iDreamPost
android-app
ios-app

హే.. మళ్లీ ఏసేశారు! జవహార్‌ నోట.. విచిత్రమైన మాట

  • Published Jan 23, 2022 | 1:29 PM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
హే.. మళ్లీ ఏసేశారు! జవహార్‌ నోట.. విచిత్రమైన మాట

వెనకటికి ఒకాయనను జ్యోతిషం అడిగితే ‘మీ అమ్మాయికి అయితే అబ్బాయి.. లేదంటే అమ్మాయి కచ్చితంగా పుడతార’ని సెలవిచ్చారట! అచ్చం అలాగే ఉంది టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్‌ జవహార్‌ ధోరణి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తన కత్తికి రెండు వైపులా పదునుంది అన్నట్టు సాగాయి.

మంత్రుల ఇలాకాలు పేకాట క్లబ్బులుగా మారాయని ఆరోపించారు. మంత్రి కొడాలి నాని ఒక్కరే కాదు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నియోజకవర్గం రామచంద్రపురంలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. మంత్రులే విచ్చలవిడిగా జూద క్రీడలు నిర్వహిస్తూ అక్రమార్జన చేస్తున్నారని ఆరోపించారు. దీనిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కూడా వాటాలున్నాయనే అనుమానాలు ఉన్నాయన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధం లేనట్టయితే వెంటనే మంత్రులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మంత్రులపై చర్యలు తీసుకోకుంటే సీఎంకు వాటాలున్నట్టా?

మంత్రులపై నిరాధారమైన ఆరోపణలు చేసి, వాటిని అడ్డగోలుగా ముఖ్యమంత్రికి ముడిపెట్టేయడం జవహార్‌కే చెల్లింది. ఒక ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసేటప్పుడు కనీస పద్ధతులు పాటించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడమేమిటని వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మంత్రి కొడాలి నాని తన కళ్యాణ మంటపంలో క్యాసినో నిర్వహించారంటూ ఆరోపణ చేసి, నిజ నిర్దారణ కమిటీ అంటూ హంగామా చేసిన టీడీపీకి.. మంత్రి ఎదురు సవాల్‌ విసరడంతో ఏం చేయాలో తోచడం లేదని అంటున్నారు. గుడివాడలో తన కళ్యాణ మంటపంలో క్యాసినో నిర్వహించినట్టు 10 రోజుల్లోగా చంద్రబాబు నిరూపించాలని, లేదంటే అవన్నీ గాలి ఆరోపణలేనని అర్థమని మంత్రి నాని సవాల్‌ చేశారు.

టీడీపీ నేతలు దానిపై స్పందించకుండా తమదైన శైలిలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనాన్ని తప్పుదోవ పట్టించడానికి, విషయాన్ని పక్కదారి పట్టించడానికి మంత్రి వేణు నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని జవహర్‌ ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి జగన్‌కు అందులో వాటాలు ఉన్నాయని అనుమానాలు వస్తున్నాయని నోరు పారేసుకోవడం టీడీపీ మార్క్‌ రాజకీయానికి ప్రతీక అని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు. మంత్రులపై చర్యలు తీసుకోకపోతే సీఎంకు వాటాలు ఉన్నట్టేనంటూ బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టి  మాట్లాడి జవహార్‌ రాజకీయాల్లో విలువలను దిగజారుస్తున్నారని అంటున్నారు.

మంత్రి వేణు నియోజకవర్గంలో ఎక్కడ? ఎప్పుడు పేకాట క్లబ్‌లు నిర్వహించారు?సీఎం స్థాయి వ్యక్తికే వాటాలు వెళుతున్నాయంటే అక్కడ జూదం ఏ స్థాయిలో జరుగుతోంది వంటివి ఏమీ చెప్పకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేసి చర్యలు తీసుకోవాలి అనడం ఏమిటి? చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రి వాటాలు తీసుకున్నట్టు భావించాలని సూత్రీకరించడమేమిటి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఏం వాగినా పచ్చ మీడియాలో కవరేజ్‌ వస్తుందనే ధీమాతో ప్రతిపక్షంగా కనీస బాధ్యత లేకుండా ఇలా మాట్లాడడం టీడీపీ నేతలకే చెల్లింది. నిజంగా మంత్రుల నియోజకవర్గాల్లో పేకాట క్లబ్లులే నిర్వహిస్తే.. ఒళ్లంతా కళ్లున్న పచ్చ మీడియా చూస్తూ ఊరుకుంటోందా? అలా ఊరుకుంటే చంద్రబాబు వాళ్లను క్షమిస్తారా? అని వైఎస్సార్‌ సీపీ నేతలు జవహర్‌ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తున్నారు.