ఫ్రేమ్ లోపల ఏముండాలో కాదు, బయట ఏముండాలో దర్శకుడికి తెలియాలంటారు మార్టిన్ స్కొర్‌సాసి . నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లడం ఆయన ప్రత్యేకత. తర్వాత మనం బయటికి రాలేం. ది డిపార్ట్‌డ్ (2006) కి ఆస్కార్ వచ్చింది. హాలీవుడ్‌ని బాగా ప్రభావితం చేసిన వాళ్లలో స్కొర్‌సాసి ఒకరు.
దర్శకుడికే కాదు , రచయితకీ ఇది వర్తిస్తుంది. ఏమి రాయాలో కాదు, ఏమి రాయకూడదో తెలియాలి. మాటే మంత్రం. మంత్ర శక్తిని వృథా చేయకూడదు. పొట్టుని దంచితే పొట్టే వస్తుంది. బియ్యం రాదు.
స్థూలంగా సినిమా కథలు 3 రకాలు. 1.సాంఘీకాలు 2.జానపదాలు 3.పౌరాణీకాలు. వీటిలో అనేక జానర్లు ఉంటాయి. పౌరాణీకాలు, జానపదాలు తీసే వాళ్లు లేరు. ఒకప్పుడు ప్రేక్షకులు అమాయకులు కాబట్టి సెట్టింగ్‌లు, వైర్ వర్క్ ట్రిక్స్ చూసి ఆనందించేవాళ్లు. దానవీరశూరకర్ణలో తాళ్లు కనపడినా చూసేశారు. ఇపుడైతే సోషల్ మీడియాలో ఏకిపారేస్తారు. బాహుబలిలా తీస్తే తప్ప చూడరు. ఇది అంత ఈజీ కాదు.
సాంఘీకాలు (సోషల్) మాత్రమే టచ్ చేయాలి. దీంట్లో క్రైం, థ్రిల్లర్, కామెడీ, హారర్ కామెడీ , డార్క్ కామెడీ , ఫ్యామిలీ , పొలిటికల్. మనిష్టం వచ్చినన్ని రకాలుగా ఈ కథల్ని చెప్పొచ్చు. ఫస్ట్ కావాల్సింది ఇతివృత్తం (Plot).
తెలుగులో సినిమా పుట్టినప్పటి నుంచి కొన్ని దశాబ్దాలు పౌరాణీకాలు రాజ్యం ఏలాయి. సౌలభ్యం ఏమంటే కథ Already వుంటుంది. సిద్ధంగా ఉన్న పిండితో రొట్టె చేసుకోవడం. బాగా కాలిస్తే రుచిగా వుంటుంది. లేదంటే లేదు. జానపదాలు కూడా ఇంతే. రాజు, రాణి రాజ్యం కోసం కుట్రలు , చివరికి గెలుపు. లేదంటే హీరో ఎక్కడో దూరంగా పెరుగుతాడు. తర్వాత తానెవరో తెలుసుకుని తల్లీతండ్రిని రక్షించుకుంటాడు. ఇదే కథలోకి ఒక మాంత్రికుడు వస్తే భైరవద్వీపం అవుతుంది.
సోషల్ మూవీస్ వచ్చేసరికి ఒక కొత్త కథని సృష్టించాలి. సొసైటీలో జరుగుతున్న విషయాల నుంచి ఒక ముక్కని ఏరుకోవాలి. కరోనా Back dropతో వస్తున్న కథలు కొత్తవి. జీవితాన్ని ఒక వైరస్ శాసించడం అంతకు ముందెప్పుడూ జరగలేదు.
జీవితం ఎంత వైవిధ్యంగా ఉంటుందో , ఇతివృత్తాలు కూడా అంతే. మనుషులంతా చూడ్డానికి ఒకేలా కనిపించినా, ఒకరికొకరికి పోలికలుండవు. మన వేలి ముద్రలు, కనుపాపలు కూడా మనకే సొంతం. ఇంకొకరితో మ్యాచ్ కావు. కథలు కూడా అంతే. ఎవడి కథ వాడిదే. అందరి జీవితాల్లో ఎమోషన్స్, సస్పెన్స్ , కామెడీ అన్నీ ఉంటాయి.
