iDreamPost
android-app
ios-app

జగన్మోహన్ రెడ్డి-ఆరు నెలల పాలన-అభివృద్ధి,సంక్షేమం

జగన్మోహన్ రెడ్డి-ఆరు నెలల పాలన-అభివృద్ధి,సంక్షేమం

2014 — విభజిత ఆఁధ్రప్రదేశ్ కు నాలాంటి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అభివృద్దిచేయోచ్చు. దేశంలో నేనే సీనియర్ నాయకుడిని,ఒక అవకాశం ఇవ్వండి- అన్న ప్రచారం పనిచేసింది ,చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా అక్కడి నుంచి మొదలైంది ,

రాజధాని నగరం అంటూ ప్రజలకు రకరకాల బొమ్మలు చూపిస్తూ చేసిన మోసం …
‘లక్షలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయం’టూ అరచేతిలో వైకుంఠం చూపిన ఒట్టి మాటలు …
శంకుస్థాపన, భూమిపూజ, మట్టి-నీళ్లు, పసుపు-కుంకుమ అంటూ చెప్పిన మాయమాటలు …
స్త్రీల ధనమానప్రాణాలతో వ్యాపారం చేసిన వారిని ఏమీ చేయలేకపోయిన చేతకానితనం…
జనాన్ని ‘జన్మభూమి కమిటీలు’ పెట్టిన కష్టాల్ని పట్టించుకోని లెక్కలేనితనం …
అడ్డూ అదుపూ లేకుండా సాగిన అక్రమ ఇసుక రవాణాను అరికట్టలేని అసమర్ధ పాలన…
అసాధ్యమని తెలిసీ రిజర్వేషన్ ఇస్తామంటూ చేసిన కులరాజకీయాలు …
ప్రభుత్వ మహిళా అధికారిని జుట్టు పట్టుకుని రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చిన దౌర్జన్యం …
ఎన్నికల హామీలన్నీ తీర్చేశామని భజనలు చేయించుకున్న బుకాయింపు…
ప్రకృతి వైపరీత్యాల్ని వ్యక్తిగత ప్రచారానికి వాడుకున్న పటాటోపాలు …
ప్రత్యేక విమానాలకు ప్రజాధనాన్ని వృధా చేసిన బాధ్యతారాహిత్యం …
పరిపాలనా లోపాలకు ప్రతిపక్షాన్ని బూచిగా చూపించిన దాటవేతధోరణి…
“మీరు ఎన్ని కలలు కన్నా ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటార”ని ఎద్దేవా చేసిన వెటకారం …
విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ వ్యక్తిగత దూషణలతో వైరాన్ని పెంచిన వైనం …
విలువల్ని వదిలేసి ‘పాతేస్తా…’ అంటూ వాగ్యుద్దానికి దిగిన వ్యవహారశైలి…
ప్రతిపక్షపార్టీ శాసనసభ్యులతో ‘మంత్రాం’గం నడిపిన అప్రజాస్వామికధోరణి…
ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తిని మూడు శాఖలకు మంత్రిగా నియమించి, ప్రజల మీదకు వదిలిన విచిత్రం.

చివరగా …

“నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటూ, నేను వేసిన రోడ్ల మీద నడుస్తూ, నేనేసిన వీధిదీపాల కింద ముందుకు సాగుతూ… నాకెందుకు ఓటేయరు ? నాకు వ్యతిరేకంగా ఉన్న గ్రామాలకు పని కూడా చేయను, నేను ఇష్టం లేకపోతే మీకెందుకు పనులు చేయాలి ?” అంటూ మాట్లాడిన అహంకారం …

వీటన్నిటికీ ప్రజల సమాధానం – 2019 ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ఇచ్చిన స్పష్టమైన తీర్పు.
వైఎస్ జగన్మోహన్ కు అఖండ విజయాన్ని అందించిన ఆ తీర్పుతో – “వైఎస్.జగన్మోహన్ రెడ్డి అను నేను..” అని ప్రమాణస్వీకారం చేసి ఆరు నెలలు పూర్తయ్యాయి. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఈ ఆరు నెలల కాలాన్ని బట్టి బేరీజు వేయడం తర్కబద్ధం కాకపోయినా ఒక సారి పరికించి చూడటం వలన, అధ్యయనం చేయడం వలన కనీసం ఒక అంచనాకు అయితే రావచ్చు.

