iDreamPost
android-app
ios-app

హెలన్ ఆఫ్ ట్రాయ్ ఎంజీఆర్

  • Published Dec 24, 2020 | 4:37 PM Updated Updated Dec 24, 2020 | 4:37 PM
హెలన్ ఆఫ్ ట్రాయ్ ఎంజీఆర్

పుట్టుకతో తమిళుడు కాకపోయినా తమిళ సినీ రంగాన్ని, తమిళ రాజకీయాలను శాసించి తన నటనతో తిరుగులేని స్టార్ గా, సంక్షేమంతో ఎదురు లేని ప్రజా నాయకుడిగా తమిళ ప్రజల గుండెల్లో పురచ్చి తలైవర్ గా నిలిచిపోయిన వ్యక్తి ఎం.జీ.ఆర్ (మరుదూరు గోపాల రామచంద్రన్) 33వ వర్దంతి నేడు . రామచంద్రన్ శ్రీలంకలోని కాండీలో 1917 జనవరి 17వ తేదీన జన్మించారు. స్వతహాగా కేరళీయులు అయిన ఎంజీఆర్ పూర్వీకులు జీవనోపాది కోసం శ్రీలంకలో స్థిరపడ్డారు. కాండీలో మెజిస్ట్రేట్ గా పని చేసిన తండ్రి గోపాల మీనన్ ఎంజీఆర్ చిన్న వయస్సుల్లోనే చనిపోవడంతో శ్రీలంకలో ఉపాది లేక తల్లి సర్యాంబ ఎంజీఆర్ ను , తన అన్న చక్రపాణిని వెంటపెట్టుకుని భారత దేశానికి తిరిగివచ్చి తమిళనాడులోని కుంభకోణంలో స్థిరపడ్డారు. పేదరికం కారణంగా 7ఏళ్ళ వయస్సులోనే మూడవ తరగతి చదువుతున్న రామచంద్రన్ చదువుకు స్వస్థి చెప్పి మదురైలోని ఒరిజినల్ బాయిస్ డ్రామా కంపెనీలో చేరి నటన నేర్చుకుని ఊరూరు తిరుగుతు ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇదే సమయంలో ప్రదర్శనల కోసం బర్మా లాంటి దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చారు.

సినీ జీవితం

1936లో సతీ లీలావతి చిత్రంలో ఒక చిన్న పాత్ర ద్వార సినీ రంగ ప్రవేశం చేసిన రాంచంద్రన్ 10ఏళ్ళ పాటు చిన్న పాత్రలే చేస్తూ వచ్చారు. 1947లో రాజ కుమారి చిత్రంలో కధానాయుడి పాత్ర లభించడమే కాక ఆ చిత్రం ప్రజల మన్ననలను పొందడంతో నాటి నుండి తమిళ చిత్ర రంగంలో ఎదుగుతూ తిరుగులేని స్టార్ గా మారి షుమారు 136 చిత్రాల్లో నటించారు.

రాజకీయ రంగ ప్రవేశం

ద్రవిడ కళగం పార్టీని స్థాపించిన ఈవీ రామస్వామి ఆయన 60 ఏళ్ళ వయస్సులో పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా మణియమ్మను వివాహం చేసుకున్నారనే నెపంతో అప్పటివరకు ఆ పార్టీలో ముఖ్య పాత్రదారులుగా ఉన్న అణ్ణాదొరై, కరుణానిధి మరికొంత మంది పార్టీని విడిచిపెట్టి అణ్ణాదొరై సారధ్యంలో ద్రావిడ మున్నేట్ర కళగం(డి.ఎం.కె) అనే పేరు మీద కొత్త పార్టీని స్థాపించారు. మొదట కాంగ్రెస్ కు మద్దతు దారుడిగా ఉన్న రామచంద్రన్ , కరుణా నిధి సహాయంతో, అణ్ణాదురై పిలుపుమేరకు 1952లో ఆ పార్టీలో చేరి డిఏంకే కు ఆర్ధిక సహాయం చేస్తు వచ్చారు. అలాగే తమిళ నాడులో ప్రముఖ నటుడుగా ఉన్న శివాజీ గణేషన్ 1954లో డిఎంకే నుండి వెళ్ళిపోయిన తరువాత ఆ పార్టీకి సినిమాల ద్వార ప్రచారం కల్పించే భాద్యత రామచంద్రన్ నిర్వహించారు. 1958లో రామచంద్రన్ కధానాయకుడిగా విడుదలైన నాదోడి మానన్ చిత్రంలో సూచించిన సంక్షేమ పధకాలు లక్ష్యాలే అన్నాడిఎంకే కు లక్ష్యాలుగా మారాయని ఆయన అభిమానులు అంటూ ఉంటారు.

