iDreamPost
iDreamPost
ఎన్నేళ్ళక్రితం వలస వచ్చారో కానీ విజయవాడ నగరంలో వారు కీలకంగానే ఉంటున్నారు. జనాభా పెద్ద సంఖ్యలో లేకపోయినా ఈ “నగరాలు” కులం వారి ప్రభావం విజయవాడ నగరంపై మూడు, నాలుగు దశాబ్దాల క్రిందటే ఉంది. ఆ తర్వాత కొంత విరామం వచ్చినా ఇప్పుడు మళ్ళీ ఓ మహిళ నగర మేయర్ కావడంతో “నగరాలు” సామాజికవర్గం మరోసారి చర్చనీయం అయింది.
ప్రతిష్టాత్మక విజయవాడ నగర మేయర్ పదవిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నగరాల సామాజిక వర్గానికి కేటాయించడంతో ఆ సామాజిక వర్గం ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో చర్చకు వచ్చింది. నగరాల కులానికి చెందిన రాయన భాగ్యలక్షి మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు. హోరాహోరీగా జరిగిన పోరులో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో మేయర్ పదవి కూడా అధికార పార్టీకే వచ్చింది. జనరల్ మహిళ కోటాలో ఉన్న మేయర్ పదవిని వ్యూహాత్మకంగా జగన్ మోహన్ రెడ్డి నగరాల సామాజికవర్గానికి కట్టబెట్టి కొత్త చర్చకు దారితీశారు.
Also Read:పదవుల సంగతి పక్కనపెట్టండి.. కనీసం ఈ కులాల పేర్లు విన్నారా?
ఉత్తరాంధ్ర జిల్లాల నుండి, ప్రధానంగా విశాఖ, విజయనగరం జిల్లాల నుండి ఎక్కువభాగం, శ్రీకాకుళం జిల్లా నుండి కొద్ది సంఖ్యలో నగరాలు సామాజిక వర్గం ఎప్పుడో విజయవాడ నగరానికి వలస వచ్చారు. మొదట్లో చిన్నా చితకా వ్యాపారాలు, ప్రత్యేకించి తోపుడు బల్లపై పళ్ళు, కూరగాయలు అమ్ముతూ, జీవనం సాగించిన ఈ సామాజిక వర్గం నెమ్మదిగా పెద్ద పెద్ద వ్యాపారాల్లోకి అడుగు పెట్టింది.
ప్రధానంగా రవాణా రంగంలో, ప్రత్యేకించి విజయవాడలో నగరాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సామాజిక వర్గంలోనే పేదలు ముఠా కూలీలుగా జీవనం కొనసాగించారు. ఇప్పటికీ విజయవాడ హోల్ సేల్ మార్కెట్ లో, అలాగే లారీ స్టాండు లో, వన్ టౌన్ లోని పలు దుకాణాల్లో ముఠా కూలీలుగా నగరాలు సామాజిక వర్గం వారే కనిపిస్తారు.
Also Read:ఆయనకు టికెట్ రాలేదు కానీ ప్రయత్నం చేసిన పార్టీలే వరుసగా గెలిచాయి ..
ఈ శ్రామిక వర్గం ప్రతినిధులుగా తమ్మిన పోతరాజు, పోతిన చిన్న, మరుపిళ్ళ చిట్టి వంటి వారు మొదట శ్రామిక వర్గనేతలుగా విజయవాడలో మంచి పట్టు సాధించి ఆ తర్వాత శాసనసభ్యులు అయ్యారు. విజయవాడలో కమ్యూనిస్టు పార్టీలోనూ, అలాగే కాంగ్రెస్ పార్టీ లోనూ వీరు కీలక పాత్ర పోషించారు.
మరుపిళ్ళ చిట్టి పేరున ఇప్పటికి విజయవాడ పాతబస్తీలో నగర కాంగ్రెస్ కార్యాలయం కూడా ఒకటి ఉంది. ఆ కార్యాలయం ఇప్పటికీ నగరాలు సామాజిక వర్గానికి చెందిన నాయకుల ఆధిపత్యంలోనే ఉంది. ఈ కార్యాలయం నుండే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న పైలా సోమినాయుడు ఒకనాడు విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ప్రతిష్టాత్మక దుర్గగుడి చైర్మన్ హోదాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నాయకునిగా కొనసాగుతున్నారు. సోమినాయుడు ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read:గుడ్ మార్నింగ్ చెప్పేందుకు మరికొందరు రెడీ!
అలాగే తమ్మిన పోతరాజు వారసులుగా నగరంలో కమ్యూనిస్టు పార్టీలో పలువురు నగరాలు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇప్పటికి కీలక పాత్ర పోషిస్తునే ఉన్నారు. ఇప్పటికి సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం తమ్మిన పోతరాజు నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీలు నగరంలో ప్రముఖ పాత్ర పోషించాయి. తమ్మిన పోతరాజు సేవలు విజయవాడ పాతబస్తీ ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటారు.
గతంలో కొరగంజి శేఖర్ బాబు నగర సిపిఐ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఒకసారి రాష్ట్ర శాసనసభకు పోటీ చేసి కొద్దిశాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే ఈ సామాజిక వర్గం నుండి అనేకమంది రాజకీయ రంగంతో పాటు రియల్ ఎస్టేట్ వంటి ఇతర రంగాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read:పీవీ కుమార్తెదే గెలుపు