Idream media
Idream media
తెలుగుదేశం నేతల తీరు ఊహించినట్లుగానే ఉంటోంది. టీడీపీ మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులోనూ నేరం ఏపీ ప్రభుత్వం పైనే నెడుతున్నారు. మనం చెప్పే మాటను కనీసం ఒక్కరైనా నమ్ముతారా.., ఎవరైనా హర్షిస్తారా.. అనే ఆలోచన కూడా ఉండడం లేదు. సాధారణంగా ఏపీలో హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినా .. అవినీతిపరులను అరెస్ట్ చేసినా.. వారు టీడీపీ నేత లైతే చాలు.. సినిమాల్లో చూపినట్లు .. ఇది ప్రభుత్వం కుట్ర… ఖండిస్తున్నాం.. అంటూ ఏకరీతి స్టేట్మెంట్ లు ఇచ్చేందుకు టీడీపీ అధినేత నుంచీ చోటా నేతల వరకూ రెడీ గా ఉంటున్నారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇక్కడ అరెస్ట్ చేసింది తెలంగాణ పోలీసులు. వివాదాలు ఉన్నది కూడా అక్కడే. బోయన్‌పల్లిలో మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్ రావును ఆయన సోదరుల్ని కిడ్నాప్ చేసినకేసులో భూమా అఖిల ప్రియ అరెస్ట్ అయి జైలులో ఉన్నారు.. తెలంగాణలో అరెస్ట్ అయినా.. అందుకు కారణం ఏపీ ప్రభుత్వమే అట.
అనుమానాలకు హద్దు ఉందా. ?
ఏపీలో ఏ దుర్ఘటన జరిగిన ప్రభుత్వం పైనే అనుమానాలు వస్తున్నాయి టీడీపీ నేతలకు. వాటి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా.. అలాంటప్పుడు చెడు కార్యక్రమాలు ఎందుకు తలపెడుతుంది.. వంటి సందేహాలు చిన్న పిల్లాడి కి కూడా వస్తాయి. కానీ ఏ మాత్రం ఆలోచన లేకుండా.. ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం మామూలే పోయింది. ఇది ఇలా ఉండగా.. తెలంగాణలో జరిగిన కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పై అనుమానాలు వ్యక్తం చేయడం వారి వ్యాఖ్యలకు పరాకాష్ట.
అఖిల అరెస్ట్ పై టీడీపీ అనంతపురం పార్లమెంటు ఇంచార్జి జేసీ పవన్ రెడ్డి స్పందన విచిత్రంగా ఉంది. ఆదివారం తాడిపత్రిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. భూమా అఖిల ప్రియ కేసులో ఏపీ ప్రభుత్వం కుట్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఒక మహిళకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా.. అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కేవలం ఫిర్యాదు ఆధారంగా ఏ1గా కేసు పెట్టి అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్న ఏపీ ప్రభుత్వం… ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దారుణంగా వ్యవహరించిందన్నారు. భూమా అఖిల ప్రియ అరెస్టు విషయాన్ని ఖండించిన ఆయన.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ఉంటే బాగుండేదన్నారు.
ఆయన వ్యాఖ్యలు బట్టి చూస్తే అసలు కేసు ఏంటి..? ఎందుకు అరెస్ట్ చేశారు.., ఎలా అరెస్ట్ చేశారు..! అనే అంశాలపై పవన్ రెడ్డికి అవగాహన లేకుండా మాట్లాడినట్లు అర్థం అవుతోంది. పక్కా ఆధారాలతో ట్రేస్ చేసి మరీ బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం వెలుగు చూసిన వాస్తవాలను బట్టే ఏ 2 నుంచి అఖిల పేరు ఏ 1 గా మార్చారు. అయినప్పటికీ ఆ టీడీపీ నేత ఇలా ఆరోపణలు చేయడాన్ని ఏమనాలో ఆయనకే తెలియాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.