పరిశ్రమలో సక్సెస్ కు చిన్నా పెద్ద అనే తేడా ఉండదు. సినిమాలో స్టార్లు ఉన్నారా లేక కొత్తవాళ్లు తీశారా అనే లెక్కలు దానికి తెలియవు. కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులతో శబాష్ అనిపించి కాసుల వర్షం కురిపించేస్తుంది. 2000 సంవత్సరం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బద్రి’తో డెబ్యూనే బ్లాక్ బస్టర్ అందుకున్న పూరి జగన్నాధ్ కోసం నిర్మాతలు క్యూ కట్టారు. అయితే ఎక్కడో లెక్క తప్పి కథ ఎంపికలో చేసిన పొరపాటు వల్ల జగపతిబాబుతో తీసిన ‘బాచి’ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. దీంతో వెంటపడిన ప్రొడ్యూసర్లలో చాలా మంది వెనక్కు వెళ్లారు. అప్పుడు తెలిసింది పూరికి విజయంకున్న విలువలో ఓటమికి సగం కూడా ఉండదని.
దీంతో తాను దర్శకుడు కావడానికి ముందే గతంలో ఎంతో ఇష్టపడి కష్టపడి రాసుకున్న కథను బయటికి తీశాడు. అదే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. దీన్ని అప్ కమింగ్ క్యాస్టింగ్ తో తీసి హిట్టు కొట్టి తానేంటో నిరూపించాలనుకున్నాడు పూరి. హీరోగా సెటిల్ కావడానికి అప్పటికింకా యుద్ధం చేస్తూనే ఉన్న రవితేజను ఎంచుకున్నాడు. సహజత్వం కోసం గ్లామర్ మచ్చుకు కూడా కనిపించని తనూ రాజ్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. బాచి పోయినా పూరికి చక్రి మీద నమ్మకం తగ్గలేదు. అందుకే సంగీత దర్శకుడిగా మరో ఛాన్స్ ఇచ్చాడు. అన్నపూర్ణ, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్బి శ్రీరామ్, ఎంఎస్ నారాయణ, ఉత్తేజ్ తదితరులు సీనియర్ తారాగణాన్నే సెట్ చేసుకున్నాడు.
తక్కువ బడ్జెట్ తో ముందే ప్లాన్ చేసుకున్న లొకేషన్లలో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యాన్ని పూర్తి చేశాడు పూరి. తన స్నేహితుడు రఘు కుంచెని గాయకుడిగా పరిచయం చేశాడు. జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ జంట మధ్య ప్రేమను ఆసక్తికరమైన మలుపులతో పూరి తీర్చిదిద్దిన విధానానికి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దానికి తోడు మంచి సంగీతం, చక్కని హాస్యం తోడవ్వడంతో సినిమా వంద రోజులు పరుగులు పెట్టింది. రవితేజ కోరుకున్న బ్రేక్ రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం చెప్పింది. 2001 సెప్టెంబర్ 14న విడుదలై భారీ విజయం నమోదు చేసుకుంది. ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా రవి, పూరి, చక్రిలకు ఎన్నడూ మర్చిపోలేని బలమైన పునాదిగా నిలిచిపోయింది.