iDreamPost
iDreamPost
హిందూత్వ రాజకీయాలలో ఆరితేరిన అనుభవం బీజేపీది. కేవలం దానినే బ్రాండ్ గా చేసుకుని బలపడిన పార్టీ అది. రాజకీయ, ఆర్థిక విధానాలు ఎలా ఉన్నప్పటికీ మతం ఆధారంగా అధికారం దిశగా అడుగులు వేసిన బీజేపీ ప్రస్థానం అందరికీ తెలిసిందే. ఇక ఏపీలో ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఆపార్టీ బలపడేందుకు తగిన అవకాశాలు రావడం లేదు. ఇంకా చెప్పాలంటే దక్షిణాదిలోనే ఆపార్టీ ఒక్క కర్ణాటక మినహా మిగిలిన అన్ని చోట్లా బలహీనంగా ఉంది. కానీ ఏపీలో బీజేపీని మించి మత రాజకీయాలు సాగించాలనే తపనలో ఇతర పార్టీలు కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి చూస్తుంటే ప్రజా సమస్యల కన్నా మతపరమైన అంశాలలో ఆయన ప్రాధాన్యతను గమనించవచ్చు. బాబుకి తోడుగా పవన్ కళ్యాణ్ పూర్తిగా మతం ముద్ర వేసుకోవాలనే ఆతృతలో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతానికి కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దానికి అనుగుణంగా ఆయన పలు ప్రయత్నాలు ప్రారంభించారు. వాటి ఫలితాలు కూడా ఉంటాయని ఆశిస్తున్నారు. 2024లో అధికారం దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ బీజేపీకి దగ్గర కావాలనే ప్రయత్నంలో ఉన్న చంద్రబాబు తీరుని కూడా ఆపార్టీ గ్రహించింది. గతాన్ని తాము మరచిపోలేదంటూ బాబుని హెచ్చరిస్తోంది. అయినా చంద్రబాబు మాత్రం బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నితిన్ గడ్కరీ వంటి నేతలతో బాబుకి సన్నిహిత సంబంధాలున్నట్టు అందరికీ తెలుసు. ఆర్ఎస్ఎస్ కి సన్నిహితంగా మెలగడం ద్వారా మోడీ- షా ద్వయాన్ని మెప్పించాలని బాబు భావిస్తున్నట్టు పలువురు భావిస్తున్నారు. నేరుగా మోడీకి దగ్గరయ్యే యత్నాలు విఫలమవుతున్న తరుణంలో నాగపూర్ నుంచి కథ నడిపించాలనే యత్నంలో బాబు అన్నారు.
దానికి తగ్గట్టుగానే తాజాగా వివిధ అంశాల మీద స్పందిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ వంటి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను కనీసం పలకరించడానికి చంద్రబాబుకి తీరిక లేదు. విజయవాడ స్వర్ణా ప్యాలస్ లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సానుభూతి కూడా చూపలేదు. కానీ అంతర్వేది రథం మీద మాత్రం ఆయన ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రజల ప్రాణాల కన్నా మత సంబంధిత అంశాలే తనకు ముఖ్యమని ఆయన చాటిచెబుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. రాజకీయాల కోసం, తన ప్రయోజనాల కోసం ఆయన ఎంతకైనా తెగిస్తారనేదానికి సాక్ష్యాలుగా కనిపిస్తోంది. బాధ్యతాయుత ప్రతిపక్షంగా కన్నా జగన్ మీద గుడ్డి వ్యతిరేకతతోనే బాబు సాగుతున్నట్టు సందేహం వస్తోంది. ఆ క్రమంలో మత రాజకీయాలకు కూడా వెనుకాడేది లేదని ఆయన మాటలు, చేతలు చెబుతున్నాయి. స్వయంగా తన ప్రభుత్వం పుష్కరాల సమయంలో కృష్ణా తీరంలో చేసిన అకృత్యాలు అందరూ మరచిపోయారని భ్రమిస్తున్నట్టుగా ఉంది. హిందువుల గుడులు తొలగించడానికి వెనకాడని చంద్రబాబు ఇప్పుడు రథం మీద ప్రేమ కురిపిస్తున్న తీరు ఆయన కుటిల నీతికి తార్కాణంగా ఉంది.
చంద్రబాబు వెనకుడుగు వేయకుండా ఆర్ఎస్ఎస్ శక్తులను సంతృప్తి పరచడమే తనపనిగా, గతంలో చేసిన పనులను మరచిపోవాలనే ప్రయత్నంలో భాగంగా రాజకీయాలు సాగించడం వింత, విశేషంగా కనిపించదు. ఎందుకంటే మోడీ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వనని వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు, ఆతర్వాత ప్రధాని కాగానే అంతటి గొప్ప వ్యక్తి లేరని పొగిడిన అనుభవం ఉంది. మళ్లీ అదే మోడీని తాను, తన పార్టీ నేతలు వ్యక్తిగతంగా దూషించిన తీరు ఇప్పటికీ చాలామంది మరచిపోలేదు. ఇప్పుడు మళ్లీ మోడీని పొగిడేందుకు బాబుకి మొహమాటం కూడా కనిపించదు. అలాంటి అవసరాల రీత్యా రాజకీయాలు నడిపే చంద్రబాబు అంతర్వేది విషయంలో చూపిస్తున్న శ్రద్ధ జనాలకు అర్థం కాదని అనుకోవడమే అత్యాశ.
బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ బాబు మీద భక్తి శ్రద్ధలే ఎక్కువగా చూపించే పవన్ కళ్యాణ్ కూడా అంబేద్కర్ ఆశయాలు అంటూ చెప్పి, పెరియార్ బాటలో సాగుతానని ప్రతిజ్ఞ చేసి, చివరకు మాయావతి మోకాళ్ల మీద పడిన పరిస్థితి నుంచి ఇప్పుడు తానే పెద్ద సంఘీయుడినని చెప్పుకునే యత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. అంతర్వేది ఆందోళనలో జనసేన అంటూ తిరిగే కుర్రకారు ఎక్కువగా ఉన్న విషయం గమనార్హం. అంతేగాకుండా సీబీఐ, ఎన్ఐఏ విచారణ అంటూ అంతర్వేదిలో రథం మీద పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు గమనిస్తే తనకు ప్రజల్లో రాజకీయంగా ఆదరణ లభించే అవకాశం లేదని గుర్తించి, మతం ఆధారంగా మనుగడ కోసం ప్రయత్నిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.
ఇలా చంద్రబాబు, పవన్ సహా ఆయా పార్టీల నేతలంతా జగన్ సీఎంగా ఉండడం సహించలేకపోవడంతోనే సున్నిత అంశాలను భూతద్దంలో చూపించి పెంచి పెద్దది చేసే ప్రయత్నంలో ఉన్నారా అనే అభిప్రాయం బలపడుతోంది. ఆ క్రమంలో ప్రమాదకర మతతత్వం పెంచేందుకు సైతం వెనుకాడని వారి తీరు విస్మయకరంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ని , సామరస్య పూర్వక వాతావరణాన్ని సైతం ఛిన్నాభిన్నం చేసే యత్నాలు వారి అవకాశవాదానికి పరాకాష్టగా కనిపిస్తున్నాయి. ప్రజా సమస్యలను గాలికొదిలేసి మొన్నటి వరకూ అమరావతి అంటూ అలజడి రేపే యత్నం చేసి విఫమయిన ఈ ద్వయం ఇప్పుడు అంతర్వేది ఘటనను అవకాశంగా మలచుకునే యత్నం చేయడం వారి నైజాన్ని చాటుతోంది.