iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో తన టీమ్ లో మార్పులకు జగన్ ఉపక్రమిస్తున్నారు. త్వరలోనే భారీ మార్పులతో క్యాబినెట్ పునర్వవస్థీకరణ జరగబోతోంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాటల్లో అయితే మొత్తం మంత్రులందరినీ మార్చేస్తున్నారు. కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారు. తాను అధికారంలోకి వచ్చే ముందు సహచరులకు చెప్పిన మాటలను ఆచరణలో పెట్టబోతున్నారు. మంత్రులుగా బాధ్యతలు తీసుకుంటున్న వారంతా రెండున్నరేళ్ల తర్వాత పార్టీ బాధ్యతల్లోకి మారాల్సి ఉంటుందని జగన్ ఆనాడే చెప్పారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మంత్రులుగా ఉన్న వారందరికీ వివిధ బాధ్యతలు అప్పగించబోతున్నారు. పార్టీని వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు.
ఈనెల 28న ఏపీ క్యాబినెట్ భేటీ జరగబోతోంది. వెలగపూడి సెక్రటేరియేట్ లో ఈ సమావేశం జరుగుతుంది. బహుశా ఇప్పుడు క్యాబినెట్ కి ఇదే చివరి భేటీగా కొందరు భావిస్తున్నారు. అయితే వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నందును అప్పుడు కూడా మరోసారి సమావేశం జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రులంతా రాజీనామా చేస్తారని సమాచారం. సమావేశాలు ముగిసిన వెంటనే కొత్త క్యాబినెట్ కూర్పు ఉంటుందని భావిస్తున్నారు. దాంతో ఇప్పుడున్న మంత్రులకు ఏ విధమైన బాధ్యతలు అప్పగిస్తారోననే చర్చ మొదలవుతోంది.
గత నెలలో జరిగిన క్యాబినెట్ భేటీలోనే జగన్ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. మళ్లీ ప్రజల ముందుకెళ్లేందుకు అంతా సిద్ధం కావాలని ఆదేశించారు. దానికి అనుగుణంగా సీఎం పర్యటనల ప్రణాళిక సిద్ధమవుతోంది. అదే సమయంలో మంత్రులందరూ ప్రజల్లోకి వెళ్లాలనే ఆదేశాలను ఆయన ఇవ్వడంతో క్యాబినెట్ సహచరులంతా ఇటీవల కొంత క్రియాశీలకంగా మారుతున్నారు. బద్వేలు ఉప ఎన్నికలు, టీడీపీ నేతల బూతు మాటలను తిప్పికొడుతూ చేపట్టిన జనాగ్రహ దీక్షల్లో అత్యధికులు పాల్గొన్నారు. దాంతో ఈసారి క్యాబినెట్ భేటీలోనే మంత్రుల భవిష్యత్తుకి సంబంధించిన కార్యాచరణపై జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఏ మంత్రి, ఏ విధమైన బాధ్యత తీసుకోవాలి, పార్టీ అవసరాలకు అనుగుణంగా ఏ విధంగా పనిచేయాలనేది జగన్ ప్రాధమికంగా తెలియజేస్తారని అంటున్నారు.
రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి.ఈనెల 28వ తేది గురువారం ఉ.11గం.లకు అమరావతి సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ హాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉంటుంది ఈమేరకు మంత్రి వర్గ సమావేశంలో చర్చించాల్సిన అజెండా ప్రతిపాదనల అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈనెల 26వతేదీ మంగళవారం మధ్యాహ్నం లోగా సమర్పించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఆర్థిక పరిస్థితి కోలుకుంటున్న దశలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మరింత ఉధృతంగా చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కాగ్ నివేదిక ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ప్రభుత్వం ఆదాయం పెంచుకోగలిగింది. పండుగల సమయంలో మార్కెట్ కళకళలాడడంతో అక్టోబర్ నుంచి మరింత జోష్ రావచ్చు. వాటిని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునే రీతిలో క్యాబినెట్ నిర్ణయాలుంటాయని అంచనా వేస్తున్నారు.