iDreamPost
android-app
ios-app

జ‌గ‌న్ త్రిముఖ విధానాలే కార‌ణం

జ‌గ‌న్ త్రిముఖ విధానాలే కార‌ణం

ప్ర‌పంచం మొత్తం దృష్టి పెడుతున్న ఏకైక అంశం క‌రోనా. అంత‌ర్జాతీయంగా, జాతీయంగా, దేశీయంగా ఎక్క‌డైనా దాదాపు అన్ని అంశాల‌నూ ప‌క్క‌న‌బెట్టి మ‌హ‌మ్మారిని పార‌ద్రోల‌డంపైనే అంద‌రూ దృష్టి పెడుతున్నారు. లాక్ డౌన్ లు, మినీ లాక్ డౌన్ లు, క‌ర్ఫ్యూ త‌దిత‌ర ఆంక్ష‌ల అమ‌లు, క‌రోనా క‌ట్ట‌డికే ప‌రిమితం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే దేశ వ్యాప్తంగా అభివృద్ధి క్షీణిస్తోంది. ఆర్థిక రంగం కుదేల‌వుతోంది. జీడీపీ రేటు త‌గ్గుతోంది. కానీ.. క‌రోనా కాలంలోనూ ఏపీ మాత్రం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. ఎగుమ‌తుల్లోనూ, జీడీపీలోనూ వృద్ధి సాధిస్తోంది. ఇందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనుస‌రిస్తున్న విధానాలే కార‌ణమ‌ని చెప్పాలి.

ఆరోగ్యం.. ఆర్థికం.. సంక్షేమం

ఏపీ సీఎం జ‌గ‌న్ ఓ వైపు అతిపెద్ద విప‌త్తు అయిన క‌రోనా క‌ట్ట‌డికి అధిక సమ‌యం కేటాయిస్తూ స‌మీక్ష‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేస్తూనే ఉన్నారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రించే క‌రోనాను అరిక‌ట్ట‌డం ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యంగా భావిస్తూనే, మ‌రోవైపు ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల పెరుగుద‌ల‌పై కూడా దృష్టి సారించారు. ఇంకోవైపు రాష్ట్ర అభివృద్ది అంశాల‌ను కూడా వ‌ద‌ల‌లేదు. క‌రోనా క‌ట్ట‌డి, సంక్షేమ ప‌థ‌కాల కొన‌సాగింపు, అభివృద్ధి పెరుగుద‌ల‌.. ఈ మూడింటిపైనా ఏక‌కాలంలో దృష్టి సారించిన కార‌ణంగా గ‌డ్డుకాలంలో కూడా ఏపీ మిగిలిన రాష్ట్రాల‌తో పోల్చుకుంటే ముందంజ‌లో ఉంటోంది. ఇటీవ‌ల నీతి అయోగ్ విడుద‌ల చేసిన ర్యాంకుల జాబితాలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు తాజాగా ఎగుమ‌తుల‌లో వృద్ది సాధించింది.

7 నుంచి 5కు..

2020–21లో దేశ వాణిజ్య ఎగుమతులు 7.4 శాతం క్షీణించాయి. అదే సమయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎగుమ‌తుల్లో మాత్రం 2.71 శాతం వృద్ధి సాధించ‌డం సీఎం ప‌నితీరుకు అద్దం ప‌డుతోంది.

2019–20లో 313 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దేశీయ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. దీనికి భిన్నంగా ఏపీలో ఎగుమతులు రూ.1,04,828.84 కోట్ల నుంచి రూ.1,07,730.13 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది రాష్ట్ర ఎగుమతుల వృద్ధిలో డ్రగ్‌ ఫార్ములేషన్స్, స్టీల్‌–ఐరన్, బంగారు ఆభరణాలు, బియ్యం, రసాయనాలు, ఆటోమొబైల్స్, విద్యుత్‌ ఉపకరణాలు వంటి రంగాలు కీలకపాత్ర పోషించాయి. మన రాష్ట్ర ఎగుమతులు దేశీయ ఎగుమతుల్లో 5.8 శాతానికి సమానం.

దీంతో 2019–20లో దేశీయ ఎగుమతుల్లో 7వ స్థానంలో ఉన్న మన రాష్ట్రం రెండు స్థానాలకు ఎగబాకి 5వ స్థానానికి చేరుకుంది. 21 శాతం వాటాతో గుజరాత్‌ మొదటిస్థానంలో ఉండగా, తరువాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (20 శాతం), తమిళనాడు (9 శాతం), ఉత్తరప్రదేశ్‌ (6 శాతం) ఉన్నాయి.

జ‌గ‌న్ ముందు చూపు వ‌ల్లే..

కరోనా కాలంలోనూ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్‌-19 తో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల జీడీపీ తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమంతోపాటుగా పారిశ్రామిక అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరుగుతుందని మంత్రి గౌతంరెడ్డి పేర్కొన్నారు. 2030 ఏడాది టార్గెట్‌తో ముందుకు వెళ్తున్నామన్నారు. ఏపీని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామని గౌతంరెడ్డి వెల్లడించారు. సీఎం జగన్‌ ముందుచూపు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. పారిశ్రామిక కారిడర్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా నూతన పరిశ్రమల ఏర్పాటుకు సులభతర విధానాలను అవలంభిస్తున్నామని తెలిపారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 10 శాతం ఉండేలా కృషి చేస్తున్నామని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు.