నెమలి పురివిప్పి ఆడడం ఎప్పుడైనా చూశారా ? అది మనకోసం ఆడదు, ఆడ నెమలి కోసం ఆడుతుంది. అలా కొన్ని మగనెమళ్ళ పెర్ఫార్మెన్స్ చూశాక ఆడది తనకు నచ్చిన దానితో జతకడుతుంది. మిగిలినవి ఇంకో ఆడనెమలి కోసం వెదుక్కుంటూ పోతాయ్. కానీ… ఆడనెమలి మీద దాడిచేయవు..!సింహం కూడా అంతే. సివంగి కోసం ఇంకో సింహంతో తలపడుతుంది.ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటుంది. ఓడిపోతే అక్కడినుంచి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. కానీ ..ఆడదానిమీద దాడిచేయదు. కుక్కలు కూడా అంతే.తమలోతాము కొట్టుకుంటాయి కానీ ఆడకుక్కమీద కత్తులతోనో యాసిడ్ తోనో దాడిచేయవు.పక్షులు , సముద్రజీవులు ఇలా ఏ జంతువుని తీసుకున్నా..ఆడజంతువు కోసం వేరే మగజంతువు తో పోటీపడి , గాయాలపాలయి, ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోతాయేగానీ..ఆడజంతువు మీద దాడిచేయవు..కానీ..వేరే ఆడ జంతువును లోబరచుకోవడానికి ఎలాంటి వికృత పైశాచిక దాడులకైనా పాల్పడే జంతువొకటుంది ఆ జంతువు విశృంఖలు చేష్టల వల్ల స్త్రీ బయట తిరగడానికే సందేహించే రోజొకటి వచ్చేలా ఉంది.
ఎన్నడూ నేరాలకు పాల్పడని వారు కూడా ఏదొక క్షణంలో క్షణికావేశంలో అత్యాచారాలకు,నేరాలకు పాల్పడుతున్నారు. యువతలో నేర స్వభావం బాగా పెరిగింది. ముఖ్యంగా మద్యపానం వల్ల చిన్న మెదడు పని చేయడం మాని విచక్షణ కోల్పోతారు.ఆ మత్తులో నేరాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ 5G యుగంలో మద్యం సేవించడం స్టేటస్ సింబల్ లా మారిపోయి అదొక ఫ్యాషన్ అయిపోయింది. మద్యం సేవించనివారిని గేలిచేస్తూ చులకనగా చూసే పరిస్థితి ఏర్పడింది. దేశంలో యువతరం మత్తులో జోగుతూ ఉంది. పాశ్చాత్య దేశాల్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరంలో వేడి కోసం అక్కడ మద్యం సేవిస్తారు. కానీ మన యువత మాత్రం గొప్పలు పోవడానికి మద్యం సేవిస్తూ,ఆ మత్తుకి బానిసగా మారి మత్తులో తప్పులు చేస్తున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా పరిస్థితిలో మార్పు లేదు. అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ చెప్పారు. కానీ దేశంలో పట్టపగలే తిరిగే స్వేచ్చని మన దేశంలో ఆడవాళ్ళు పొందుకోలేదని అనేక సంఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో అత్యాచార,హత్యాచార కేసులు పెరిగాయి. ఆడది ఒంటరిగా కాలు బయట పెడితే తిరిగి క్షేమంగా ఇంటికి వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టడం, ఆ రెండురోజులు ఆ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అత్యాచారం చేసినోడిని, చంపాలి, నరకాలి, బహిరంగంగా ఉరి తీయాలంటూ వ్యాఖ్యలు చేయడం మినహా మనం చేసేదేం లేదు. పోలీసులు కూడా 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని ప్రకటనలివ్వడం కూడా ఇప్పట్లో పరిపాటిగా మారిపోయింది. అలా ఒకరోజు సంచలనాలకు ప్రజలు మనసులు కూడా అలవాటు పడిపోయాయి తప్ప, ప్రజల్లో, పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. పైగా అత్యాచార సంఘటనలు ఆందోళన కలిగించే స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి తప్ప తగ్గడం లేదు.
