iDreamPost
android-app
ios-app

స్టైల్ మార్చిన కేసీఆర్.. 2023కు ఇప్ప‌టి నుంచే స‌న్నాహాలు

స్టైల్ మార్చిన కేసీఆర్.. 2023కు ఇప్ప‌టి నుంచే స‌న్నాహాలు

తెలంగాణ తెచ్చిన ఉద్య‌మ నాయ‌కుడిగా క‌ల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు అన‌బ‌డే కేసీఆర్ కు ప్ర‌జ‌ల్లో స‌ముచిత‌మైన స్థాన‌మే ఉంది. ఆయ‌న పంచ్ వేశారంటే విప‌క్షాలు బెద‌రాల్సిందే. తెలంగాణ మ‌నోభావాల‌ను చాటుతూ ఆయ‌న మాట్లాడారంటే.. ప్ర‌జ‌ల్లో గుండెల్లో పాతుకుపోవాల్సిందే. ఈ నేప‌థ్యంలో గ‌త రెండు ప‌ర్యాయాలు కూడా బంప‌ర్ మెజార్టీతో తెలంగాణ పీఠాన్ని సులువుగానే అధిరోహించారు. ఇప్ప‌టికే రెండు సార్లు అధికారంలో ఉన్నాం.. ఎంతో కొంత వ్య‌తిరేక‌త ఉంటుంద‌న్న అనుమాన‌మో, బీజేపీ బ‌ల‌ప‌డుతోంద‌న్న భ‌య‌మో కానీ.. 2024లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌కు కేసీఆర్ కూడా ఇప్ప‌టి నుంచే ప‌క్కా వ్యూహంతో వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో రెండు ప‌ర్యాయాలు కూడా ఎన్నిక‌ల‌కు మ‌హా అయితే ఏడాది ముందు నుంచే కేసీఆర్ దృష్టి పెట్టారు. అయిన‌ప్ప‌టికీ అత్య‌ధిక మెజార్టీతో గెలుపొందారు. కానీ, 2023 ఎన్నిక‌ల‌కు మూడేళ్ల ముందు నుంచే దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే చాలా ర‌కాలుగా మార్పు క‌నిపిస్తోంది. నిత్యం ఏదో శాఖ‌ల‌తో స‌మీక్ష చేస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌ల ద్వారా ప్ర‌జా క్షేత్రంలో ఉంటున్నారు. ప్రగతిభవన్ లో పలు శాఖలకు సంబంధించిన రివ్యూల్ని ఆయన నిర్వహిస్తున్నారు. మరికొన్ని వారాల్లో తెలంగాణను తాకుతుందని అంచనా వేస్తున్న థర్డ్ వేవ్ మీద కేసీఆర్ తరచూ రివ్యూల్ని చేస్తున్నట్లు చెప్పాలి. ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన అప్డేట్ అవుతున్నట్లుగా పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ మధ్యనే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. తాజాగా మరో కాబినెట్ భేటీకి డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 13న మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. కాబినెట్ లో చర్చించాల్సిన విషయాలపై ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. కొత్త జోనల్ విధానం.. ఉద్యోగాల భర్తీ.. పదోన్నతులు.. క్రిష్ణా జలాల వినియోగంతో పాటు.. భూముల ధరల పెంపు పైనా నిర్ణయం.. కరోనా థర్డ్ వేవ్ సంసిద్ధత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. గతంతో పోలిస్తే.. శాఖా పరమైన రివ్యూలకు ఎక్కువ సమయాన్ని సేకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా కేసీఆర్ లో కొత్త మార్పుకొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది.

అలాగే, గతంలో ఫాంహౌస్ కి వెళితే.. రోజుల తరబడి అక్కడే ఉండిపోయేవారు కేసీఆర్. ప్రగతిభవన్ కు అప్పుడప్పుడు మాత్రమే వ‌స్తార‌న్న విమ‌ర్శ ఆయ‌న‌పై ఉంది. ఇటీవల కాలంలో తన తీరును మార్చుకున్నట్లుగా చెబుతారు. అలా అని..కేసీఆర్ ఫాంహౌస్ వెళ్లటం లేదని కాదు. వెళ్లినా.. వెంటనే వచ్చేస్తున్నారు. ఇదో కొత్త అలవాటుగా కేసీఆర్ ను దగ్గర నుంచి చూసే వారు చెబుతుంటారు. అంతేకాదు.. గతంలో మంత్రివర్గ సమావేశాలకు ఫలానా సమయం అంటూ ఏమీ ఉండేది కాదు. ఆయనకు తోచినప్పుడు కాబినెట్ మీటింగ్ నిర్వహించేవారు. అది కూడా చాలా తక్కువగానే నిర్వహించేవారు.

ఇప్పుడు తరచూ ఆయన మంత్రివర్గ సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. సెకండ్ వేవ్ వేళ.. లాక్ డౌన్ విధించినప్పుడు ప్రతి పది రోజులకు ఠంఛన్ గా మంత్రివర్గ భేటీ నిర్వహించటం.. తామంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా మంత్రివర్గ నిర్ణయాలు వెలువడేవి. గతంలో మూడు నెలలకు.. అప్పుడప్పుడు నాలుగైదు నెలలకు ఒకసారి కూడా భేటీ అయ్యే తీరుకు భిన్నంగా ఇటీవల కాలంలో తరచూ కాబినెట్ మీటింగ్ లు నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించిన నాటి నుంచి ఈ అలవాటు మొదలైనట్లుగా చెబుతారు. ఇక‌ కేసీఆర్ మున్ముందు ఎలాంటి నిర్ణ‌యాలు, ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో వేచి చూడాల్సిందే.