iDreamPost
android-app
ios-app

కలియుగ పాండవుల విజయగాథ – Nostalgia

  • Published Mar 31, 2021 | 12:03 PM Updated Updated Mar 31, 2021 | 12:03 PM
కలియుగ పాండవుల విజయగాథ – Nostalgia

స్టార్ ప్రొడ్యూసర్ల వారసులు నిర్మాతలుగా రాణించడం చూశాం కానీ పెద్ద రేంజ్ హీరోగా ఎదగడం మాత్రం ఒక్క వెంకటేష్ కు మాత్రమే సాధ్యమయ్యిందని చెప్పొచ్చు. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని క్లాసు మాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు చేయడం వల్లే అభిమానులు ముద్దుగా వెంకీ అని పిలుచుకునే ఈ స్థాయికి వచ్చారని చెప్పొచ్చు. ఆ తొలిఅడుగుల విశేషాలు చూద్దాం. 1985లో తన అబ్బాయి వెంకటేష్ ఎంబిఎ చదువుతూ అమెరికాలో చిన్న చిన్న వీడియో చిత్రాలు యాడ్స్ మోడలింగ్ లో మంచి పేరు తెచ్చుకోవడం చూసి హీరోని చేసేయాలని డిసైడ్ అయ్యారు నిర్మాత రామానాయుడు. కొడుకుని వెంటనే రమ్మని ఫోన్ చేసి రమ్మన్నారు.

డిసెంబర్ 13న వెంకీ పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. మంచి స్క్రిప్ట్ అందించే బాధ్యత పరుచూరి సోదరుల మీద పెట్టారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి కన్నా తన బిడ్డను ఎవరూ గొప్పగా చూపించలేరని ఆయనను ఒప్పించారు. ఇళయరాజా ప్రభంజనం ఉన్నప్పటికీ చక్రవర్తినే సంగీత దర్శకుడిగా ఎంచుకోవడంలో తన టేస్ట్ చూపించారు. కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని కబురు పెడితే చెన్నై నుంచి ఖుష్బూ నేరుగా హైదరాబాద్ వచ్చేసింది. బడ్జెట్ లో రాజీ వద్దని ముందే అనుకున్నారు. కోటి రూపాయల దాకా అవుతుందని తెలిసినా నాయుడుగారు భయపడలేదు. బాలీవుడ్ నుంచి శక్తి కపూర్ ని కోలీవుడ్ నుంచి రాధారవిని తీసుకొచ్చారు. రావుగోపాలరావు, రాళ్ళపల్లి, రమాప్రభ, సూర్య, చిట్టిబాబు, పిఎల్ నారాయణ, నర్రా ఇలా క్యాస్టింగ్ ని కూడా భారీగా సెట్ చేసుకున్నారు.

అప్పటికే యాక్టింగ్ లో ప్రముఖుల దగ్గర శిక్షణ తీసుకున్న వెంకటేష్ బెరుకు లేకుండా కెమెరాను ఎదురుకున్నారు. 1986 ఆగస్ట్ 14న కలియుగ పాండవులు రిలీజయింది. బాధ్యత లేని యువకుల బృందం సమాజంలో అన్యాయాలపై తిరగబడి గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టడమనే పాయింట్ ని కమర్షియల్ గా చెప్పిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. వెంకీ నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. కేవలం వారం గ్యాప్ లో చిరంజీవి చంటబ్బాయి విడుదలైనా రామానాయుడు గారి నమ్మకమే గెలిచింది. ఇండస్ట్రీ రికార్డులు సాధించకపోయినా కలియగ పాండవులు వెంకటేష్ కి పర్ఫెక్ట్ లాంచ్ గా ఉపయోగపడింది. ఇందులో వెంకటేష్ చెప్పే ఒక డైలాగ్ వి ఫర్ విక్టరీ తరువాతి కాలంలో పేరు ముందు శాశ్వతంగా నిలిచిపోతుందని ఎవరూ ఊహించలేదు