iDreamPost
android-app
ios-app

న్యాయమూర్తిని విచారణ నుంచి తప్పుకోమనడం రాజ్యాంగం కల్పించిన హక్కే

న్యాయమూర్తిని విచారణ నుంచి తప్పుకోమనడం రాజ్యాంగం కల్పించిన హక్కే

న్యాయ వ్యవస్థలో వ్యక్తిగత అభిప్రాయానికి తావులేదు. ప్రజా ప్రయోజనాల గీటురాయిగా న్యాయస్థానాల్లో విచారణ కొనసాగాలి. కానీ… న్యాయం చెప్పాల్సిన వారే పక్షపాత వైఖరిని అనుసరిస్తే మొత్తం న్యాయవ్యవస్థే అప్రతిష్టపాలవుతుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు తెలుగునాట కనిపిస్తోంది. నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన న్యాయమూర్తులు ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏకంగా ప్రభుత్వమే న్యాయమూర్తుల పట్ల విశ్వాసాన్ని కోల్పోవడం గమనార్హం.

నిరుపయోగమైన భూముల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణలో పక్షపాత వైఖరి కనిపిస్తోందని ప్రభుత్వం అంటోంది. ఈ కారణం చేత ధర్మాసనంలోని జస్టిస్ రాకేశ్ కుమార్ ను విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ ను దాఖలు చేసింది. మిషన్‌ బిల్డ్‌ ఆంధ్ర ప్రదేశ్‌లో భాగంగా నిరుపయోగంగా ఉన్న సర్కారు ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖ లైన వ్యాజ్యాల విచారణ ఇప్పుడు వివాదస్పదంగా మారింరది.

విశాఖపట్నం, గుంటూరు తదితర జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తుల వేలం కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై డిసెంబర్ 11న జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ దొనడి రమేశ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందని ఘాటు విమర్శలు చేశారు. నిరుపయోగంగా ఉన్న ఆస్తులను విక్రయించే హక్కు ప్రభుత్వానికి ఉందా? లేదా? అనే విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి తీర్పు వెలువరించవచ్చు. ఆ నిర్ణయంపై అభ్యంతరముంటే ప్రభుత్వం రాజ్యాంగ వేదికలను ఆశ్రయిస్తుంది. కానీ… విచారణకు ముందే ధర్మాసనంలోని న్యాయమూర్తులు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అనుమానాలకు తావిస్తుంది.

ఇప్పుడు… ఈ కారణం చేతనే జస్టిస్ రాకేశ్ కుమార్ ను ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వ్యాజ్యాలను విచారించే ధర్మాసనంలో జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ సభ్యుడిగా కొనసాగితే న్యాయం జరగదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. న్యాయమూర్తిని విచారణ నుంచి తప్పుకోవాలనడం కొత్త దోరణి అని, తన కెరీర్ చివర్లో ఇలాంటివి చూడాల్సి వచ్చిందని స్వయంగా జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. నిజానికి న్యాయమూర్తులు పక్షపాతంతో వ్యవహరిస్తారనే అనుమానం ఉన్నప్పుడు, అందుకు సహేతుకమైన కారణాలున్నప్పుడు కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొంది.

విశ్వాసం కోల్పోయిన న్యాయమూర్తితో విచారణ జరిపించడం ఎంతమేరకూ హర్షించదగ్గ విషయం కాదు. అలాంటప్పుడు తప్పుకోవాలని కోరడంలో ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ… దీన్ని రాజకీయం చేసే ప్రయత్నంలోనే అసలు సమస్య ఉంది. ప్రభుత్వ ఆస్తుల వేలం అనేది కొత్తగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తెచ్చినదీ కాదు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ అన్ని ప్రభుత్వాలూ చేస్తున్నదే. వివిధ కేసుల్లో జప్తుచేస్తున్న వాహనాలు, ఆస్తులు మొదలు నిరుపయోగంగా ఉన్న ఆస్తులను వేలం వేసి ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఆధాయాన్ని సమకూర్చుకుంటుంది. అదే సమయంలో ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల కోసం, సమష్టి ప్రయోజనాల కోసం ప్రజల నుంచి భూములను సేకరిస్తుంది. ఈ విషయంలో వివాదాలు ఉండవచ్చు. అయితే… వాటిని పాదర్శకంగా విచారించడం అవసరం. అలాంటి పారదర్శకత న్యాయస్థానాల్లోనే లోపిస్తే ప్రమాదం. విశాల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ప్రమాదానికి అవకాశం కల్పించకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ధర్మాసనం నుంచి జస్టిస్ రాకేశ్ కుమార్ ను తప్పుకోవాలని కోరింది. విచారణ నుంచి తప్పుకోవాలని కోరడమంటే న్యాయమూర్తులను అవమానించడం ఎంతమాత్రమూ కాదు. రాజ్యాంగ పరిధిలో లభించిన హక్కులను వినియోగించుకోవడం మాత్రమే. ఈ విషయాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తుండడం ఇవాల్టి విషాదం.