ఈ సృష్టిలో అంతుచిక్కని అవయవం మెదడు… అది చేసే చిత్రాలు అన్నీ ఇన్నీ కావు.. చూసిన, విన్న ,తెలుసుకున్న విషయాలన్నీ మెదడు జ్ఞాపకాల రూపంలో భద్రపరుస్తుంది.. వాటిలో కొన్ని జ్ఞాపకాలు మెదడుపై బలమైన ముద్ర వేసి చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. కానీ కొన్ని మాత్రం subconscious memory లో నిలిచిపోతాయి.
మెదడు అసలు ఉనికిలో లేని మనసు అనే దాన్ని సృష్టించుకుని మనోభావాలను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇన్ని చిత్రాలు చేసే మెదడు నిద్రపోయే సమయంలో కూడా పనిచేస్తూ ఉంటుంది. మనకు కలల రూపంలో ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కలలకు ఆరంభం ఎక్కడ అనేది ఏ ఒక్కరికీ తెలియదు. ఈ కలలను ప్రధానాంశంగా చేసుకుని హాలీవుడ్ లో అనేక చిత్రాలు రూపొందాయి. వాటిలో inception కి ఒక ప్రత్యేక స్థానం ఉంది.
Inception అనే మాటకు తెలుగు అర్ధం.. ప్రారంభం లేదా మూలం.. అదే బయాలజీ ప్రకారం చూస్తే చొప్పించడం లేదా ప్రవేశ పెట్టడం అని అర్థం వస్తుంది..ఒక చిన్న విత్తనంలాంటి ఐడియాని మనిషి మెడదులోకి నాటడమే ఈ inception మూవీ కథాంశం..
Inception లో ప్రధాన పాత్ర కాబ్.. అతనికి ఒక టీం కూడా ఉంటుంది. వీళ్లంతా కలిసి వివిధ వ్యక్తులను ఒక మెషిన్ లాంటి పరికరంతో కలల ప్రపంచంలోకి తీసుకువెళ్లి వారి subconscious memory లో నిక్షిప్తమైయున్న ఐడియాలను, ఆలోచనలను దొంగిలిస్తుంటారు..అలా ఆలోచనలు దొంగిలించే క్రమంలో “సైటో” అని గొప్ప పారిశ్రామికవేత్తకు దొరికిపోతారు. సైటో కి కాబ్ ఐడియాల దొంగతనం గురించి ముందే తెలిసినప్పుడు తన కలల్లోకి కాబ్ టీంని రానివ్వడానికి కారణం కాబ్ కి ఉన్న శక్తి సామర్ధ్యాల గురించి తెలుసుకోవడమే.. ఐడియాలను దొంగిలించడం మాత్రమే కాదు, కొత్త ఐడియాను మనిషి మెడదులోకి ప్రవేశపెట్టగలవా అని సైటో, కాబ్ ని అడుగుతాడు. దానికి కాబ్ అంగీకరించడు. నువ్ కనుక ఆ పనిని పూర్తి చేస్తే నీ కుటుంబంతో సంతోషంగా ఉండే ఏర్పాట్లు చేస్తానని సైటో మాట ఇస్తాడు.
కాబ్ పై తన భార్యను చంపిన హత్యానేరం కేసులో పోలీసులకు పట్టుబడకుండా ఉండటానికి స్వదేశం నుండి పారిపోయి బ్రతుకుతుంటాడు. సైటో మాట ఇవ్వడంతో తన కుటుంబానికి దగ్గర కావడానికి సైటో చెప్పిన పని చేయడానికి కాబ్ ఒప్పుకుంటాడు. ఈ క్రమంలో సైటోకి ప్రత్యర్థి కంపెనీ అయిన ఫిషర్ కంపెనీని కూల్చడానికి కాబ్ టీంకి ఎదురైన సమస్యలు ఏంటి?..కాబ్ సృష్టించిన కలల ప్రపంచంలో సమస్యలు తీసుకురావాలని కాబ్ భార్య మాల్ ఎందుకు ప్రయత్నిస్తుంది? కాబ్ తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడ లేదా అనేది inception సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
“క్రిస్టోఫర్ నోలాన్ ” సినిమాలు మొదటినుండి ప్రేక్షకుల మెదడుకి ఒక పజిల్ లాంటి అనుభూతిని కలిగిస్తాయి. అతని సినిమాల్లో “మెమెంటో” తర్వాత అత్యంత సంక్లిష్టమైన స్క్రీన్ ప్లే ఇందులోనే ఉందేమో అనిపించే గందరగోళాన్ని కలిగిస్తుంది Inception. నిజానికి inception లో కనిపించే ప్రతి సీన్ వెనుక దర్శకుడి కష్టం కనిపిస్తుంది. ముఖ్యంగా జరుగుతుంది కలా నిజమా అన్న సందిగ్దాన్ని ప్రేక్షకుడికి కలిగించి విజయం సాధించాడు దర్శకుడు. కలలు కనడానికి పరిధులు లేవు. కానీ ఒక కలలో మరొక కల కనడం అందులో నుండి మరొక కల కనడం అంతా విజయవంతం అయిందనుకునేలోపే మరొక సమస్య సృష్టించడం లాంటి సీన్లు దర్శకుడి తెలివికి నిదర్శనం..
