iDreamPost
android-app
ios-app

కొత్త గ్రామాలు వెలుస్తున్నాయ్‌

  • Published Jan 21, 2022 | 9:58 AM Updated Updated Jan 21, 2022 | 9:58 AM
కొత్త గ్రామాలు వెలుస్తున్నాయ్‌

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 15.65 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఇప్పటికే 10.87 లక్షల ఇళ్ల శంకుస్థాపనలు పూర్తయ్యాయి. వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. గత ఏడాది కోర్టు కేసుల కారణంగా కొద్దినెలలపాటు వీటి పనులు  నిలిచిపోయాయి. ఇటీవల ఆ అడ్డంకులు తొలగిపోవడంతో డిసెంబర్‌ నుంచి నిర్మాణాలు తిరిగి గాడినపడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రూ.30 కోట్లకు పైగా విలువైన పనులు జరుగుతున్నాయి.

జిల్లాలకు నిధులు విడుదల..

తొలిదశలో శంకుస్థాపనలు కాని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికీ గృహనిర్మాణ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు లేఅవుట్‌లలో రీలెవలింగ్, గోడౌన్ల నిర్మాణం, నీటి సరఫరా, ఇతర సౌకర్యాల కల్పన నిమిత్తం రూ.228.6 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మొత్తంలో రూ.62.81 కోట్లు అప్రోచ్‌ రోడ్లు, లేఅవుట్లలోని ఎలక్ట్రికల్‌ లైన్లు మార్చడానికి రూ.6.60 కోట్లు, లేఅవుట్‌లలో లెవలింగ్‌ కోసం రూ.132 కోట్లు, గోడౌన్ల నిర్మాణానికి రూ.3.25 కోట్లు, ఇతర పనుల కోసం రూ.23.94 కోట్లు కేటాయించారు. ఇప్పటికే రూ.30 కోట్ల నిధులను జిల్లాలకు విడుదల చేశారు. ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రెండు జిల్లాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. వీరు అక్కడ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు, జేసీలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. తొలి నుంచి చిత్తూరు జిల్లా ఇంటి నిర్మాణాల్లో ముందంజలో ఉంది. ఇటీవల రూ.228 కోట్లతో లేఅవుట్‌లలో వసతుల కల్పనకు అనుమతులిచ్చారు.

జర్మనీ సంస్థ సాయం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం అంతర్జాతీయ సంస్థల దృష్టిని  ఆకర్షిస్తోంది. పేదలకు నిర్మించే ఇళ్లలో అత్యుత్తమ ఇంధన ప్రమాణాలు అమలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని జర్మనీకి చెందిన అంతర్జాతీయ బ్యాంక్‌ కేఎఫ్‌డబ్ల్యూ  అధికారులు అభినందించారు. ‘నవరత్నాలు– పేదలందరికీ  ఇళ్లు’ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఇళ్లలో ఇంధన సామర్థ్య ప్రమాణాలు అమలు చేసేందుకు  ఆర్థిక సహకారాన్ని అందించేందుకు కేఎఫ్‌డబ్ల్యూ ఆసక్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ, ఇంధన శాఖ అధికారులతో వర్చువల్‌గా జరిగిన సమావేశంలో కేఎఫ్‌డబ్ల్యూ  అధికారులు ఈ ప్రతిపాదన చేశారు. గృహ నిర్మాణ పథకంలో నిర్మించే ఇళ్లలో  ఇంధన సామర్థ్య ప్రమాణాల అమలుకు సంబంధించి ప్రాజెక్ట్‌ తయారీ, అధ్యయనం  తదితర అంశాల్లో రాష్ట్ర  ప్రభుత్వానికి  సహకరిస్తామని కేఎఫ్‌డబ్ల్యూ ఎనర్జీ ఎఫిషియెన్సీ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌పై  అధ్యయనం అనంతరం ఇంధన సామర్థ్య ప్రమాణాలతో కూడిన ఇళ్ల నిర్మాణ కోసం 150 మిలియన్‌ యూరోలు , సాంకేతిక సహకారం కోసం మరో  2 మిలియన్‌ యూరోలు అందచేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా జగనన్న కాలనీల్లో విద్యుత్‌ పంపిణీ మౌలిక సదుపాయాలు, విద్యుత్‌ సరఫరా నెట్‌వర్క్‌ బలోపేతానికి కూడా ఆర్థిక సహకారం అందిస్తామన్నారు.  

Also Read : పీఆర్‌సీ జీవోలకు ఆమోదం.. ఉద్యోగులకు వివరించేందుకు కమిటీ