నవ్వు నాలుగువిధాలా చేటు అనేది నానుడి అయితే నవ్వించడం ఒక గ్రేటు ఆర్టు అనేది హాస్యబ్రహ్మ జంధ్యాల గారు నమ్మిన సూత్రం. ఇప్పుడంటే జబర్దస్త్ జమానాలో పడి ద్వందార్థాలనే గొప్ప కామెడీ అనుకుంటున్నాం కానీ ఒకప్పుడు కుటుంబం మొత్తం పగలబడి నవ్వే ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించిన అరుదైన దర్శకుల్లో జంధ్యాలది అగ్రపీఠం. ఆయన కెరీర్ చివరిలో రూపొందించిన వాటిలో చెప్పుకోదగ్గ చిత్రం ష్ గప్ చుప్. 1994వ సంవత్సరం. అప్పటికే సుప్రసిద్ధ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన 4 నవలలను జంధ్యాల తెరకెక్కించారు. అవి చంటబ్బాయి, శ్రీవారి శోభనం, రెండు రెళ్ళు ఆరు, నీకు నాకూ పెళ్ళంట.
అయిదవదానికి శ్రీకారం చుట్టారు. అదే ష్ గప్ చుప్. ఆ సమయానికే భానుప్రియ తెలుగులో సినిమాలు చేయడం చాలా తగ్గింది. 1991లో వచ్చిన రాముడు కాదు రాక్షసుడు, భగత్ తర్వాత మళ్ళీ హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. తమిళంలో కొనసాగుతున్నారు. సరైన కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో జంధ్యాల గారు తననే మెయిన్ లీడ్ గా ఈ కథ చెబితే హీరో ఎవరని కూడా అడక్కుండా ఒప్పేసుకున్నారు. కమర్షియల్ సినిమాలతో ఫామ్ లో ఉన్న రాజ్ కోటిని సంగీత దర్శకులుగా, ఎంవి రఘు ఛాయాగ్రహణంలో శివ-ప్రతాప్ లు ప్రగతి చిత్ర బ్యానర్ మీద అతి తక్కువ సమయంలో రీజనబుల్ బడ్జెట్ లో నిర్మించారు.
బ్యాంకులో ఉద్యోగం చేసే రవళి దగ్గరున్న లక్ష రూపాయలు దొంగతనమవుతాయి. పై ఆఫీసర్ లకు తెలియకుండా వాటిని సర్దాలని ప్రయత్నించిన ఆమెకు వరుసగా కొత్త ఇబ్బందులు పలకరిస్తాయి. ప్రియుడు(వరుణ్ తేజ్)ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కవుట్ అవ్వవు. మరి ఆఖరికి ఈ సమస్య ఎలా పరిష్కారమయ్యిందన్నదే అసలు కథ. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరిదాకా సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. పిచ్చి తండ్రిగా సుత్తివేలు, బందరు పోలీస్ గా కోట, బ్యాంకు ఉద్యోగులుగా ఏవిఎస్, ధర్మవరపు, శ్రీలక్ష్మి తదితరులు అద్భుతమైన కామెడీ పండించారు. వ్యాక్యూమ్ క్లీనర్లు అమ్మే వాడిగా శుభలేఖ సుధాకర్ ట్రాక్ కి కడుపు పొట్టచెక్కలవుతుంది. తిట్ల దండకంతో జొన్నవిత్తుల రాసిన పాట చాలా పాపులర్. 1994 మే 12న విడుదలైన ష్ గప్ చుప్ మంచి స్పందన దక్కించుకుంది.