కలల ప్రపంచం సృష్టించడానికి ఒక మెషిన్,నిద్ర పుచ్చడానికి మత్తు మందు, కలల లోకాన్ని డిజైన్ చేయడానికి ఒక ఆర్కిటెక్ట్, వివిధ మనుషుల రూపాల్లో మారిపోయే ఫోర్జరీ చేసే వ్యక్తి, వాళ్ళు ఉన్నది కలలోనా, లేక నిజ ప్రపంచంలోనా అని తెలియజెప్పే “టోటెమ్”, కలనుండి మేల్కొలపడానికి ఒక కిక్ అవసరం అవుతాయి. ఒకవేళ మత్తులో ఉన్నప్పుడు కలల ప్రపంచంలో చనిపోతే లింబో అనే అనంతమైన కలల లోకంలో చిక్కుకుంటారు. ఒకవేళ లింబోలో చిక్కుకుంటే కలల ప్రపంచమే నిజ ప్రపంచంగా ఊహించుకుంటారు. అందుకే లింబోలో చిక్కుకోకుండా తన టీం ని కాపాడాల్సిన బాధ్యత కాబ్ పై ఉంటుంది. కాబ్ తన టీం తో కలిసి ఫిషర్ కంపెనీని నాశనం చేసే ఐడియాను నాటడానికి ఫిషర్ ని కలల ప్రపంచానికి తీసుకువెళ్తారు. కానీ ఫిషర్ అంతకు ముందే తన ఐడియాలను దొంగిలించకుండా ముందే ట్రైనింగ్ తీసుకుంటాడు. దీంతో కలలో అనుకోని అవాంతరాలు ఎదురై కాబ్ కి పని ఇచ్చిన సైటో తీవ్రంగా గాయపడతాడు. దీంతో సైటోని రక్షించడానికి మరొక కల అవసరం అవుతుంది. ఫిషర్ subconscious మెమరీ లో మరింత లోతుగా వెళ్ళడానికి మరొక కలలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఒకేసారి మూడు కలలు inception సినిమాలో నడుస్తూ ఉంటాయి.
దర్శకుడు తెలివిగా మూడు కలలను వేరు వేరు లెవెల్స్ గా గుర్తు పట్టడానికి మొదటి లెవెల్ ని వర్షంలో రెండో లెవెల్ ను హోటల్ లో మూడవ లెవెల్ ను మంచు కొండల్లో డిజైన్ చేసారు. ఈ మూడు లెవెల్స్ ఒకేసారి జరుగుతుండడంతో ప్రేక్షకుడు గందరగోళానికి గురికావడం జరుగుతుంది. మొదటి లెవెల్ లో కార్ బ్రిడ్జి పై నుండి కింద పడుతున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తిని కోల్పోవడం వల్ల ఆ ఎఫెక్ట్ రెండో లెవెల్ పై పడి హోటల్ లో ఉన్న వ్యక్తులు గాల్లోకి తేలేలా చేయడం దర్శకుడి ప్రతిభకి నిదర్శనం. నిద్రిస్తున్నప్పుడు మనిషిపై పడే వాతావరణ ప్రభావం కలల్లో కూడా ప్రతిబింబించేలా చేయడం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. చివరికి మూడో లెవెల్ లో కాబ్ భార్య మాల్, ఫిషర్ ని చంపడంతో ఆ లెవెల్ కూడా ఫెయిల్ అవుతుంది. దీంతో కాబ్ subconscious memory లో బంధిపబడి ఉన్న మాల్ ని కనుగొని ఫిషర్ ని బయటకు తీసుకురావడం, మాల్ చనిపోవడానికి కారణం కాబ్ ప్రవేశపెట్టిన చిన్న ఐడియా అని తెలయడం, అప్పటికే లింబోలో చిక్కుకున్న సైటోను కాబ్ వెనక్కి తీసుకురావడం లాంటి సీన్లతో ఉత్కంఠభరింతగా సినిమా సాగుతుంది.
సైటో ఇచ్చిన మాట ప్రకారం కాబ్ తన కుటుంబాన్ని కలుసుకోవడంతో సినిమా పూర్తవుతుంది. కానీ కాబ్ ఇంట్లో కలల లోకంలోనే ఉన్నట్లు గుర్తు చేసే టోటెమ్ తిరుగుతూ ఉండటం వల్ల ఇది కలా నిజమా అనే డైలెమా ప్రేక్షకుడికి కలుగజేసి సినిమాను ముగిస్తాడు దర్శకుడు. దర్శకులకు పాఠాలు నేర్పించే విధంగా inception స్క్రీన్ ప్లే సాగుతుంది. ప్రేక్షకుడు ఒక్కసారి చూసి inception ను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. inception ఖాతాలో ఆస్కార్ అవార్డులతో పాటుగా బ్రాడ్బరీ అవార్డ్స్, బ్రిటిష్ ఫిలిం అకాడమీ అవార్డ్, హ్యూగో అవార్డులు ఒదిగిపోయాయి. ముఖ్యంగా inception లో కనిపించే విసువల్ ఎఫెక్ట్స్ కి మంచిపేరు లభించింది. మీరు కూడా కలల ప్రపంచంలో విహరించాలని అనుకుంటే inception చుడండి. మళ్ళీ మళ్ళీ ఆ కలల ప్రపంచంలో విహరించాలని మీకే అనిపిస్తుంది.