“చేసుకున్న వాడికి చేసుకున్నంత” అనే నానుడి ఒకటుంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే హిస్టరీ రిపీటవుతుందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే తెలుగుదేశంపార్టీలో తొందరలోనే చీలిక తప్పదనే సంకేతాలు కనబడుతున్నాయి. పార్టీ నుండి ఒక్కో ఎంఎల్ఏ బయటకు వచ్చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో ఇప్పటికి ముగ్గురు బయటకు వచ్చేసినట్లే. విచిత్రమేమిటంటే బయటకు వచ్చేసిన ముగ్గురు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరామ్ అధికార పార్టీలో చేరకపోవటం.
అంటే వాళ్ళు సాంకేతికంగా టిడిపి సభ్యులే అయినా పార్టీతో సంబంధాలు లేకుండానే వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో వాళ్ళు అధికార వైసిపిలో కూడా చేరలేదు. మధ్యేమార్గంగా తమను స్వతంత్ర సభ్యులుగా పరిగణించమని గతంలో వంశీ, గిరి చేసిన విజ్ఞప్తిని స్పీకర్ సానుకూలంగా స్పందించారు. దాంతో అసెంబ్లీలోనే విడిగా కూర్చుంటున్నారు. వీళ్ళిద్దరి పద్దతిలోనే రాబోయే సమావేశాల్లో కరణం కూడా విడిగా కూర్చునే అవకాశాలున్నాయి. మొన్న గిరి చెప్పిన తాజాగా కరణం చెప్పిన విషయం ఏమిటంటే తొందరలోనే పార్టీ నుండి మరో 12 మంది ఎంఎల్ఏలు బయటకు వచ్చేసేందుకు రెడీగా ఉన్నారని.
వీళ్ళు చెప్పినట్లు నిజంగానే 15 మంది ఎంఎల్ఏలు టిడిపి నుండి బయటకు వచ్చేస్తే వీళ్ళపై అనర్హత వేటు వేసేందుకు లేదు. అదే సమయంలో జరగబోయే ఇంకో ఇంపార్టెంటు పరిణామం ఏమిటంటే తమదే అసలైన టిడిపి అని ఈ 15 మంది ఎంఎల్ఏలు స్పీకర్ కు లేఖ ఇచ్చే అవకాశం ఉంది. అంటే తెలంగాణా అసెంబ్లీలో టిడిపి ఎంఎల్ఏలు ఏమి చేశారో అచ్చంగా ఏపిలో కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉంది. తెలంగాణాలో టిడిపి నుండి బయటకు వెళ్ళిపోయిన ఎంఎల్ఏలు స్పీకర్ ను కలిసి తమదే అసలైన టిడిపి అంటూ ఓ లేఖ ఇచ్చారు. దాన్ని స్పీకర్ ఆమోదించేశాడు.
అదే పద్దతిలో ఏపిలో కూడా స్పీకర్ కు చీలికవర్గం ఎంఎల్ఏలు లేఖ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అదే గనుక జరిగితే అప్పుడు చంద్రబాబునాయుడుకు రెండు రకాలుగా దెబ్బ పడుతుంది. మొదటిదేమో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోల్పోవటం. రెండోదేమో అసెంబ్లీలో టిడిపి నేతగా చంద్రబాబు గుర్తింపు కోల్పోవటం. అంటే చీలికవర్గాన్నే అసలైన టిడిపిగా స్పీకర్ గుర్తిస్తే చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి మరో వర్గంగా ఉండిపోతుంది. తన నేతృత్వంలోని పార్టీకి చంద్రబాబు అపుడు ఏ పేరు పెట్టుకుంటాడనేది వేరే సంగతి.
1995లో ఏమి జరిగిందో గుర్తుందా ? అప్పుడు కూడా బంపర్ మెజారిటితో అడుగుపెట్టిన ఎన్టీయార్ ను చంద్రబాబు ఏడాదిలోపే వెన్నుపోటు పొడిచి పదవిలో నుండి దింపేశాడు. ముఖ్యమంత్రిగా దింపేయటమే కాకుండా పార్టీని లాగేసుకున్నాడు. అంతేకాకుండా పార్టీ బ్యాంకు అకౌంట్లను, పార్టీ గుర్తును ఎన్నికల చిహ్నంతో సహా కబ్జా చేసేశాడు. చివరకు అసెంబ్లీలో ఎన్టీయార్ కు మాట్లాడే అవకాశం లేకుండా చేసి బయటకు వెళ్ళిపోయేట్లు చేశాడు. అచ్చంగా అప్పుడు ఏమి జరిగిందో ఇపుడు కూడా అదే విధంగా జరుగుతుందని చెప్పేందుకు లేదు. మొత్తం మీద హిస్టరీ రిపీటయ్యే అవకాశాలున్నాయని మాత్రం అనుమానంగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
8610