ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. న్యాయవ్యవస్థలో నలుగురు సుప్రీంకోర్ట్ జడ్జీలు బయటకు వచ్చి మీడియా సమావేశం తర్వాత ఇదే పెద్ద సంచలనం అని అంతా భావిస్తున్నారు. అయితే అప్పట్లో అది కొద్ది రోజుల వ్యవధిలోనే సమసిపోయింది. కానీ సుప్రీంకోర్ట్ జడ్జితో పాటుగా ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తుల వ్యవహారాలపై సీఎం జగన్ చేసిన ఆరోపణలకు ముగింపు ఎలా అన్నది ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. దాంతో న్యాయవ్యవస్థ ఎలా స్పందిస్తుందోననే చర్చ సాగుతోంది.
ఈ క్రమంలోనే జగన్ చేసిన ఆరోఫణలు ప్రస్తావించడానికి సిద్ధంగా లేని ఓ వర్గం మీడియాలో మాత్రం రోజూ ఆయన గీత దాటారనే రీతిలో వార్తలు వల్లిస్తున్నారు. ప్రత్యేక ఇంటర్వ్యూలంటూ హోరెత్తిస్తున్నారు. ఈనాడు, ఆంద్రజ్యోతి సహా ఓ వర్గపు మీడియాలో వస్తున్న వార్తల సారాంశం ప్రకారం గీత దాటడం అంటే ముఖ్యమంత్రి లేఖను మీడియాకు వెల్లడించడమే. దానికి ముందే అసలు ఆ లేఖలో ఆయన ఏం చెప్పారు..ఏ ఆధారాలతో ఆరోపించారన్నది మాత్రం సదరు మీడియాకు పట్టని అంశమయ్యింది. రోజూ గీత దాటేశారనే రాతలతో మాత్రం స్వయం తృప్తి పొందుతున్నట్టు స్పష్టమవుతోంది.
ముఖ్యమంత్రి జగన్ లేఖ సూటిగా ఉంది. జస్టిస్ ఎన్ వీ రమణ మీద తీవ్ర ఆరోపణలున్నాయి. దానికి ఆధారాలు కూడా సమర్పించారు. తొలుత తన కుమార్తెలను డిపెండెంట్స్ గా చూపించిన రమణ, ఆ తర్వాత ఎలా మార్చారనే అంశాన్ని జగన్ ప్రస్తావించారు. ఆ సమయంలోనే దమ్మాలపాటితో కలిసి ఏపీ రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసిన భూముల రికార్డులను సమర్పించారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దడం రాజ్యాంగం ప్రకారం అవసరమని పేర్కొన్నారు. దానికోసం చేస్తున్న ప్రయత్నాలను ఏపీ హైకోర్టులో కొందరు అడ్డుకుంటున్నారని విమర్శించారు. అందుకు కారణం జస్టిస్ రమణ ఒత్తిడితో రోస్టర్ విధానం ప్రభావితం కావడమేనని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సంక్షోభం సృష్టించే యత్నం సాగుతోందంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. వాటికి అనుబంధంగా పలు ఆధారాలు, రికార్డులు, తీర్పు పత్రాలను సీఎం నేరుగా సీజేకి అందించారు.
ఈ ఆరోపణలకు సంబంధించి విచారణ చేయకుండా వాస్తవమా కాదా అన్నది తేలే అవకాశం లేదు. కనీసం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారయినా తమపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని కోరితే వారి చిత్తశుద్ధికి నిదర్శనం అవుతుంది. లేదా సీజే చొరవతో విచారణ ప్రారంభమయితే ఫలితం వస్తుంది. ఈ రెండింటిలో ఏం జరిగినా వాస్తవాలు అందరికీ వెల్లడవుతాయి. న్యాయవ్యవస్థ ప్రతిష్ట పెరగడానికి దోహదపడుతుంది. తద్విరుద్ధంగా పత్రికల్లో గీత దాటారనే రోత రాతల వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. పైగా న్యాయవ్యవస్థ చుట్టూ సాగుతున్న చర్చలతో మరింత అప్రతిష్ట మూటగట్టుకుంటుంది. అందుకే తక్షణం సుప్రీంకోర్ట్ రిటైర్డ్ న్యాయమూర్తుల బృందంతో విచారణ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అసలు వాస్తవాలు వెలికితీయాలని కోరుతున్నారు. దానిని ప్రస్తావించకుండా చంద్రబాబు కనుసన్నల్లోని ఓ సెక్షన్ మీడియా చేస్తున్న ప్రచారం కేవలం ప్రహసనమే తప్ప ఎవరికీ ప్రయోజనం చేకూర్చే అవకాశం లేదు.
జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎక్కడా ఈ విషయాలను బహిర్గతం చేయలేదు. తిరిగి అమరావతి వచ్చిన తర్వాత కూడా మీడియా ముందుకు రాలేదు. కేవలం వివిధ పత్రికల్లో సీఎం పర్యటన చుట్టూ అభూతకల్పనలు, అసత్యాలు వస్తున్న తరుణంలో వాటికి ముగింపు పలకడం కోసమే తాము మీడియాకు క్లారిటీ ఇస్తున్నామని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం స్పష్టంగా చెప్పారు. తొలుత అలాంటి నిరాధార రాతలు రాసి, సీఎం పర్యటన సారాంశం వెల్లడించాలని టీడీపీ కూడా డిమాండ్ చేసిన తర్వాత ఏం జరిగిందో అందరికీ చెప్పడం నేరమని మళ్లీ వాపోవడం టీడీపీకి, వారి అనుబంధ, అనుచరగణానికే చెల్లింది. ఢిల్లీలో సీఎం ఏం చేశారో చెప్పాలని అన్నారు. తీరా చెప్పిన తర్వాత అలా చెప్పడం గీత దాటడం అంటున్నారు. ఇంతకీ టీడీపీ భజన బృందాలకు వాస్తవం పట్టదని, నిజాలంటే తట్టుకోలేరని ఈ వ్యవహారం రూఢీ చేస్తోంది. అదంతా ఎలా ఉన్నప్పటికీ తక్షణం సుప్రీంకోర్ట్ స్పందిస్తే పచ్చ రాతలకు తాత్కాలిక ముగింపు మాత్రం కలుగుతుందని చెప్పవచ్చు. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ ప్రతిష్ట పెంచేందుకు వేగవంతంగా నిర్ణయాలు అవసరంగా కనిపిస్తోంది.