iDreamPost
android-app
ios-app

BJP, Maharashtra, narayan rane – మహారాష్ట్రపై బీజేపీ కన్ను పడిందా?

  • Published Nov 28, 2021 | 8:13 AM Updated Updated Nov 28, 2021 | 8:13 AM
BJP,  Maharashtra, narayan rane – మహారాష్ట్రపై బీజేపీ కన్ను పడిందా?

‘మార్చిలోగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది’.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో సాధారణ నాయకుడు కాదు. సాక్షాత్తు కేంద్ర మంత్రి, మాజీ సీఎం నారాయణ్ రాణే చేసిన ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెసులతో కూడిన మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ కూటమిలో లుకలుకలు గానీ.. అనిశ్చితి గానీ ఏర్పడిన సంకేతాలు మచ్చుకైనా లేవు. మరి ఎలా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే ప్రశ్న కొందరు మీడియా ప్రతినిధులు నేరుగా నారాయణ్ రాణేనే అడిగారు. అయితే కొన్ని విషయాలు రహస్యంగా ఉంచాలంటూ.. అది ఎలాగన్నది మాత్రం కేంద్రమంత్రి చెప్పలేదు. దాంతో మహారాష్ట్రపై బీజేపీ కన్ను పడిందంటూ పలు రకాల వాదనలు, చర్చలు వినిపిస్తున్నాయి.

బీజేపీకి ఇలాంటివి అలవాటే

పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చి.. ప్రభుత్వాలను మార్చివేసే సంప్రదాయం బీజేపీకి ఉంది. గతంలో గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే రీతిలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. గోవాలో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక పెద్ద పార్టీగా అవతరించినా.. బీజేపీ ప్రాంతీయ పార్టీలను తనవైపు తిప్పుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఎమ్మెల్యేలను ప్రలోభాలతో తనవైపు తిప్పుకొని ఆ ప్రభుత్వం కూలిపోయేలా చేసి.. అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మధ్యప్రదేశ్ లోనూ అదే వ్యూహం అనుసరించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ బొటాబొటీ మెజారిటీ సాధించి కమలనాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే 2020లో జ్యోతిరాదిత్య సింధియా వర్గాన్ని కాంగ్రెస్ నుంచి చీల్చి తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అదే వ్యూహాన్ని మహారాష్ట్రలో అమలు చేసి ఎమ్మెల్యేల కొనుగోళ్లకు, పార్టీల్లో చీలికలకు బీజేపీ ప్రయత్నించవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అధికారం కోసం ఆరాటం

మహారాష్ట్రలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అధికార బీజేపీ-శివసేన కూటమి మెజారిటీ సీట్లు సాధించింది. కానీ సీఎం పదవి విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సీఎం పదవి తమకే ఇవ్వాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే చేసిన డిమాండ్ ను బీజేపీ తిరస్కరించడం.. నెలరోజులు గడిచినా వివాదం తేలకపోవడంతో కొన్ని రోజులపాటు రాష్ట్రపతి పాలన అమలు చేయాల్సి వచ్చింది. తర్వాత 2018 నవంబర్ 23న కేంద్రంలో ఉన్న బలంతో రాష్ట్రపతి పాలన తొలగించి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే అసెంబ్లీలో బలనిరూపణలో విఫలమై మూడు రోజుల్లోనే రాజీనామా చేశారు. తర్వాత శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడి ఉద్ధవ్ థాక్రే సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అప్పట్లో భంగపడి అధికారానికి దూరమైన బీజేపీ అవకాశం కోసం ఎదురు చూస్తోంది. శివసేనను మళ్లీ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఈ తరుణంలో కేంద్రమంత్రి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలు ఉత్కంఠ రేపుతున్నాయి.

Also Read : Nara Lokesh ,Mangalagiri -ఈసారి లోకేష్ గెలిచేస్తాడ‌ట‌..!