iDreamPost
android-app
ios-app

ప్రతీకారంతో రగిలిన చిరు ‘జ్వాల’ – Nostalgia

  • Published Dec 21, 2020 | 12:49 PM Updated Updated Dec 21, 2020 | 12:49 PM
ప్రతీకారంతో రగిలిన చిరు ‘జ్వాల’ – Nostalgia

తెలుగులోనే కాదు దాదాపు ప్రతి భాషలోనూ స్టార్ హీరోలు ద్విపాత్రాభినయం చేసిన సినిమా కోకొల్లలు. కాకపోతే కథను సెట్ చేసుకోవడమే వీటికి అతి పెద్ద సవాల్. ఎన్టీఆర్ రాముడు భీముడు, ఏఎన్ఆర్ ఇద్దరు మిత్రులు వచ్చాక చాలా కాలం అదే తరహాలో ఫార్ములాలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. వేషాలు మార్చుకుని ఒకరి పాత్రలోకి మరొకరు వెళ్లిపోవడం వీటిలో కామన్ పాయింట్. వాణిశ్రీ కూడా ఇదే కథతో గంగ మంగతో పెద్ద హిట్టు కొట్టారు. అయితే దాదాపు అన్ని కూడా వినోద ప్రధానంగా సాగేవే. సీరియస్ నెస్ అనేది పెద్దగా ఉండదు. రెండు మూడు చిన్న మలుపులు,మరీ ఎక్కువగా హానీ చేయని విలన్ ఇలా ఉంటుంది వరస. ఈ ట్రెండ్ కి భిన్నంగా రూపొందిన మూవీనే జ్వాల.

1985వ సంవత్సరం. చిరంజీవి కెరీర్ మంచి ఊపు మీదుంది. ఖైదీ ఇచ్చిన స్టార్ డంని నిలబెట్టుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సమయం. మంత్రి గారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా,ఛాలెంజ్, రుస్తుం, దొంగ సినిమాలు బయ్యర్లకు కాసుల వర్షం కురిపించాయి. అలా అని అన్ని హిట్లే రాలేదు. హీరో, దేవాంతకుడు, నాగు, అగ్నిగుండం, చిరంజీవి అంచనాలు అందుకోలేదు. ఇంటిగుట్టు, చట్టంతో పోరాటం జస్ట్ యావరేజ్ అనిపించుకున్నాయి. ఆ టైంలో చిరుని కలిశాడు రవిరాజా పినిశెట్టి. అప్పటికి ఆయన తీసింది ఒక్క సినిమానే. మాదాల రంగారావుతో చేసిన వీరభద్రుడు ఫ్లాప్ అయ్యింది. అయినా కూడా గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి చిరంజీవి రవిరాజాకు అవకాశం ఇచ్చారు.

అప్పటికి టాప్ డైరెక్టర్స్ మెగాస్టార్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. అన్నయ్య పాత్రకు రివెంజ్ డ్రామా మిక్స్ చేసి తమ్ముడిని ఇన్స్ పెక్టర్ గా చూపించే కథలో చిరుకి కొత్తదనం కనిపించింది. ఆలస్యం చేయకుండా ఒప్పుకున్నారు. చివర్లో ఓ పాత్ర చనిపోవడం న్యాయమే అనిపించింది. భానుప్రియతో పాటు అప్పుడే కొత్తగా పెళ్ళైన రాధిక హీరోయిన్లుగా ఎంపికయ్యారు. కన్నడ ప్రభాకర్ మెయిన్ విలన్. జూన్ 14న జ్వాల రిలీజయింది. ఇళయరాజా పాటలు హిట్టయ్యాయి. చిరు పోషించిన రాజు క్యారెక్టర్ మాస్ కు విపరీతంగా నచ్చేసింది. స్టైలిష్ గా ఉంటూనే తండ్రిని చంపినవాళ్ళను అంతం చేసే పాత్రలో అద్భుతంగా నటించాడు. రికార్డులు బద్దలు కొట్టకపోయినా జ్వాల కమర్షియల్ సక్సెస్ అందుకుని రవిరాజా పినిశెట్టికి ఇండస్ట్రీలో స్థానాన్ని సుస్థిరం చేసింది.