iDreamPost
android-app
ios-app

Tapeswaram Kaja – తాపేశ్వరం కాజా చరిత్ర తెలుసా..?

  • Published Nov 03, 2021 | 9:00 AM Updated Updated Nov 03, 2021 | 9:00 AM
Tapeswaram Kaja – తాపేశ్వరం కాజా చరిత్ర తెలుసా..?

‘తాపేశ్వరం కాజా మా ప్రత్యేకత’ తూర్పుగోదావరి జిల్లాలోని దాదాపు ప్రతి స్వీట్‌స్టాల్‌ దగ్గరా కనిపించే బోర్డులో ఈ ప్రకటన తప్పనిసరి! కాజా లేని ముఖ్యంగా తాపేశ్వరం కాజా లేని స్వీట్‌ స్టాల్‌ అంటే అసలు కొనుగోలుదారులు అటువైపే చూడరు. అందుకే షాపు ముందు తాపేశ్వరం కాజా ‘మా ప్రత్యేకత’ అని బోర్డు పెట్టుకుంటారు. ఇక్కడ తయారుచేసే మడత కాజాలు తాపేశ్వరం పేరును దేశం నలుదిశలా వ్యాపింప చేశాయి.

యూ ట్యూబ్‌లో చూసి ఎవరైనా కాజా తయారు చేయొచ్చు. కానీ తాపేశ్వరం కాజాకు ఉన్న రుచిని మాత్రం తీసుకురాలేరు. పొరలుపొరలుగా, మృదువుగా, ప్రతి పొరలో తేనెలా పాకం చిమ్ముతూ మధురమైన రుచికి చిరునామాగా నిలిచే ఈ కాజాకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు, విదేశాలకూ కూడా వ్యాపించిన దీని రుచి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఈ కాజా తినేందుకు పిల్లల నుంచి పెద్దల వరకూ తహతహలాడతారంటే అతిశయోక్తి కాదు. ఆ అద్భుతమైన రుచివెనుక ఎన్నో ఏళ్ల శ్రమ దాగుంది.

ఇదీ నేపథ్యం..

మడత కాజా సృష్టికర్త పొలిశెట్టి సత్తిరాజు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం బ్రహ్మపురి. సత్తిరాజు చిన్నతనంలో గోదావరికి వరదలు పోటెత్తి లంకల్లోని పొలాలు పూర్తిగా కొట్టుకుపోవడంతో ఉపాధి కోసం తల్లి మంగమ్మ తన ముగ్గురు పిల్లలను తీసుకుని నియోజకవర్గ కేంద్రమైన మండపేట పక్కనే గల తాపేశ్వరం వలస వచ్చేశారు. పెద్ద కుమారులు ఇద్దరిని వ్యవసాయంలోకి పంపి, చివరివాడైన సత్తిరాజును మండపేటలో మిఠాయికొట్టు వ్యాపారం చేస్తున్న రామస్వామి వద్ద పనిలో ఉంచారు. రామస్వామి వద్ద మిఠాయితో పాటు మడత కాజా తయారీ నేర్చుకున్నారు సత్తిరాజు.

కొంతకాలానికి రామస్వామి ఆనారోగ్యానికి గురై వ్యాపారం మానేయ్యడంతో పండుగలు, అమ్మాయిలను అత్తవారిళ్లకు పంపే సమయంలో సారె నిమిత్తం గ్రామంలోనే పెద్ద వాళ్ల ఇళ్లకు వెళ్లి మిఠాయి తయారీ చేసేవారు సత్తిరాజు. పొరలు పొరలుగా తయారుచేసి అందులో పాకం నింపడం ద్వారా మడత కాజాకు సరికొత్త హంగులు అద్దారు సత్తిరాజు. ఆనోటా ఈనోటా సత్తిరాజు తయారుచేసిన మడత కాజా పేరు వ్యాపించడంతో ఆర్డర్లు రావడం పెరిగింది. ఇళ్లకు వెళ్లి చేసే వీలు లేక తన ఇంటి వద్దనే మిఠాయిలు తయారుచేసి ఇచ్చేవారు. 1939లో కాఫీ హోటల్‌ పెట్టి టిఫిన్, మిఠాయిని అమ్మేవారు. ప్రత్యేక తరహాలో సత్తిరాజు తయారుచేసే మడత కాజా మాధుర్యం అందరినీ ఆకర్షించింది. తాపేశ్వరానికి గుర్తింపు తెచ్చింది.

