iDreamPost
iDreamPost
ఉద్దానం. ఈ పేరు వినగానే అందరికీ కిడ్నీ బాధితులు గుర్తుకొస్తారు. తాగునీటి సమస్య మదిలో మెదులుతుంది. ప్రజల అవస్థలు మాత్రమే వినిపిస్తాయి. సుదీర్ఘకాలంగా సమస్య తీవ్రమవుతున్నా పట్టించుకున్న వారే కనిపించలేదు. చంద్రబాబు సర్కారుకి వారి గోడు పట్టనిదయ్యింది. ఆనాటి చంద్రబాబు మిత్రపక్షం పవన్ కళ్యాణ్ కి కేవలం ప్రచారానికే పనికివచ్చింది. సమస్య మూలాలు, పరిష్కారాలు కాకుండా ఉద్దానం బాధితులను తమ రాజకీయ అవసరాలకు మాత్రమే వినియోగించుకున్నట్టు అనుభవం చాటుతోంది.
కానీ జగన్ తీరు దానికి భిన్నంగా కనిపిస్తోంది. ఉద్దానం స్వరూపం మార్చాలని సంకల్పించినట్టు కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా చరిత్రనే మార్చేసే నిర్ణయాలు తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే పలు నిర్ణయాలతో సంక్షేమబాటలో సర్కారు సాగుతోంది. అదే క్రమంలో అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే దిశలో సాగుతున్నారు. ఇప్పటికే ఉద్దానం బాధితులకు శుద్ధమైన తాగునీటిని అందించే ఏర్పాట్లు చేశారు. రూ.600 కోట్లతో తాగునీటి పథకానికి శ్రీకారం పడింది. అందుకు తోడుగా అవసరమైన వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. అన్నింటికీ మించి కిడ్నీ బాధితులకు పెన్షన్ అందిస్తున్నారు. డయాలిసిస్ కారణంగా ఆర్థిక కష్టాల్లో పడకుండా ఆదుకుంటున్నారు. తద్వారా ఉద్దానం సమస్యకు పరిష్కారం దిశలో కొన్ని అడుగులు పడినట్టు కనిపిస్తోంది.
దానితో సరిపెట్టకుండా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత మత్స్యకారుల చిరకాల స్వప్నం భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం డీపీఆర్ ని ఆమోదించారు. తద్వారా చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ని పూర్తి చేసేందుకు ముందడుగు పడింది. రూ. 3669.95 కోట్ల తో ఫేజ్ 1 పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 36 నెలల్లోనే దానిని పూర్తి చేసేందుకు నిర్ణయించింది. పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణకు 261 కోట్లు ప్రభుత్వం తరుపున అందిస్తామని ప్రకటించింది.
దాంతో శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు ఉపాధిలేక, చేపల వేట సాగించలేక, పోర్టులున్న ఇతర రాష్ట్రాల తీర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్న నేపథ్యంలో భావనపాడు పోర్ట్ ఓ శాశ్వత పరిష్కారం కాబోతోంది. ఇన్నాళ్లుగా ఉద్దానం అనగానే ఉన్న అభిప్రాయాన్ని తుడిచిపెట్టి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయేందుకు ఈ పోర్ట్ తోడ్పడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఓవైపు భావనపాడు , మరోవైపు తాగునీటి పథకం, వాటికితోడుగా శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు కాబోతున్న ఫిషింగ్ జెట్టీల కారణంగా సిక్కోలు చరిత్ర సంపూర్ణంగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.