రికార్డు చేయగలిగితే మన చుట్టూ వంద కథలుంటాయి. అన్ని సినిమాలకి పనికొస్తాయా అంటే, పనికొచ్చేలా చేయడమే స్టోరీ టెల్లింగ్.
సాలీడు ఒక గూడు అల్లుతుంది. అంత కళాత్మకంగా అల్లడం దాని ప్రత్యేకత. నాలుగు ఈగలు, దోమలు, పురుగుల కోసం ఆర్ట్‌నంతా వృథా చేస్తుంది. అది వేరే విషయం. అంత ఆర్టిస్టిక్‌గా రచయిత కథ చెప్పాలి. అన్ని లేయర్లతో ప్రేక్షకున్ని బంధించాలి. ఇది చేయాలంటే చదవాలి, చూడాలి. సాధన చేయాలి.
కథలు రెండు రకాలు. కామెడీ, ట్రాజెడీ. డబ్బులొస్తే కామెడీ, రాకపోతే ట్రాజెడీ. దేనికి డబ్బులొస్తాయో గ్యారెంటీగా తెలిసిన వాళ్లు లేరు.
ప్లాట్ ఎంచుకునే ముందు ఆ కథని ఒక సెర్చిలైట్ వేసి విస్తృతంగా చెప్పడమా? టార్చ్‌లైట్ వేసి ఒక భాగాన్ని మాత్రమే చూపించడమా తేల్చుకోవాలి. నాయకుడు సినిమాలో మణిరత్నం వీరనాయుడి జీవితాన్ని మొత్తం చూపిస్తాడు. చిన్నప్పుడు పారిపోయి బొంబాయి వచ్చి డాన్‌గా ఎదుగుతాడు. పెళ్లి చేసుకుంటాడు. పిల్లలు పుడతారు. ప్రత్యర్థుల చేతిలో కొడుకు పోతాడు. కూతురు దూరమవుతుంది, చివరికి ఒక పిచ్చివాడి చేతిలో చనిపోతాడు. గాడ్‌ఫాదర్‌ని , వరదరాజముదలియార్ (బొంబాయ్ డాన్) జీవితాన్ని కలిపి తీసిన సినిమా. కమలహాసన్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్. ఇది Straight నెరేషన్. బాల్యం నుంచి మరణం వరకూ Phases తో ఉంటుంది.
మహానటి కూడా ఇదే. సావిత్రి బాల్యం నుంచి మరణం వరకూ ఉంటుంది. చెప్పిన విధానం వేరు. సావిత్రి కోమాలోకి వెళ్లడంతో స్టార్ట్ అవుతుంది. ఆ వార్తని కవర్ చేయడానికి వెళ్లిన రిపోర్టర్ కథ సమాంతరంగా నడుస్తూ వుంటుంది. సిటిజన్ కేన్ (1941)లో రోజ్‌బడ్ అనే పేరు కోసం వెతికినట్టు , దీంట్లో శంకరయ్య ఎవరు అని కథ నడుస్తూ ఉంటుంది. సావిత్రి బాల్యం, నటిగా ఎదగడం, పెళ్లి ఇవన్నీ వెనుకా ముందుగా వస్తాయి.
ఎప్పుడో ఒకసారి వచ్చే మహానటి లాంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు మినహాయిస్తే అన్నిటిలో హీరో , విలన్ మగవాళ్లే వుంటారు. టీవీ సీరియల్స్‌లో మాత్రమే జెండర్ మారుతుంది.
ప్లాట్‌లో నాయకుడు, నాయిక, ప్రతినాయకుడు సిద్ధమై పోతే మిగిలిన వాళ్లు ఎంత మంది ఉండాలో మళ్లీ చూసుకోవచ్చు. విచిత్రం ఏమంటే పెళ్లితోనే అసలు జీవితం ప్రారంభమవుతుంది. కానీ మెజార్టీ సినిమాలు పెళ్లితో ముగుస్తాయి.
సినిమా పుట్టినప్పటి నుంచి కుటుంబ కథల్ని ఎన్ని రకాలుగా చెప్పారో రేపు చూద్దాం!