iDreamPost
android-app
ios-app

ప్ర‌చారం ఫుల్.. పోలింగ్ నిల్ : కార‌ణం ఇదేనా..?

ప్ర‌చారం ఫుల్.. పోలింగ్ నిల్ : కార‌ణం ఇదేనా..?

గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో పోలింగ్ శాతం సాధార‌ణంగా ఎప్పుడూ త‌క్కువ‌గానే ఉంటుంది. పోలింగ్‌ శాతం పెంపుపై తీవ్రంగా కృషి చేసిన అధికారులకు ఈసారీ నిరాశే ఎదురైంది. గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్‌ను గణనీయంగా పెంచాలని గ్రేటర్‌ అధికారులు కసరత్తు చేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారిన తాజా ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారాన్ని చేపట్టాయి. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటు మన హక్కు… తప్పనిసరిగా అందరూ ఓటు వేయండి అంటూ సోషల్‌ మీడియా వేదికగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ పోలింగ్ శాతం పెర‌గ‌లేదు స‌రిక‌దా.. భారీగా త‌గ్గింది. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు 38.7 శాతం న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. ఆ స‌మ‌యానికి క్యూలో ఉన్నవారిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నా పెద్ద‌గా పెరిగే అవ‌కాశాలు లేవు. క‌రోనా, లాక్ డౌన్ ప్ర‌భావం పోలింగ్ పై ప‌డిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇప్ప‌టికీ ఊళ్లోలోనే కుటుంబాలు..

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రారంభ‌మైన లాక్ డౌన్ తో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్న‌మ‌య్యాయి. వేలాది కుటుంబాలు న‌గ‌రాన్ని వ‌దిలి సొంతూళ్ల‌కు త‌ర‌లిపోయాయి. అలా వెళ్లిన కుటుంబాల్లో చాలా మంది వెన‌క‌కు వ‌చ్చినా ఇప్ప‌టికీ కొంత మంది ఊళ్ల‌లోనే ఉండిపోయారు. కొంత మంది అయితే ఇక ప‌ట్ట‌ణానికి సెల‌వు పెట్టి ప‌ల్లెకే సొంతం అవ్వాల‌నే నిర్ణ‌యానికి కూడా వ‌చ్చారు. లాక్ డౌన్ స‌డ‌లింపులు అనంత‌రం సాధార‌ణ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నా.. పూర్తి స్థాయిలో మెరుగుప‌డ‌లేద‌నేది ఈ ఎన్నిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఊళ్ల‌లో ఉండిపోయిన వారిలో చాలా మంది ఓట్లు న‌గ‌రంలోనే ఉన్నాయి. దీంతో వారి ఓట్ల‌న్నీ ఆగిపోయాయి. దీనికి తోడు ఇప్ప‌టికీ కొన్ని కంపెనీల సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం కొన‌సాగిస్తున్నారు. వారంద‌రూ సొంతూళ్ల‌లోని ఇళ్ల‌ల్లో ఉండే త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నారు. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ప్ర‌భావం కూడా పోలింగ్ శాతం పై ప్ర‌భావం చూపిన‌ట్లు క‌నిపిస్తోంది.

వారికి హ్య‌ట్సాప్

వ‌య‌సు మ‌ళ్లినా.. ఓపిక లేక‌పోయినా కొంత మంది వృద్ధులు, దివ్యాంగులు త‌మ హ‌క్కు వినియోగించుకున్నారు. హ‌య‌త్ న‌గ‌ర్ పోలింగ్ స్టేష‌న్ ప‌రిధిలో 100 ఏళ్ల వృద్ధురాలు పాప‌మ్మ ఓటు వేసేందుకు వ‌చ్చింది. అనారోగ్యంతో మంచానికే ప‌రిమిత‌మైనా కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో పోలింగ్ కేంద్రానికి వ‌చ్చింది. ఓటు వేస దాని ఆవ‌శ్య‌క‌త‌ను తెలిపింది. రాంగోపాల్ పేట్ లో మ‌రో వందేళ్ల బామ్మ చంపాపేట‌లో 82 ఏళ్ల దివ్యాంగుడు, వెస్లీ కాలేజీలో వీల్ చైర్ పే వ‌చ్చి 78 ఏళ్ల వృద్ధుడు.. ఇలా కొంత మంది అనారోగ్యంగా ఉన్నా ఓటు వేసేందుకు ముందుకు వ‌చ్చారు. అవ‌కాశం ఉన్నా ఓటు వేయ‌డానికి ముందుకు రాని ఎంతో మందికి క‌నువిప్పు క‌లిగించారు.

గత ఎన్నికల్లో ఇలా…

గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం 74,24,096 ఓట్లకు 33,62,688 (45.29 శాతం) ఓట్లు పోలయ్యాయి. అందులో నోటాకు పోలైన ఓట్లు పోగా అభ్యర్థులు, స్వతంత్రులకు కలిపి 33,49,379 ఓట్లు లభించాయి. పోలైన ఓట్లలో టీఆర్‌ఎస్‌ అత్యధికంగా 14,68,618 (43.85 శాతం) ఓట్లను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఎంఐఎం 5,30,812 (15.85 శాతం) ఓట్లను దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. టీడీపీ 4,39,047 (13.11 శాతం), కాంగ్రెస్‌ 3,48,388 (10.40 శాతం), బీజేపీ 3,46,253(10.34 శాతం) ఓట్లను సాధించాయి. ఇటు సీపీఐ 12,748 ఓట్లు, సీపీఎం 8,538, బీఎస్పీ 10,478, లోక్‌సత్తా 10,385, ఇతర రిజిస్టర్డ్‌ పార్టీలు 28,765, స్వతంత్ర అభ్యర్థులు 1,46,481 ఓట్లను దక్కించుకోగలిగారు.