జగన్ ప్రమాణస్వీకారం రోజున చెప్పినట్టు ‘నవరత్నాలు’ అమలు మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఏ ప్రభుత్వానికైనా ఆర్ధికంగా ఎక్కువ ఆదాయం వచ్చేది మద్యం నుంచే. ఈ విషయం తెలిసీ ‘దశల వారీగా మధ్య నిషేధం’ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేయడం సాహసమే అని చెప్పాలి. గత ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రోజున బెల్టు షాపులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించినా నాలుగున్నరేళ్లయినా మళ్ళీ మళ్ళీ కేవలం ఆ ప్రకటన వరకే పరిమితమైంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం – ఆరు నెలలు తిరక్కుండానే మద్యం అమ్మకాల సమయాన్ని కుదించింది. కొత్త ఎక్సైజ్ సంవత్సరంలో పల్లెల్లో మద్యం దుకాణాల సంఖ్య బాగా తగ్గించింది. అక్రమంగా నిల్వ చేసిన మద్యం పైన దాడులు జరిపి చర్యలు తీసుకుంటోంది. బెల్టుషాపులు ఉన్నట్టు ఎక్కడైనా ఫిర్యాదు అందితే వెంటనే తొలగించేందుకు జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో విరివిగా పర్యటిస్తూన్న గ్రామ వాలంటీర్ల నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి తనిఖీలు చేస్తున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ముందుకు సాగుతుండటంతో ‘ఆయా వ్యాపారుల నుంచి ఎక్సయిజ్ శాఖకు వచ్చే మామూళ్లు తగ్గిపోయాయి, మద్యం దుకాణాలు ఎక్కువగా ఒకే సామాజికవర్గానికి చెందిన వారివి కనుకనే వాటిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అడుగులు వేస్తోంది ‘ అంటూ ప్రతిపక్ష అనుకూల మీడియా అర్ధం లేకుండా ఏవేవో ‘పలుకు’లు ప్రజలకు చేరవేసింది.

ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన మరో అద్భుత పథకం ‘అమ్మ ఒడి’ – ఆ పథకాన్ని వచ్చే జనవరి నుంచి అమలు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. చిత్తశుద్ధితో ఈ పథకాన్ని అమలు చేస్తే ‘బాల కార్మిక వ్యవస్థ’నే సమూలంగా నిర్మూలించదగ్గ సత్తా ఉన్న పథకం అది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడతామని మ్యానిఫెస్టోలో పెట్టినట్టే తొలి విడతగా కొన్ని బడుల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దీని మీద నానాయాగీ చేసిన ప్రధాన ప్రతిపక్షం, తెలుగు మీద ఎనలేని ప్రేమను ‘నటించిన’ మరో పార్టీ – ఆంగ్ల మాధ్యమం మీద ప్రజల్లో వచ్చిన ఆమోదం చూసి, తామూ వ్యతిరేకం కాదని మాట మార్చారు. వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి ప్రారంభించిన ‘నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా తొలివిడతగా 1381 పాఠశాలల్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. అక్కడ అవసరమైన వాటిని నిర్ణయించే అధికారాన్ని వాటి యాజమాన్య కమిటీలకు; ఆ పనులు జరిగేలా చూసే బాధ్యత పంచాయితీరాజ్ శాఖ, ‘సమగ్ర శిక్షా అభియాన్’ ‘ఇంజినీర్లకు అప్పజెప్పారు. ప్రభుత్వ ఇంజినీర్లను నేరుగా ఈ ‘నాడు-నేడు’ కార్యక్రమంలో నియమించడం ద్వారా వారి ఉద్యోగరీత్యా ఉన్న జవాబుదారీతనం వలన పనులు చకచకా జరుగుతాయి. నిర్దిష్ట గడువు ప్రకారం పూర్తి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీటిని బట్టి చూస్తే ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాధాన్యతనిస్తోందో అర్ధం చేసుకోవచ్చు.

