iDreamPost
iDreamPost
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత జిల్లాలకు జిల్లాలు ఆ పార్టీకి కంచుకోటలుగా మారిపోయాయి. టీడీపీకి అత్యంత బలం ఉన్న నియోజకవర్గాలు సైతం దాసోహమయ్యాయి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఆ పార్టీకి పట్టు చిక్కలేదు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ పట్టు నిరూపించుకున్న నియోజకవర్గాల్లో విజయవాడ తూర్పు సెగ్మెంట్ ఒకటి. గత సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో రెండు తప్ప అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ పాగా వేసింది. అయితే తూర్పు నియోజకవర్గం వరుసగా రెండోసారి టీడీపీ నేత గద్దె రామ్మోహన్ నెగ్గారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి మరోలా ఉంది. వైఎస్సార్సీపీ ఫోకస్ పెట్టి దూకుడు పెంచడంతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ ప్రజల్లోకి దూసుకుపోతూ పార్టీ పటిష్టానికి కృషి చేస్తుండటంతో అధికార పార్టీకి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి.
అవినాష్ రాకతో జోష్
తూర్పు నియోజకవర్గంలో టీడీపీ వరుసగా రెండుసార్లు విజయం సాధించి తన ఆధిక్యత నిలబెట్టుకుంది. ఆ పార్టీ నేత గద్దె రామ్మోహన్ 2014 ఎన్నికల్లో తొలిసారి ఇక్కడ గెలిచారు. 2019 ఎన్నికల్లో జగన్ హవాను కూడా తట్టుకొని రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికలు జరిగిన ఆరునెలలకే వైఎస్సార్సీపీ నియోజకవర్గంపై దృష్టి సారించి ఇంఛార్జిగా దేవినేని అవినాష్ ను రంగంలోకి దించింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఆయన పార్టీ పటిష్టానికి ప్రయత్నాలు ప్రారంభించారు. నియోజకవర్గం మొత్తం కలియదిరుగుతూ, నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఆదరణ పొందుతున్నారు. నేతలందరినీ కలుపుకొనిపోతూ.. ప్రభుత్వం నుంచి అందుతున్న నిధులు, సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా కృషి చేస్తున్నారు. తన పనితీరుతో సీఎం జగన్ మన్ననలు కూడా పొందుతూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. రెండేళ్లలోనే నియోజకవర్గంలో పార్టీకి సానుకూల వాతావరణం నెలకొనేలా చేయడంలో విజయం సాధించారు.
కలుసోస్తున్న సమీకరణాలు
రాజకీయ, సామాజిక, స్థానిక సమీకరణాలు కూడా కలిసి వస్తుండటంతో టీడీపీని డామినేట్ చేసే స్థాయికి వైఎస్సార్సీపీ ఎదిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని మెజారిటీ డివిజన్లను అధికార పార్టీ కైవసం చేసుకోవడం దీనికి నిదర్శనం. నియోజకవర్గం బలంగా ఉన్న కమ్మ సామాజికవర్గానికి చెందిన అవినాష్ కు అది కూడా కలిసివస్తోంది. యువనేతగా తన సామాజికవర్గ యువతను ఆకట్టుకుంటూ వారి సాయంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారు. నియోజకవర్గానికే చెందిన అడపా శేషును రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం, ఒక డిప్యూటీ మేయర్ పదవి కూడా దక్కడం కలిసివచ్చే అంశాలు. మరోవైపు ఇక్కడ రెండుసార్లు నెగ్గిన టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బాగా వెనుకబడ్డారు. పార్టీ అధికారంలో లేకపోవడం, నగర టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరు కొనసాగిస్తుండటంతో పార్టీ బలహీనపడింది. ఎమ్మెల్యే రామ్మోహన్ కూడా అంత చురుగ్గా ఉండటం లేదు. ఈ పరిణామాలన్నీ తూర్పులో వైఎస్సార్సీపీని బలంగా నిలబెట్టాయి.
Also Read : Kapu Corporation – ఎంతో చేసిన టీడీపీని కాపులు ఎందుకు తిరస్కరించారో?