Idream media
Idream media
కార్పొరేషన్ పరిధిలోని ఓ డివిజన్ ఉప ఎన్నిక వ్యవహారం తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీని గందరగోళం నెట్టేసింది. లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక ఏకగ్రీవం కోసం కొందరు నేతలు టీఆర్‌ఎస్ మంత్రి కేటీఆర్‌ను కలవడంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్నాళ్లు పార్టీ ముఖ్య నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఈ సందర్భంగా బయటపడుతున్నాయి. పార్టీ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముందు రోజే సొంత పార్టీ నేతలు ఏకంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలుసుకోవడం పట్ల, కమలం సారథి బండి సంజయ్‌తో పాటు సీనియర్ నేతలు మండిపడుతున్నట్లుగా తెలిసింది. అంతేకాదు.. దీని వెనుక కుట్ర కోణాలున్నాయన్న అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఓ వైపు యుద్ధం జరుగుతుంటే…
తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ సై అంటే సై సై అంటున్నాయి. ప్రతీ ఎన్నికలోనూ గట్టిగా ఢీ కొంటున్నాయి. గత డిసెంబర్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీలూ ఎలా పోరాడాయో అందరికీ తెలిసిందే. బీజేపీ నుంచి అగ్రనేతలు సైతం రంగంలోకి దిగి ఎన్నికలను రక్తి కట్టించారు. ఆ ఎన్నికల్లోనే లింగోజి డివిజన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే కార్పొరేటర్‌గా ఎన్నికైన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేశ్‌గౌడ్ ప్రమాణ స్వీకారం చేయకముందే చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆ డివిజన్ ఉప ఎన్నికకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. అనంతరం మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఆధ్వర్యంలో కొంత మంది బీజేపీ నేతలు రమేశ్ గౌడ్ కుటుంబ సభ్యులతో వెళ్లి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. రమేశ్ గౌడ్ కుమారుడికే మళ్లీ బీజేపీ టికెట్ ఇస్తున్నామని ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు. ఇందుకు కేటీఆర్ ఓకే చెప్పారు. అంతేకాదు.. కాంగ్రెస్‌తో కూడా ఆయనే స్వయంగా మాట్లాడారు. ఇదిలా ఉండగా, ఒకవైపు టీఆర్‌ఎస్‌పై యుద్ధం చేస్తుంటే, మరోవైపు అదే పార్టీ ముఖ్యులతో సమావేశం కావడం ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తుందనే ఆందోళన బీజేపీ ముఖ్య నేతల్లో ఏర్పడింది.
గెలిచే అవకాశం ఉన్న చోట..
ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని పలుమార్లు విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనతో భేటీ కావడమేంటని కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘‘టీఆర్‌ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయం అంటూ ప్రకటించాం. ఆ దిశగా దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. ఇప్పుడు సాగర్ ఉప ఎన్నికలో కూడా నువ్వా?నేనా? అన్నట్లుగా టీఆర్‌ఎస్‌ను ఢీ కొంటూ ప్రచారం కూడా చేశాం. ఈ తరుణంలో గులాబీ పార్టీ నాయకత్వంతో భేటీ కావడం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. పోటీ చేసి గెలిచే అవకాశం ఉన్న డివిజన్‌లో, ఏకగ్రీవం కోసం మద్దతు కోరడం ఏమాత్రం సమర్థనీయం కాదు’’ అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఒకవైపు టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో ఎండగడుతున్న తాము, తాజా ఘటనతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ప్రచారం నిజమేనా..?
టీఆర్‌ఎస్ ట్రాప్‌లో కొంతమంది బీజేపీ సీనియర్ నేతలు పడినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాగర్ పోలింగ్‌కు సరిగ్గా ఒక రోజు ముందు, ఆ పార్టీ నేతలను తమ వద్దకు రప్పించుకునేలా స్కెచ్ వేశారని కమలం వర్గాలు పేర్కొంటున్నాయి. ‘‘లింగోజిగూడ డివిజన్‌ను ఏకగ్రీవం చేసుకుందామంటూ టీఆర్‌ఎస్ ముఖ్య నేతల నుంచి రమేశ్ గౌడ్ కుటుంబసభ్యులతో పాటు మా పార్టీ సీనియర్లు కొంతమందికి ఫోన్లు వచ్చాయి. లాంఛనంగా, వచ్చి తమ మద్దతు కోరాలని టీఆర్‌ఎస్ నేతలు సూచించారు. అయితే, టీఆర్‌ఎస్‌కు ఉన్నట్టుండి మాపై ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందో మా వాళ్లు అంచనా వేయలేకపోయారు’’ అని బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. కాగా, రంగారెడ్డి జిల్లా శాఖపై పార్టీ రాష్ట్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే ఈ ఘటనపై ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో, వీరిపై ఎలాంటి చర్య తీసుకుంటారన్నది చర్చనీయాంశమైంది.