ఆడపిల్లలు కూడా మనలాంటి మనుషులే అనే భావన కలిగించలేని పెంపకం వల్ల యువతలో ఆడవారి పట్ల కలుగుతున్న చిన్న చూపువల్ల, అమ్మాయిని మనిషిలా కాకుండా కోరిక తీరడానికి వాడుకునే యంత్రంలా భావించడం వల్ల అత్యాచార కేసులు,అమ్మాయిలపై దాడులు అదుపు చేయడానికి వీలులేనంతగా పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులో జరిగిన ప్రియాంక రెడ్డి హత్య అందరిని కలచివేస్తున్నది. నలుగురు నిందితులు సాయం చేస్తున్నట్లుగా నటించి,నమ్మించి ప్రియాంక రెడ్డిపై పాశవికంగ హత్యాచారం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.ప్రియాంక హత్య కేసులో అరెస్టయిన నలుగురు నిందితుల్లో ముగ్గురి వయసు 20 సంవత్సరాల లోపే ఉండటం ఆందోళనచెందాల్సిన విషయం. స్త్రీల పట్ల వారికున్న ఆలోచనలను గమనిస్తే, ప్రస్తుతం దేశంలో మాలిన్యంతో కుళ్ళిపోయిన యువ హృదయాలకు పోలికగా కనబడతారు. సమాజంలో చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల వారు అలా మారారా లేదా వారిలో అంతర్లీనంగా వారిలో నేర స్వభావం దాగి ఉందా అనేది తేలాల్సి ఉంది. కఠిన చట్టాలు చేసినా, ప్రభుత్వాలు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలన్న తలంపును ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ ప్రజల్లో తీసుకురాలేక పోతున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం గా చెప్పుకోవచ్చు.
నిస్సహాయ స్థితిలో ఉన్నవారు కానీ, నేరాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు కానీ పోలీసులకు సమాచారం ఇవ్వడానికి సందేహిస్తున్నారు అంటే దానికి కారణం ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ లేకపోవడమే. పోలీసు కేసుల్లో ఇరుక్కుంటా మనే భయంతోనో, పోలీస్ స్టేషన్ కి వెళ్లారని తెలిస్తే సమాజం చులకనగా చూస్తుందన్న భావంతోనో పోలీసులకు సమాచారం ఇవ్వడానికి పలువురు సందేహిస్తున్నారు. ప్రజల్లో ఉన్న ఈ మూఢనమ్మకం పోయేలా పోలీసు వ్యవస్థ ప్రభుత్వాలు కృషి చేయాలి. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మొదట సమాచారాన్ని ఇవ్వాల్సింది పోలీసులకేనని,నమ్మకాన్ని రేకెత్తించేలా అవగాహనా కార్యక్రమాలు ప్రజల్లో కలిగించాలి. నిస్సహాయ స్థితిలో ప్రియాంక తన సోదరికి ఫోన్ చేసింది. ఆరు నిమిషాలకు పైగా సోదరితో మాట్లాడింది. కాని సహాయానికి సంబంధించి ఉన్న టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలన్న తలంపు ప్రియాంకకు రాకపోవడం దురదృష్టకరం. టోల్ ఫ్రీ నంబర్ల గురించి ప్రభుత్వాలు, ప్రజలకు పూర్తి అవగాహనా కలిగేలా ఏర్పాట్లు చేయాలి,ప్రకటనలు ఇప్పించాలి,కార్యక్రమాలు నిర్వహించాలి. పోలీసులు కూడా కుటుంబ సభ్యులే అన్న భావన ప్రజల్లో కలిగేలా కృషి చేయాలి.ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ కు మొదట సమాచారాన్ని ఇవ్వాలన్న ఆలోచన ప్రజల్లో కలిగేలా చైతన్యం తీసుకురావాలి. అప్పుడే బాధితులకు సత్వర సాయం అందే అవకాశం ఉంది.
