iDreamPost
iDreamPost
ఒక సినిమా విజయం సాధించాలంటే ఒక నిర్దుష్టమైన ఫార్ములా ఏదీ లేదు. అదే తెలిస్తే ఏ భాషలోనైనా ఇన్ని ఫ్లాపులు ఉండేవే కావు. కాకపోతే మనం రాసుకున్న కథ, చెప్పాలనుకున్న విధానం, టీమ్ సెట్ చేసుకునే వైనం ఇలాంటి విషయాల పట్ల ఒకటికి రెండు సార్లు ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా గొప్ప ఫలితాలు దక్కుతాయి. దానికి ఉదాహరణగా జయం గురించి చెప్పొచ్చు. 2002 సంవత్సరం. దర్శకుడు తేజ అప్పటికే డెబ్యూ మూవీ ‘చిత్రం’తో పాటు ‘నువ్వు నేను’ రెండూ గొప్ప విజయాలు నమోదు చేయడంతో యూత్ కి హాట్ ఫేవరెట్ డైరెక్టర్ గా మారిపోయారు. అయితే హిందీలో చేసిన నువ్వు నేను రీమేక్ ‘ఏ దిల్’ ఫ్లాప్ కావడం చిన్న బ్రేక్ వేసింది.
ఆ టైంలో రాసుకున్న కథే జయం. తాను అంతకు ముందు తీసిన రెండు అర్బన్ లవ్ స్టోరీస్ కి భిన్నంగా తేజ ఈసారి పల్లెటూరి నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమ కథ రాసుకున్నారు. కాకపోతే ఏదో చెట్టు పుట్టా వెంట తిరుగుతూ రొటీన్ గా సాగే తరహాలో కాకుండా హీరోని బక్కపలచని దేహంతో, విలన్ ని కండలు తిరిగిన బలిష్టుడిగా సెట్ చేసి చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏ దశలోనూ కథానాయకుడు పవర్ ఫుల్ గా కనిపించడు. ప్రీ క్లైమాక్స్ వరకు ఇలాగే ఉంటుంది. నిజానికి ఈ లైన్ లో రిస్క్ చాలా ఉంది. అయినా కూడా తేజ ఆలోచించలేదు. ఓ కొత్త అనుభూతినివ్వాలని డిసైడ్ అయ్యారు.
అప్పటికే హీరోగా తెరకు పరిచయమై ఫెయిల్యూర్ అందుకున్న గోపీచంద్ ని విలన్ గా ఎంచుకున్నప్పుడు ఇండస్ట్రీ సైతం షాక్ అయ్యింది. ఎందరినో ఆడిషన్ చేశాక నితిన్ సెలెక్ట్ అయ్యాడు. కొత్తమ్మాయిల్లో సదా తప్ప ఇంకో బెస్ట్ ఛాయస్ తేజకు కనిపించలేదు. తన విజయంలో సగం అర్హతున్న సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ కే పాటల బాధ్యత ఇచ్చారు. షూటింగ్ తక్కువ లొకేషన్లలో పూర్తి చేశారు. ఓ పల్లెటూరు, ఓ అడవి, ఓ కాలేజీ, ఓ రైల్వే స్టేషన్. ఇంతే షూటింగ్ పూర్తయిపోయింది. 2002 జూన్ 14న విడుదలైన జయం బ్లాక్ బస్టర్ అందుకుంది. యూత్ వెర్రెక్కిపోయి చూశారు. నితిన్, సదా, సుమన్ శెట్టి, గోపిచంద్ ఒక్క రాత్రిలో కాల్ షీట్స్ దొరకనంత బిజీ అయిపోయారు. జయం తర్వాత అంచనాలు అందుకోలేక ఆ స్థాయి విజయాన్ని తేజ మళ్ళీ అందుకొనే లేదు.