Also Read : Artos Drink – బ్రిటిష్‌ సైనికులు పాపులర్‌ చేసిన ఈస్ట్ గోదావరి కూల్‌డ్రింక్‌ ఆర్టోస్‌

1950 దశకంలో హోటల్‌ను తొలగించి పూర్తిగా మిఠాయి కొట్టుగా అభివృద్ధి చేశారు. తన తరఫు వారిని, తన భార్య తరఫు బంధువులను తన వద్దనే ఉంచుకుని వ్యాపారాభివృద్ధి చేశారు. 1990లో సత్తిరాజు కాలం చేయడంతో షాపు నిర్వహణను ఆయన భార్య భూషణం, కుమారుడు మల్లిబాబు తీసుకున్నారు.

ఒడిదుడుకులను అధిగమించి..

సత్తిరాజు మరణం, భూషణం, మల్లిబాబులకు పెద్దగా అనుభవం లేకపోవడం కాజా తయారీపై ప్రభావం చూపాయి. మునుపటి రుచి లోపించి ఆర్డర్లు రావడం తగ్గింది. 1990 నుంచి తొమ్మిది సంవత్సరాల పాటు వ్యాపారం నిరాశజనకంగా తయారైంది. మడత కాజాలో పూర్వపు మాధుర్యం తీసుకువచ్చేందుకు ఆ తొమ్మిదేళ్ల కాలంలో ఎన్నో ప్రయోగాలు చేశారు మల్లిబాబు. అప్పట్లో ఆంధ్రా పిండి వంటల షాపులు లేకపోవడంతో వ్యాపార విస్తరణలో భాగంగా 1994లో కాకినాడలో బ్రాంచిని ఏర్పాటు చేశారు. మడత కాజా తయారీలో పిండిని గట్టిగా నొక్కి పల్చగా చేయడం కీలకమని గ్రహించి, అందుకు ప్రస్తుతం పనిచేస్తున్న వారి శక్తిచాలడం లేదని తెలుసుకుని పిండిని సిద్ధం చేసేందుకు యంత్ర సామగ్రిని తానే స్వయంగా తయారు చేయించుకున్నారు మల్లిబాబు.

మునుపటి మాదిరిగా మడత కాజాలోని ప్రతీ పొరలోనూ పాకం ఉండేవిధంగా చేసిన ప్రయత్నాలు ఫలించి 2000 సంవత్సరం నుంచి కాజాకు పూర్వవైభవం వచ్చింది. గతంలో కంటే ఆర్డర్లు పెరిగాయి. 2002 సంవత్సరంలో పాత షాపును పూర్తిగా తొలగించి ‘సురుచి ఫుడ్స్‌’ పేరిట విశాలమైన పార్కింగ్, అధునాతన హంగులతో కొత్త భవనాన్ని నిర్మించి తండ్రి పెట్టిన సంస్థను కొనసాగిస్తున్నారు మల్లిబాబు. తండ్రి బాటలో నాణ్యతే ప్రామాణికంగా ఆ కాజాకు ఎల్లలు లేని ఖ్యాతిని తెచ్చిపెట్టారు. అప్పట్లో కేజీ రూ.5 కు అమ్మేవారు. ప్రస్తుతం కేజీ రూ.260కి అమ్ముతున్నారు. నేతి కాజా అయితే కేజీ రూ.360 కి విక్రయిస్తున్నారు.

పుష్కరాలే పబ్లిసిటీ..

