
రెవెన్యూ చట్టం రద్దు.. కొత్త చట్టం ప్రవేశం వెనక కేసీఆర్ కొన్నాళ్లుగా సుదీర్ఘ చర్చ జరుపుతున్నారు. ఆయా రంగాల నిపుణులు, ఉన్నతాధికారులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో మంతనాలు చేస్తున్నారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దు.. కొత్త పాలన కు సంబంధించి అన్ని అంశాలనూ కేసీఆర్ పరిశీలనలలోకి తీసుకున్నారు. ప్రధానంగా ఏ చట్టంలో ఏ లొసుగులు ఉన్నాయి.. అవినీతికి ఆస్కారం ఎక్కడుంది.. అనే అంశాలపై తీవ్ర కసరత్తు చేసినట్లు తెలిసింది. కేవలం భూ వివాదాలకు సంబంధిందే కాదు.. ఇతర లావాదేవీలలోనూ ఎదురవుతున్న సవాళ్లను గుర్తించారు.
దీనిలో భాగంగా రాష్ట్రంలో పారదర్శకమైన పాలన కొనసాగాలంటే సంస్కరణలు అవసరమని భావించారు. దానిలో భాగంగా నూతన చట్టం సంస్కరణలలో తొలి అడుగు మాత్రమే అని భావించొచ్చు. పీటముడి పడి పరిష్కారం దొరకని అనేక సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కూడా అసెంబ్లీలో ప్రకటించారు. రెవెన్యూ చట్టం కేవలం భూ వివాదాలు పరిరక్షణకే కాకుండా పలు చట్టాల సమాహారంగా కొనసాగేలా రూపకల్పన చేసినట్లు వెల్లడించారు.
సమగ్ర సర్వేపై ప్రధాన ఫోకస్..
కొత్త రెవెన్యూ చట్టం తర్వాత సమగ్ర భూ సర్వేను కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అది పూర్తయ్యే వరకూ దానిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రులకు, ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలిసింది. అసెంబ్లీలో కేసీఆర్ సర్వేను ప్రస్తావిస్తూ.. సమైఖ్య రాష్ట్రంలో 160కి పైగా చట్టాలు ఉండేవని, తెలంగాణలో ప్రస్తుతం 87 రెవెన్యూ చట్టాలు అమల్లో ఉన్నామని వెల్లడించారు. ధరణి ఒక్కటే కాదనీ, మిగిలిన చట్టాలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. రెవెన్యూ కోర్టుల్లో 16వేల కేసులు, హైకోర్టులో 2వేల కేసులు ఉన్నాయని, సమగ్ర సర్వే చేస్తేనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు.