Idream media
Idream media
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి మధ్య గ్యాప్ పెరుగుతుందా అంటే నిజమేనంటున్నాయి అధికారిక వర్గాలు. తాజాగా కోవిడ్-19పై సమీక్షకు రావాలంటూ గవర్నర్ కోరటం..దానికి మేం రాలేమంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి బదులివ్వటం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని గవర్నర్ భావించారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రాజ్ భవన్‌కు రావాలంటూ సిఎస్ సోమేశ్ కుమార్‌ను, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. కానీ షెడ్యూల్ ప్రకారం తమకు అంతకుముందే నిర్ణయించిన సమావేశాలున్నాయనీ, అందువల్ల గవర్నర్ సమావేశానికి రాలేమంటూ వారు స్పష్టంచేశారు.
దీంతో గవర్నర్ తమిళిసై వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై తాను సమీక్ష నిర్వహించాలని భావిస్తే, రాకుండా డుమ్మా కొట్టడం ఎంత వరకు సమంజసమంటూ ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం సమావేశం మళ్లీ నిర్వహిస్తామనీ…దానికి తప్పకుండా హాజరు కావాలంటూ ఆమె ఆదేశించారు.
అయితే ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అధికారులు హాజరవుతారా..? గైర్హాజరు అవుతారా..? వేచి చూడాలి. హాజరైనా, లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ మధ్య గ్యాప్ మాత్రం కంటిన్యూ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి గవర్నర్ తమిళ సై షాక్ ఇచ్చారు. తెలంగాణలో చాలా మంది మదిలో కెసిఆర్ అందుబాటులో ఉండరనీ, సెక్రటేరియట్‌కి రాకుండా ఎంతసేపూ ఫామ్‌హౌస్‌లోనో, ప్రగతిభవన్‌లోనో ఉంటున్నారని ఉంది. ఈ విషయాన్ని పట్టేసిన కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్… కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండట్లేదని కంప్లైంట్ చేశారు. అందువల్ల తాను రాజ్ భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించాలనుకుంటున్నానని అనేశారు.
ఐతే… ఇక్కడ గవర్నర్ ఓ రాజకీయ ఎత్తుగడ వేశారని అనుకోవచ్చు. ఎలాగంటే… ఆమె డైరెక్టుగా ప్రజా దర్బార్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకోలేదు. ఎంబిటి నేత అమ్జదుల్లాఖాన్… ప్రజాదర్బార్ నిర్వహించాలని ఆమెను ట్వీట్ ద్వారా కోరగా… ఆమె ఓకే అన్నట్లు స్పందించారు.
నిజానికి తెలంగాణకు గవర్నర్‌గా తమిళిసైని నియమించినప్పుడే టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ అలర్ట్ అయ్యారు. తమిళిసై బాధ్యతలు స్వీకరించిన రోజే… మంత్రివర్గాన్ని విస్తరించి… కేబినెట్‌లో తొలిసారి ఇద్దరు మహిళలకు ఛాన్స్ ఇచ్చారు. తద్వారా కేబినెట్‌లో మహిళా నేతలు లేరన్న విమర్శలకు చెక్ పెట్టారు. ఐతే… తమిళిసై… కెసిఆర్ అందుబాటులో ఉండట్లేదన్న అంశాన్ని తెరపైకి తేవడం ద్వారా… బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.