మొదట్లో ఇతర జిల్లాల్లోను కాజాకు గుర్తింపు లభించినా పెద్దగా పబ్లిసిటీ లేకపోవడంతో వ్యాపారం స్తబ్దుగా ఉండిపోయింది. 2000 సంవత్సరం నుంచి పర్యాటకం రంగం అభివృద్ధి చెందడం, 2003లో గోదావరి పుష్కరాలు కాజా చరిత్రను తిరగరాశాయి. అప్పటికే తాపేశ్వరం కాజాకు మంచి గుర్తింపు ఉండటం, పుష్కరాల కోసం ట్రాఫిక్‌ను జాతీయ రహదారి మీద నుంచి ద్వారపూడి–యానాం రోడ్డుకు మళ్లించడంతో రాష్ట్రం, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ కాజా కొనుగోళ్లు చేయడంతో తాపేశ్వరం మడత కాజాకు విస్తతంగా ప్రచారం లభించింది. అప్పటి వరకు ఉన్న వ్యాపారం పుష్కరాల తర్వాత ఎన్నో రెట్లు పెరిగింది. తర్వాత వచ్చిన సోషల్‌ మీడియా వ్యాపారాభివృద్ధికి మరింత తోడ్పాటును అందించింది. నాటి నుంచి ఏ రాజకీయ పార్టీ ప్లీనరీ అయినా, కార్పొరేట్‌ కంపెనీల వేడుకలైనా, ప్రముఖుల ఇళ్లల్లో జరిగే వేడుకల్లో తాపేశ్వరం నుంచి కాజాలు రప్పించడం సాధారణం అయిపోయింది.

Also Read : East Godavari Vimal Drink – విమల్ చల్లదనానికి 38 ఏళ్లు

ఎందరికో ఉపాధి అవకాశాలు..

మడత కాజా మాతృసంస్థ సురుచిఫుడ్స్‌తో పాటు గ్రామంలో పది వరకు చిన్న చిన్న స్వీట్‌ షాపులు ఉన్నాయి. కేవలం ఆయా షాపుల్లో తాపేశ్వరంతో పాటు, పక్కనే ఉన్న ఇప్పనపాడు, పాలతోడు పరిసర గ్రామాలకు చెందిన 400 మందికి పైగా పనిచేస్తుండటం గమనార్హం. వీరిలో అధికశాతం మంది మహిళలే ఉంటారు. కాజాల తయారీ నుంచి అమ్మకాల వరకు అన్నింటిలోనూ వీరు పనిచేస్తుంటారు. చేసే పని, సినియారీటిని బట్టి ఒక్కో మహిళ రోజుకు రూ. 300 నుంచి రూ. 600 వరకు ఆర్జిస్తే, పురుషులు రూ.400 నుంచి రూ.800 వరకు సంపాదిస్తుంటారు.

ఆయా షాపుల్లో కాజాలతో పాటు, ఆంధ్రా పిండివంటలు, బెంగాలీ స్వీట్స్‌ తయారు చేస్తుంటారు. బెంగాలీ స్వీట్స్‌ తయారీ కోసం ప్రత్యేకంగా బెంగాల్‌కు చెందిన 25 మంది వరకు కుక్‌లు తాపేశ్వరంలో పనిచేస్తున్నారు. పరోక్షంగా ముడి సరుకులు సరఫరా చేసే వ్యాపారులు, సరుకుల రవాణా, తాపేశ్వరం నుంచి కాజాలను కొనుగోలు చేసి బయటి ప్రాంతాలకు ఎగుమతులు చేసేవారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆన్‌లైన్‌ ఆర్డర్లకు స్వీట్స్‌ను పంపే పార్శిల్‌ సర్వీసుల వారు ఇలా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు.

ప్రముఖుల సందర్శన..

రాజకీయ, సినీ, ప్రముఖులు జిల్లాకు వచ్చినప్పుడు తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్‌ను సందర్శించి తాపేశ్వరం కాజా మాధుర్యాన్ని రుచిచూస్తుంటారు. మంత్రులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధులు, సినీ హీరో చిరంజీవి, దర్శకులు కె.విశ్వనా«ద్, రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు కోటి, సినీ రంగ ప్రముఖులు ఆమని, రామసౌర్య, సునీత మరెందరో సెలబ్రిటీలు సురుచిని సందర్శించారు.

Also Read : Kadiyam Nurseries – గోదారి తీరంపై పచ్చిపూల సంతకం