వైఎస్ జగన్ పాదయాత్రలో అంచనా వేసినట్టే వృద్ధాప్య పింఛను వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకు చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు చేశారు. అలా చంద్రబాబు రెండు వేలు చేసిన పక్షంలో తానేం చేస్తానో కూడా పాదయాత్రలోనే జగన్ చెప్పాడు. వృద్ధాప్య పింఛను దశల వారీగా మూడు వేల వరకు ఇచ్చే విధానం గురించి పాదయాత్రలో చెప్పినట్టే, మ్యానిఫెస్టోలో పెట్టినట్టే మొదటి సంవత్సరం 2250 రూపాయలు ఇవ్వడం ప్రారంభించారు. అనూహ్యంగా ఇప్పటి వరకు ఆ పింఛన్ల అమలులో ఎటువంటి లోపాలు కూడా కనిపించలేదు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సైతం ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి వంకలు పెడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూసినా ఈ విషయంలో మాత్రం ఎక్కడా విమర్శించలేదు. రైతు భరోసా కింద ఏటా ఇస్తానన్న మొత్తం వచ్చే సంవత్సరం మే నుంచి ప్రారంభమవుతుంది కానీ మ్యానిఫెస్టోలో పెట్టని విషయమైన ఒక మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఈ ప్రభుత్వం. పల్లెల్లో రైతులకు కల్తీ లేని విత్తనాలు, ఎరువులు; వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు తదితరమైనవి లభ్యమయ్యే ‘వన్ స్టాప్ షాప్’ ఏర్పాటు దిశగా తొలి అడుగు పడింది. 2020 జనవరి నుంచి మొదలు పెట్టబోతున్న ఈ కార్యక్రమం ద్వారా ఎంత మందికి రైతులకు ఏ విధంగా మంచి జరగబోతోందో కాలమే నిర్ణయించాలి. కానీ రైతాంగం పట్ల, రైతుల పట్ల ప్రభుత్వం ఏ విధంగా పాలన సాగించబోతోందో ఈ నిర్ణయాల వల్ల అర్ధమవుతోంది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అద్భుత ఆలోచన ‘ఆరోగ్య శ్రీ’. మరో శతాబ్దమైనా సరే ప్రజలు మర్చిపోలేని ఈ పథకం దేశంలోని ఎందరో నాయకులకు స్ఫూర్తినిచ్చి వారి వారి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకం ఒకటి రూపకల్పన చేయడానికి మార్గదర్శకం అయింది. వైఎస్సార్ రెండో సారి గెలవడానికి తోడ్పడిన అంశాల్లో సింహభాగం ‘ఆరోగ్య శ్రీ’దే అని కరాఖండిగా చెప్పచ్చు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య శ్రీ’ పరిధిలోకి కొత్తగా దాదాపు వెయ్యి వ్యాధుల్ని చేర్చింది. సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారిలో అర్హులైన వారు ఆయా రాష్ట్రాల్లోని హాస్పిటళ్లలో ‘ఆరోగ్య శ్రీ’ కింద వైద్యం చేయించుకునేలా పథకాన్ని వర్తింపజేసింది. ఇటీవల సంచలనం రేపిన గచ్చిబౌలి ఫ్లై ఓవర్ యాక్సిడెంట్లో అనంతపురం జిల్లాకు చెందిన అమ్మాయి తీవ్రంగా గాయపడింది. ఆ అమ్మాయి హైదరాబాద్ లోనే ‘ఆరోగ్య శ్రీ’ కింద వైద్యం చేయించుకునేందుకు అయిదు లక్షల రూపాయలు అతివేగంగా మంజూరు చేయడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఉదాహరణ. ప్రయివేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని కూడా మార్చేందుకు 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది – సంబంధిత అధికారులు ఈ నిధులు సద్వినియోగం చేసేలా ప్రభుత్వం చూసుకున్నప్పుడే దీని ఫలితం గురించి మాట్లాడటం సబబుగా ఉంటుంది.

పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం ద్వారా కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతున్నట్టు ప్రాధమికంగా తెలుస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి గత కాంట్రాక్టుల్లో ఒక్కో దాంట్లో ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా కనీసం కొన్ని వేల కోట్ల రూపాయల లాభం ప్రభుత్వానికి కలిగినప్పుడే ఉపయోగం ఉంటుంది. మరిన్ని కాంట్రాక్టుల విషయంలో కూడా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళతామంటోంది కనుక వేచి చూడాలి. ఇక ఇసుక సమస్యకే వస్తే – అందులో ప్రతిపక్ష పార్టీలు తమ అక్కసును వెళ్లగక్కేందుకు చేసిన ఆర్భాటమే ఎక్కువగా కనిపించింది.

భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడి చనిపోవడం బాధాకరం కానీ ఆ చావుల మీద రాజకీయం చేయడం మాత్రం శోచనీయం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భవన నిర్మాణాలు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచే ఆగిపోయాయి. ఒక్క విశాఖపట్నంలోని 30 వేల మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు, 500 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఏప్రిల్లో విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నాలుగు వేల రూపాయల ఇసుక ట్రక్కు పదిహేను వేల వరకు వెళ్ళింది. అప్పుడే ప్రయివేటు నిర్మాణాలతో పాటు ప్రభుత్వ నిర్మాణాలు ఆగిపోయాయి. ఇసుక కొరత ఎన్నికలకు ముందు నుంచే ఉందన్న వాస్తవాన్ని; వర్షాల వల్ల, వరదల వల్ల ఇసుక కొరత సమస్య జఠిలమైందన్న సాంకేతిక కారణాల్ని కప్పిపుచ్చుతూ ప్రచారం కోసం ఒక ప్రతిపక్ష పార్టీ, అవగాహనరాహిత్యంతో మరో ప్రతిపక్ష పార్టీ నానా హంగామా చేశాయి – అదీ సరిగ్గా రీచుల్లో ఇసుక లభ్యమయ్యే సమయానికి. వరదలు తగ్గి ఇసుక లభ్యమవుతుండటం, కొత్త ఇసుక పాలసీతో ఆ సమస్య కూడా సమిసిపోయింది.

గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే శాసనసభ్యుల నెల వారీ అలవెన్సులు యాభై వేల నుంచి లక్ష రూపాయలకి పెంచటానికి, రాజధాని నగరం ఎలా వుండాలి అని పరిశీలించడానికి అధికార పార్టీ శాసనసభ్యుల నుంచి ముఖ్యమంత్రి దాకా అందరూ పక్క దేశాల, రాష్ట్రాల రాజధాని నగరాల పర్యటనలకు, ఉమ్మడి రాజధానిలోని సచివాలయంలో చాంబర్ల కోసమని కోట్లకు కోట్లు దుబారా చేసినట్టు ఈ ప్రభుత్వం ఎటువంటి ఖర్చు పెట్టలేదు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయినప్పుడు గత ముఖ్యమంత్రి మాట్లాడిన తీరును; మొన్న అదే గోదావరిలో పడవ మునిగిపోయి పర్యాటకులు చనిపోయినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిబాధ్యత వహించిన తీరును పోల్చిచూసుకుంటే ఏ ప్రభుత్వంలో జవాబుదారీతనం ఉందో ఎవరికైనా అర్ధమవుతుంది. వెనుకబడిన వర్గాలకు, మైనారిటీలకు మాట ఇచ్చినట్టుగానే న్యాయం జరిగే విధంగా మంత్రివర్గ కూర్పులో అన్ని జాగ్రత్తలు తీసుకుని సామాజికన్యాయం జరిగేలా చూశారు. ప్రస్తుతానికైతే ఎటువంటి అవినీతి మరక ప్రభుత్వానికి అంటలేదు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ మొదలు పెట్టడం అభినందనీయం- దీని ఫలితాలు ఎలా ఉండబోతాయో కూడా వేచిచూడాల్సిందే. వచ్చే సంవత్సరం నుంచి మొదలుపెట్టబోయే మరికొన్ని పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారోనని కొందరు ఇప్పటినుంచే నిష్టూరించడం విడ్డూరం.

ఏది ఏమైనా ప్రచార ఆర్భాటాలకు దూరంగా సాగుతున్న వైఎస్ జగన్ పాలనకు మరో వైపు కూడా ఉంది. ఆ పొరబాట్లు చిన్నవా, పెద్దవా అనే విషయం పక్కనపెడితే వాటిల్లో వీలైనంత త్వరగా జాగ్రత్త పడకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల పాలనలో లోపాలు, తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలు. మరో భాగం కాసేపట్లో…