134 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నో మలుపులు, ఎన్నో ఎత్తుపల్లాలు, మరెన్నో ఒడిదుడుకులు – ప్రపంచమే గుర్తించిన గొప్ప గొప్ప నాయకులు ఉన్న ఆ పార్టీలో అంతర్లీనంగా సోంత మనుషులగా అనుకునే వారి నుండే ఎదురయ్యే ఎన్నోసుడిగుండాలు , అందుకే కాంగ్రెస్ పార్టీవారికి విపక్షాలు అవసరం ఉండదు వారి స్వపక్షమే ఒక విపక్షం అని నానుడి ఉంది .
ఎన్నో సుడిగుండాలు చూసిన కాంగ్రెస్ పార్టి చరిత్రలో అతి పెద్ద కుదుపుగా చెప్పుకునేది ఇందిరమ్మ బహిష్కరణ, లాల్ బహదూర్ శాస్త్రి మరణం తరువాత నాయకత్వ పగ్గాలు అందుకున్న ఇందిర మొదట “మౌం కీ గుడియా” (మైనపు బొమ్మ) గా పేరు తెచ్చుకుని చివరికి “గరీభీ హటావో” అని గర్జించే దాకా సాగిన ప్రయాణంలో ఆమే ఎన్నో సవాల్లు ఏదుర్కున్నారు. చివరికి సొంత పార్టి నుండే 1969 నవంబరులో బహిష్కరణకు గురయ్యారు.
1966 జనవరిలో ప్రధాన మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణంతో గుల్జారీలాల్ నంద గారిని తాత్కాలిక ప్రధానమంత్రిగా చేసి 13 రోజులకి పార్టీ నాయకత్వాన్ని ఎన్నుకునే సమయంలో ఇందిరా గాంధి గారికి మొరార్జి దేశాయి రూపంలో పోటీ ఏదురైంది. భారత దేశం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అనుభవం లేని ఇందిరాకి పగ్గాలు అప్పచెప్పటం క్షేమం కాదు, రహస్య ఒటింగ్ జరిగితే ఎవరికి మద్దతు ఉన్నదో తేలిపొతుంది అని మొరార్జి అనటంతో ఎన్నిక అనివార్యం అయింది. నెహ్రూ హయాం తరువాత సిండికేట్ గా పేరు గాంచిన కామ్రాజ్ నాడర్ లాంటి కొంతమంది వ్యక్తుల సహాయంతో ఇందిరా గాంధి విజయం సాధించారు. 1966 జనవరి 19న జరిగిన ఆ ఎన్నికలో మొరార్జీకి 169 ఓట్లు , ఇందిరా గాంధికి 355 వచ్చాయి, ఇందిరా మొరార్జి మీద 186 ఓట్ల తేడాతో గెలిచి ప్రధానమంత్రి అయ్యారు.
ఈ సిండికేట్ పేరుతో కాంగ్రెస్ లో కొంతమంది కుర్చీలో ఎవరు కూర్చున్నా, వారు ఆ కుర్చీని నడిపేవారిగా తయారయ్యారు, అలాగే వారు ఇందిరా గాంధికి మద్దతు పలికింది కూడా ఇందిరా ని కుర్చీలో కూర్చోపెట్టి వారు వెనక శక్తిగా నడుచుకోవటానికి. ఈ సిండికేట్ లొ ముఖ్యులు కామ్రాజ్ నాడర్ , నిజలింగప్ప , నీలం సంజీవ్ రెడ్డి తదితరులు. ఇలా గెలిచిన ఇందిరా గాంధి మొదటి నెలలొ ఆ సిండికేట్ వ్యక్తులు ఎలా నడిపితే అలా నడిచేవారు, ఆకరికి “మౌం కి గుడియా” (మైనపు బొమ్మ) అని పేరు తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టిలో అందరు ఆమెని వచ్చే ఎన్నికల దాక ప్రధాన మంత్రి కుర్చీని భర్తీ చేయడానికి తాత్కాలికంగా ఎన్నుకున్నారు అని అనుకోవడం మొదలు పెట్టారు – కానీ వాళ్ళ ఆలోచనలు , అభిప్రాయాలను ఇందిరా గాంధి తన స్వీయ ఆలోచనా శక్తితో తునాతునకలు చేసారు, ఇది భరించలేని సిండికేట్ గ్రూప్ ఇందిరా గాంధి అభిప్రాయాలకి అడ్డుపడటం మొదలు పెట్టారు. ఇలా జరుగుతున్న