కత్తి కార్తీక తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు.. టీవీ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మాత్రమే కాకుండా తనదైన సేవా కార్యక్రమాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న కత్తి కార్తీక రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అడుగులు వేశారు. ఉద్యోగంలో,టీవీ వ్యాఖ్యాతగా తనదైన ముద్రను ఏర్పరుచుకున్న కత్తి కార్తీక రాజకీయాల్లో విజయం సాధించారా లేదా అన్న ప్రశ్న తెలుగు ప్రజల్లో ఏర్పడింది.. ఆడబిడ్డకు రాజ్యాధికారం ఇచ్చి చూడండి అంటూ దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కత్తి కార్తీక ఎంత మేరకు విజయం సాధించారు అన్న సందేహాలకు దుబ్బాకలో వెలువడిన ఉపఎన్నికల ఫలితాలు సమాధానంగా నిలిచాయి.
కత్తి కార్తీక నేపథ్యం ఏమిటి?
కార్తీక హైదరాబాద్ భైరగౌని రామ్మోహన్ గౌడ్, రవిజ్యోతి దంపతులకు జన్మించింది. సికింద్రాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్ కు కత్తి కార్తీక మనుమరాలే. ఆమె పదవ తరగతి వరకు సికింద్రాబాదులోని సెయింట్ ఆన్స్ హైస్కూల్ లో పూర్తి చేశారు.లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రీనీచ్ లో మాస్టర్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ పూర్తిచేసి రెండు సంవత్సరాలు లండన్ లో ఆర్కిటెక్ గా రెండు సంవత్సరాలు పనిచేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకు తిరిగివచ్చిన కార్తీక తొలుత రేడియో జాకీ గా పని చేసింది. అనంతరం వి6 ఛానల్ లో వ్యాఖ్యాతగా చేరి మంచి పేరు సంపాదించుకుంది.
V6 ఛానెల్ లో ఆమె నిర్వహించిన షోలు తెలుగు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాసకు భాషకు పట్టం కడుతూ ఆమె నిర్వహించిన షోలు విజయవంతం కావడంతో ఆమె పేరు ప్రజల్లో మారుమ్రోగింది. బుల్లితెర ప్రేక్షకులను ఆమె ఆకట్టుకుంటున్న తీరును చూసి బిగ్ బాస్ మొదటి సీజన్ రియాలిటీ షోలో అవకాశం కల్పించారు. అందులో ఆమె 9 వ స్థానంలో నిలిచింది. అనంతరం 2017లో హైదరాబాదులోని బంజారా హిల్స్ లో బి స్టూడియోస్ పేరుతో సొంతంగా ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోను ప్రారంభించింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైక్ టివి ఛానల్ లో చేరి తనదైన శైలిలో రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు చేసింది. 2019లో టీమ్ టీవి పేరిట యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది.
రాజకీయ అరంగ్రేటం
కత్తి కార్తీక ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ మనుమరాలు కావడంతో 2014,2019 ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ తరుపున ప్రచారం చేసింది. 2018లో కేంద్రం కత్తి కార్తీకను రామగుండం స్వచ్ఛ భారత్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. కార్తీక ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. కేసీఆర్ పిలుపుమేరకు హరిత హారం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతిచెందడంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించి ఎన్నికల బరిలో నిలిచింది. ఆడబిడ్డకు రాజ్యాధికారం ఇస్తే దుబ్బాక లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను అంటూ ప్రధాన రాజకీయ పార్టీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రచారం నిర్వహించింది. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు తనను కొందరు బెదిరిస్తున్నారని పోలీసులకు కూడా పిర్యాదు చేసింది. అయితే నాయకురాలిగా ఉండాలని పోటీ చేయడం లేదు సేవకురాలిగా ఉండాలని పోటీ చేస్తున్నాను అంటూ ప్రచారం నిర్వహించిన కత్తి కార్తీకకు దుబ్బాక ఎన్నికల ఫలితాలు చేదు గుళికగా మిగిలాయనే చెప్పాలి.
ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్,బీజేపీలు హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్లు తలపడగా కత్తి కార్తీకకు మాత్రం అతి తక్కువ ఓట్లు మాత్రమే దక్కడం ఆమెకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. బహుజన ఆడబిడ్డనైనా నేను సేవకురాలిగా ఉండటానికి మాత్రమే వచ్చాను నాకు ఓటు వేసి గెలిపించండి అంటూ ఆమె నిర్వహించిన ప్రచారం ప్రజలకు చేరువ కాలేదని ఈ ఫలితాల ద్వారా వెల్లడైంది. ఆమె ప్రచారం చేసిన తీరును చూసి కత్తి కార్తీక ఎన్నికల్లో గెలవకపోయినా తనదైన ఓట్లను సాధిస్తుందని, గెలుపు గుర్రాల ఓట్లను చీల్చుతుందని, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందని ఊహించిన రాజకీయ విశ్లేషణలు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో తేలిపోయాయి. వ్యాఖ్యాతగా, సామాజిక సేవకురాలిగా ప్రజలపై తనదైన ముద్ర వేసిన కత్తి కార్తీక రాజకీయాల్లో మాత్రం తనదైన ముద్ర వేయలేకపోయారన్నది స్పష్టంగా అర్థం అవుతుంది. మరి ఈ ఎన్నికల ఫలితం అనంతరం కూడా రాజకీయాల్లో కొనసాగుతారా లేదా తిరిగి వ్యక్తిగత వృత్తివైపు దృష్టి సారిస్తారా అన్నది తెలియాలంటే కొద్దికాలం వేచి చూడాల్సిందే..