iDreamPost
iDreamPost
ఒకప్పుడు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అందులోనూ హిందూపురం ప్రాంతం టీడీపీ వ్యవస్థాపకుడైన దివంగత ఎన్టీఆర్ కుటుంబం పట్ల ఇప్పటికీ అచంచల అభిమానం చాటుకుంటున్న ప్రాంతం. కానీ ఎన్టీఆర్ వారసులకు తప్ప ఆ పార్టీకి చెందిన ఇంకెవరినీ అక్కడి ప్రజలు అంగీకరించే స్థితిలో లేరని గత ఎన్నికల్లో బాలకృష్ణ తప్ప మిగతావారి ఓటమి ద్వారా స్పష్టమైంది. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బాలకృష్ణ తప్ప ఇతర టీడీపీ అభ్యర్థిలందరూ ఓడిపోయినా ఇప్పటికీ ఆ పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదు. ఓటమి భారానికి తోడు నేతల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరాటాలు పార్టీని కోలుకోనీయకుండా దెబ్బ తీస్తున్నాయి. హిందూపురం పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షుడు బి.కే.పార్థసారధి, ఆ నియోజకవర్గ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పల మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న విభేదాలతో పార్టీ శ్రేణులు కూడా రెండు వర్గాలుగా విడిపోయాయి. వీటి ప్రభావం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది.
పార్టీకి దూరంగా మాజీ ఎంపీ నిమ్మల
పార్థసారధితో ఉన్న విభేదాల నేపథ్యంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప చాన్నాళ్లుగా పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. 1994, 1999 ఎన్నికల్లో గోరంట్ల ఎమ్మెల్యేగా, 2009, 2014 ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా పనిచేసిన తనను కాదని పార్థసారధిని అధ్యక్షుడిని చేయడం కిష్టప్పను బాధించిందని ఆయన అనుచరులు అంటున్నారు. దాంతో ఇద్దరి మధ్య మాటల్లేకుండా పోయాయి. ఓకే వేదిక పంచుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇటీవల నిమ్మల సొంత మండలమైన గోరంట్లలో టీడీపీ నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొన్నా కనీసం మాటలు కూడా కలపకుండా ఎడమోహం పెడమొహంగా ఉన్నారు. వీరిని కలిపేందుకు కొందరు స్థానిక నేతలు ప్రయత్నించి విఫలమయ్యారు. అలాగే అదే మండలంలో టీడీపీ సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇద్దరినీ ఆహ్వానించారు. అయితే పార్థసారథి వచ్చి వెళ్లిపోయిన తర్వాతే నిమ్మల కిష్టప్ప వెళ్లారు. దాంతో పార్టీ నేతలు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.
చంద్రబాబు బుజ్జగింపులు ఫలించేనా?
గత ఎన్నికల నాటి నుంచీ నిమ్మల కిష్టప్ప పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా లేరు. అడపా దడపా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా మొక్కుబడి తంతుగా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తనకు అనుకూలమైన అభ్యర్థులకు ప్రచారం చేశారు తప్ప.. మిగిలిన పార్టీ అభ్యర్థుల గురించి పట్టించుకోలేదు. ఇవన్నీ తన దృష్టికి రావడంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి నిమ్మలను గురువారం తాడేపల్లికి పిలిపించుకుని బుజ్జగించడానికి ప్రయత్నించారు. సుమారు అరగంట సేపు మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడాలని, భవిష్యత్తులో తగిన గుర్తింపు ఇస్తామని అన్నట్లు తెలిసింది. అయితే కిష్టప్ప ఏమీ స్పందించకుండానే వెళ్లిపోవడం చూస్తే బాబు బుజ్జగింపులు పని చేయలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Also Read : తోట త్రిమూర్తుల స్థానాన్ని భర్తీ చేసిన టీడీపీ .. రామచంద్రాపురంలో ఆసక్తికర పోరు..!