iDreamPost
iDreamPost
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. ఎస్సీలలోని అన్ని కులాలకు ప్రాధాన్యతనిచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఆ క్రమంలో గత ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితం అయిన కొన్ని అంశాలలో జగన్ చొరవ చూపుతున్నారు. ఇప్పటికే ఎస్సీ కార్పోరేషన్ ని మూడు భాగాలు చేశారు. మాల, మాదిగ, రెల్లి కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. అదే సమయంలో వివిధ పథకాలలో దళితులకు పెద్ద మొత్తంలో ప్రయోజనం కలిగించేలా సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. తద్వారా ఎస్సీ కార్పోరేషన్ ద్వారా జరగాల్సిన సంక్షేమం, ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతనిస్తున్నట్టు కనిపిస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు సంవత్సరంలో ఎస్సీల సంక్షేమానికి చేసిన ఖర్చుని జగన్ ప్రభుత్వం ఎన్నికల అనంతరం తొలి ఏడాదిలో చేసిన ఖర్చుతో పోలిస్తే విషయం అర్థం అవుతుంది. సహజంగా ఎన్నికల సంవత్సరంలో సంక్షేమానికి కొంత ఎక్కువ వ్యయం చేయడం కాదనేలని వాస్తవం. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం 2018 -19 లో ఎస్సీల కోసం చంద్రబాబు సర్కారు చేసిన ఖర్చు కేవలం రూ. 8,903.44 కోట్లుగా ఉంది. ఇక తర్వాత సంవత్సరం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీలకు అభివృద్ధికి వెచ్చించిన లెక్కలు తీస్తే రూ. 11,205.41 కోట్లుగా ఉంది. తద్వారా చంద్రబాబు ప్రభుత్వం కన్నా రూ.2వేల కోట్లకు పైనే వినియోగించడం ద్వారా ఎస్సీల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందనే విషయాన్ని ఆచరణలో చాటుకున్నారు.
అదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దానిని రూ. 15,735 కోట్లకు పెంచబోతున్నట్టు ప్రకటించారు. తద్వారా చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఖర్చుతో పోలిస్తే రెండేళ్లలోనే రెట్టింపు వ్యయం ఎస్సీల విషయంలో వ్యయం చేసేందుకు జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఆశావాహకంగా కనిపిస్తోంది. అయినప్పటికీ టీడీపీ నేతలు మాత్రం జగన్ సర్కారు మీద విమర్శలకు ప్రయత్నం చేయడం ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. అయితే గతంలో ఎస్సీ కార్పోరేషన్ పేరుతో టీడీపీ నేతలకు, వారి అనుచరులకు బినామీల పేరుతో పెద్ద స్థాయిలో ప్రయోజనం కల్పించే ప్రయత్నం విరమించుకుని నేరుగా లబ్దిదారులకు మేలు చేసేలా జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషిని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్టు పలువురు చెబుతున్నారు.
ఎస్టీల విషయంలో కూడా టీడీపీ ప్రభుత్వం చివరి ఏడాది 2019-19లో రూ. 2,902.61 కోట్లు వెచ్చించగా దానిని జగన్ ప్రభుత్వం 2019-20 లో రూ. 3,669.42 కోట్లకు పెంచింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దానిని రూ. 5,177 కోట్లకు పెంచుతున్నారు. తద్వారా సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తామని ఎన్నికల హామీలో చెప్పిన మాటను జగన్ ఆచరణలో చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. అంబేద్కర్ స్మృతివనం పేరుతో అమరావతి ప్రాంతంలో మారుమూల ఓ ప్రతిపాదన చేసి పునాదిరాయికే చంద్రబాబు పరిమితం అయితే దానిని విజయవాడ నగరంలోనడిబొడ్డున వచ్చే ఏప్రిల్ 14 నాటికి పూర్తి చేయాలని జగన్ నిర్ణయించడం ద్వారా తన తీరుని చాటుకుంటున్నట్టు చెబుతున్నారు.