వ్యవస్థను నిందిస్తూనో,మగజాతి మొత్తాన్ని నిందిస్తూనో కూర్చుంటే అమ్మాయిలపై అత్యాచారాలు ఒకేసారి తగ్గిపోయి అకస్మాత్తుగా ప్రజల్లో మార్పు రాదు. చిన్న వయసునుండే ప్రతి ఒక్కరికీ తల్లిదండ్రులు మోరల్ ఎథిక్స్ నేర్పాలి. వారికి అమ్మాయిల పట్ల గౌరవ మర్యాదలు పెరిగేలా క్రమశిక్షణతో పెరిగేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలి. యుక్త వయసులో శరీరంతో పాటు మనసుల్లో కలిగే మార్పులను యువతకు అర్థమయ్యేలా పేరెంట్స్ టీచ్ చేసినప్పుడు వ్యవస్థలో కొంతలో కొంత మార్పైనా కలిగే అవకాశం ఉంది. అత్యాచారం చేయడానికే భయపడేలా కఠిన చట్టాలు దేశంలో అమలు చేయాలి. విచారణలో జాప్యం లేకుండా నిందితులకు శిక్షలు త్వరగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. శిక్షల వల్ల కలిగే భయంతో కొందరు నేరం చేయాలన్న ఆలోచనలు పక్కకు పెడతారు.స్వీయ నియంత్రణ, విలువలు నేర్పకుండా పిల్లలని పెంచే ప్రేమ ఎన్నడూ ఒక మనిషిని మనిషిగా ఉంచలేవు. నిత్యం పరుగులు తీస్తున్న ఈ బిజీ ప్రపంచంలో పిల్లలకు విలువలు నేర్పడానికి కొంతసమయాన్ని తల్లిదండ్రులు కేటాయించాలి. తమ పిల్లల్లో కలిగే ఆలోచనలు ఓ కంట కనిపెడుతూ వారి ప్రవర్తనలో ఏదైనా మార్పు కనబడితే సున్నితంగా మందలించాలి. దండించడానికి కూడా వెనుకాడకూడదు.
పాటించాల్సిన జాగ్రత్తలు
ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మహిళలు, మొబైల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు సేవ్ చేసుకోవాలి. ఏదైనా ఆపద వస్తే టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారాన్ని ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వడం ద్వారా, ఆపద నుండి తప్పించుకుని నేరస్తులకు శిక్ష పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఉంటే “హాక్ ఐ” అప్లికేషను ప్రతి ఒక్కరు తప్పకుండా ఇంస్టాల్ చేసుకోవాలి. హాక్ ఐ అప్లికేషన్ ద్వారా అత్యవసర సహాయాన్ని త్వరగా పొందే అవకాశం ఉంది.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లను అవసరానికి మేర ఉపయోగించుకోవాలి….టోల్ ఫ్రీ నంబర్లయినా 112,100,1090, 181, 1091 ను ఆపద సమయంలో వాడాలి .ముఖ్యంగా అమ్మాయిలు పైన చెప్పిన టోల్ ఫ్రీ నంబర్లు సేవ్ ఖచ్చితంగా సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్లు తమ పిల్లలు మొబైల్ లో సేవ్ చేసుకునేలా ప్రోత్సహించాలి.ప్రజలంతా ముఖ్యంగా మహిళలు ఉపయోగించడం అలవాటుగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. నిందితులను కొన్ని గంటల్లో పట్టుకుంటాం అనే స్థాయి నుండి, సకాలంలో స్పందించి ముప్పును తప్పించగలిగాం అనే స్థాయికి ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ ఎదగిన రోజు దేశం నిజమైన అభివృద్ధి సాధించిందని అనుకోవచ్చు. ఇప్పటికైనా మార్పు మననుండే మొదలవ్వాలని ఆశిద్దాం. మరో బాధిత వ్యక్తిగా నిలవకూడదని కోరుకుందాం.