1963లో తొలిసారిగా శాసన మండలికి ఎన్నికైన రామచంద్రన్ రెండేళ్ళ తరువాత రాజీనామా చేశారు. కాని పార్టీ కోసం ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొనడం, ఎన్నికలకు నిధులు సమకూర్చడం లాంటి పనులు చూసుకునేవారు. 1967 జనవరి 12న తన సహ నటుడు ఎం.ఆర్ రాధా రివాల్వర్ తో ఎంజీఆర్ పై కాల్పులు జరపగా ఆయన చెవి , మెడ భాగం లో తీవ్రంగా గాయపడ్డారు . అయితే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతునే 1967లో తొలి సారి శాసన సభకు ఎన్నికయ్యారు. 1969 ఫిబ్రవరిలో అన్నాదురై మరణించిన తరువాత ముఖ్యమంత్రి పదవి కోసం కరుణానిధి , నెండుజళియన్ పోటీ పడగా రామ చంద్రన్ కరుణానిధిని బలపరిచి కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యేందుకు కృషి చేశారు. అదే సమయంలో ఎంజీఆర్ పార్టీలో కోశాధికారిగా నియమితులయ్యారు.

1971లో మద్యంతర ఎన్నికల్లో మళ్ళీ డిఎంకే పార్టీ అధికారంలోకి రాగా రామచంద్రన్ కు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన మద్దతు దారులు కోరగా దానికి కరుణానిధి ఎంజీఆర్ కు మంత్రిపదవి కావాలి అంటే సినిమాలు మానుకుని రావాలని సూచించడంతో నాటి నుండి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఆర్ధికపరంగా పార్టీని పోషించే ఎంజీఅర్ కోశాధికారి హోదాలో పార్టీకి సంభంధించిన ఆర్ధికపరమైన వివరాలు తెలపవలసిందిగా కరుణానిధిని కోరగా ఆయన ఎంజీఆర్ ను పార్టీనుండి బహిష్కరించారు.

అణ్ణాదురై మీద ఉన్న గౌరవంతో అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం అనే పేరు మీద 1972 అక్టోబర్ లో కొత్త పార్టీని స్థాపించారు ఎంజీఅర్ . 1973 మేలో దిండిగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగగా అన్నా డిఎంకే పార్టీ అభ్యర్ధి ఘన విజయం సాధించారు .1975 ఎమర్జన్సీ అమలవుతున్నప్పుడు ముఖ్యమంత్రిగా కరుణానిధి చేస్తున్న అవకతవకల గురించి నాటి రాష్ట్రపతి ఫక్రుద్దిన్ అలీ అహ్మద్ కి వినతిపత్రం సమర్పించారు ఎంజీఆర్ . ఈ పరిణామాల నేపధ్యంలో రాష్ట్రపతి కరుణానిధి ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన విధించారు. 1977లో జరిగిన ఎన్నికల్లో ఎంజీఆర్ కి అఖండమైన మెజారిటి లభించింది . తొలిసారిగా ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్వీకారం చేశారు.1980లో రెండోసారి, 1985లో మూడోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదురులేకుండా గెలిచారు .

1977 నుండి చనిపొయే వరకు ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహించిన రామచంద్రన్ ఎక్కువగా అట్టడుగు వర్గాల అభిమానాన్ని చూరగొన్నారు . బీడి కార్మికులు, రిక్షా కార్మికులు, వ్యవసాయ కూలీల వర్గాలకు తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఎంజీఅర్ చదువుకున్న మేధావి వర్గానికి చెందకపోయినా పట్టుదలతో చిత్ర పరిశ్రమలో రాణించి రాష్ట్ర పతి చేత డాక్టరేట్ బిరుదు పొందే స్థాయికి ఎదిగారు. అణ్ణాదురై ఎంజీఆర్ ను హెలన్ ఆఫ్ ట్రాయ్ గా పిలిచేవారు అంటూ ఉంటారు . దీనికి కారణం ఎంజీఆర్ పార్టీకి ప్రచారం చేస్తే 10 లక్షల ఓట్లు రావడం ఖాయం అని అన్నాదురై అభిప్రాయంగా చెబుతారు.