సమయంలో రాష్ట్రపతి గా ఉన్న జాకీర్ హుస్సేన్ మరణంతో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల సమయంలో వచ్చిన విభేధాలతో సిండికేట్ గ్రూపుకి పూర్తిగా వ్యతిరేకిగా మారి ఇందిరా ఒక “ఇండికేట్” గ్రూప్ ని తయారుచేసుకున్నారు. దీంతో విభేదాలు ఉన్న మొరార్జి దేశాయి దగ్గర ఉన్న ఆర్ధిక శాఖ మంత్రిత్వాన్ని ఇందిరా తీసుకుని బ్యాంకులని జాతీయం చేశారు. దీంతో మొరార్జి దేశాయి రాజీనామా చేశారు. ఇలా ఒకదానిమీద ఒకటి విభేదాలు తీవ్రతరం అయ్యి, 1969 నవంబర్ 12న సిండికేట్ వ్యక్తుల ప్రోద్భలంతో కాంగ్రెస్ పార్టీ నుండి క్రమశిక్షణ ఉల్లంఘన కారణాలు చూపి నిజలింగప్ప ప్రధాని గా ఉన్న ఇందిరాను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించారు.
ఇందిరాను కాంగ్రెస్ నుండి బహిష్కరిస్తూ చూపిన 3 కారణాలు
1) పోటీ కార్యవర్గం , పోటీ ఏ.ఐ.సి.సి ల ఏర్పాటుని ఎక్కువగా ప్రొత్సహించడం
2) కార్యవర్గ అధికారాన్ని గుర్తించటానికి ఇందిరా నిరాకరించడం
3) పార్టీని అదేపనిగా చులకన చేయడం
ఇందిరా బహిష్కరణం తరువాత నిట్టనిలువున చీలిన కాంగ్రెస్ రెండు గ్రూపులు అయింది. సిండికేట్ గ్రూపు మొరార్జి దేశాయి, కామ్రాజ్ ఆధ్వర్యంలో తమదే నిజమైన కాంగ్రెస్ అని, ఆ కాంగ్రెస్ ని, కాంగ్రెస్ ఒ (కాంగ్రెస్ ఆర్గనైజేషన్) గా పిలుచుకున్నారు, బహిష్కరింప బడిన ఇందిరా తమ వర్గంతో, కాంగ్రెస్ ఆర్ (కాంగ్రెస్ రెక్వజెషన్) గా పిలుచుకున్నారు. 1971 ఎన్నికలలో(కాంగ్రెస్ ఒ) తమ పాత కాంగ్రెస్ ఎన్నికల గుర్తు అయిన జోడు ఎడ్ల గుర్తుతో రాగా, కాంగ్రెస్ ఆర్ కి ఎన్నికల సంఘం “ఆవు దూడ” గుర్తు ఇచ్చింది.
“ఆవు దూడ” ఎన్నికల గుర్తుతో ఏ పొత్తులు లేకుండా 1971లో ఎన్నికలకి వెళ్ళగా , కాంగ్రెస్ ఒ మాత్రం భారతీయ జనసంఘ్ , స్వతంత్ర పార్టీ, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది , ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒ చిత్తుగా ఓడిపోయి కెవలం 518 సీట్లకి 16 సీట్లు మాత్రమే గెలుచుకుంటే , ఇందిరా గాంధి “కాంగ్రెస్ ఆర్” పార్టీ మాత్రం గరీభి హటావొ ( పేదరిక నిర్మూలన ) నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి వారి మనస్సు గెలుచుకుని 352 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ గెలుపుతో ఎన్నికల సంఘం ఇందిరా గాంధి గారి కాంగ్రెస్ పార్టీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా గుర్తించింది. కొత్త కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా బాబు జగజ్జీవన్ రాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబం పట్టుకుని వేలాడుతుంది అని అంటూ ఉంటారు కానీ, నిజానికి కాంగ్రెస్ పార్టీయే గాంధి కుటుంబాన్ని పట్టుకుని వేలాడింది అని తెలియచెప్పే ఉదంతాల్లో ఇది ఒకటి గా చెప్పవచ్చు.