Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశానికి ఎన్నడూ లేని వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఓ పక్క వైసీపీ ప్రజల్లో తిరుగులేని విధంగా పాతుకుపోతోంది. దాన్ని ఢీ కొట్టేందుకే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అష్టకష్టాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా బీజేపీ రూపంలో మరో సవాల్ బాబుకు ఎదురవుతోంది. సోము వీర్రాజు బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక ఆ పార్టీ ప్రస్తుతానికి జోరు మీదుంది. క్షేత్రస్థాయిలో కూడా దూకుడు ప్రదర్శించేందుకు భారీ ప్రణాళికలే రచిస్తోంది. ఆ పార్టీ ప్రణాళికలకు, సోము చేస్తున్న రాజకీయాలకు ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ కంగారు పడుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సున్నా ఉన్న పార్టీకి గత ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు సాధించిన టీడీపీ బెదరాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలను విస్తృత ప్రచారం చేయడం ద్వారా ఏపీలోనూ బీజేపీ బలపడడానికి చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణమని చెబుతున్నారు.
కన్నా ఉన్నప్పుడు బే ఫికర్!
బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు తెలుగుదేశం ఆ పార్టీని పెద్దగా లెక్కలోకి తీసుకున్న దాఖలాలు కనిపించ లేదు. దీనికి తోడు టీడీపీ తోక పార్టీగా బీజేపీ ఉందన్న ప్రచారం విపరీతంగా జరిగింది. అలాగే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలందరు కూడా చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తున్నారన్న వాదనా ఉంది. అమరావతి విషయంపై గవర్నర్ కు కన్నా లేఖ రాయడం నుంచి కొన్ని ఇతర వ్యవహారాలు కూడా బీజేపీ, టీడీపీ లక్ష్యాలు ఒకటేనన్న భావన బలపడింది. దీంతో బీజేపీ నుంచి తమకు పెద్దగా నష్టం లేదని స్థానిక టీడీపీ నాయకులు భావించేవారు. కానీ కొంత కాలంగా ఏపీలో పరిస్థితి మారింది. కన్నా అనంతరం ఆ బాధ్యతలు తీసుకున్న సోము వీర్రాజు తోక పార్టీ అనే పేరును చెరిపేసే విధంగా బీజేపీ అభిప్రాయాలకు అనుగుణంగా మాట్లాడిన, ప్రవర్తించిన వారినందరినీ సస్పెన్షన్ చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
టీడీపీ కేడరే లక్ష్యంగా…
దీంతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీ కేడర్ ను లక్ష్యంగా చేసుకుని క్షేత్ర స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, పట్టణ, గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్ర ప్రణాళికలు రచిస్తున్నారు.
రోజూ ఏదో ప్రాంతానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో మంతనాలు జరుపుతూ తెలుగుదేశంపై అసంతృప్తి ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను గుర్తించాలని చెబుతున్నట్లు తెలిసింది.
దీనికి తోడు త్వరలో బీజేపీలోకి భారీ వలసలు ఉంటాయని ఇప్పటికే సోము చాలా సార్లు ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సోము ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో తెలియదు కానీ.. ప్రస్తుతం శూన్యమే అనుకుంటున్న పార్టీ ఏపీని అత్యధిక కాలం పాలించిన తెలుగుదేశాన్ని కలవరపెడుతుందనడంలో సందేహం లేదు.