iDreamPost
android-app
ios-app

Antarvedi – సముద్రపు అలజడి… దేనికి సంకేతం?

  • Published Oct 16, 2021 | 6:32 AM Updated Updated Oct 16, 2021 | 6:32 AM
Antarvedi – సముద్రపు అలజడి… దేనికి సంకేతం?

అంతర్వేది వద్ద సముద్రం ఒక్కసారిగా చొచ్చుకు వస్తుంది. తీరంలో కట్టడాలను ముంచెత్తుతుంది. ఒక్కొక్కసారి కిలోమీటర్ల మేర వెనకకు పోతుంది. ఉప్పాడ వద్ద ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కోత ఆగడం లేదు. సముద్రంలో ఏ చిన్న వాతావరణ మార్పులు చోటు చేసుకున్నా అలలు ఎగిసిపడి ఉప్పాడను కోతకు గురి చేస్తుంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు.. తమిళనాడు కన్యాకుమారి నుంచి బంగ్లాదేశ్‌ వరకు బంగాళాఖాతం వెంబడి సముద్రం అల్లకొల్లలంగా మారుతుంది. పలుచోట్ల తీరం పెద్ద ఎత్తున కోత బారిన పడుతుంది.

వీటన్నింటికీ కారణం ఏమిటి? భవిష్యత్‌లో కోత తీవ్రత ఇలా ఉంటే తీరాన్ని ఆనుకుని ఉన్న నగరాలు.. పట్టణాలు.. గ్రామాలు పరిస్థితి ఏమిటి? అనేదానిపై జరుగుతున్న పరిశోధనా ఫలితాల సారం తెలుసుకుంటే భవిష్యత్‌ భయానకంగా కనిపిస్తుంది.

అంతర్వేది… గోదావరిపాయ వశిష్ఠ నది సముద్ర సంగమ ప్రాంతం. ఆది దేవుడు లక్ష్మీ నర్శింహస్వామి కొలువైన ప్రదేశం. గోదావరి సముద్ర సంగమ ప్రాంతాన్ని నేరుగా తిలకించేది ఇక్కడే. అటువంటి అంతర్వేది ఇటీవల కాలంలో తరచూ మీడియాలో కనిపిస్తుంది. ఇందుకు కారణం సముద్ర తీరంలో నెలకొన్న ‘అల’జడి. అంతర్వేది సంగమ ప్రాంతంలో సముద్రం ముందుకు చొచ్చుకువచ్చి తీరంలో నిర్మించిన కట్టడాలను ముంచెత్తుతుండగా, సమీపంలోని అంతర్వేది బీచ్‌లో సముద్రం కిలోమీటర్ల మేర లోనికి పోతుంది. పరస్పర విరుద్ధంగా జరుగుతున్న ఈ పరిణామాలు దేనికి సంకేతం? అంటే పెద్ద పెద్ద విపత్తులకు కారణమంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు.

Also Read : Amalapuram Ex MLA – జెడ్పి పీఠంపై ఆశతో జెడ్పిటిసిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్..!

భారతదేశంలో 7,516 కిమీల సాగరతీరం ఉంది. మన రాష్ట్రంలో 972 కిమీల తీరం ఉంది. హిందూ మహాసముద్రం, శ్రీలంక నుంచి రెండు భాగాలుగా విడిపోయింది. దేశ పశ్చిమ భాగంలో అరేబియా తీరం, తూర్పు భాగంలో బంగాళాఖాతం ఏర్పడ్డాయి. అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతం అత్యంత ప్రమాదకరం. దేశంలో చాలా వరకు నదులన్నీ దీనిలోనే కలుస్తాయి. ఉత్తరాధిన గంగా, బ్రహ్మపుత్ర, మధ్యభాగంలో మహానది, దిగువున గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, వంసధార, నాగవళి వంటి నదులు పడమర నుంచి తూర్పునకు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంటాయి. దేశంలో చాలా వరకు కాలుష్యాన్ని మోసుకువస్తున్న ఈ నదులు వీటిని బంగాళాఖాతంలో కలిపేస్తున్నాయి. ఫలితంగా బంగాళఖాతం త్వరగా వేడెక్కి తుఫాన్లకు అకాశం కల్పిస్తుంది.

అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతంలోనే తుపాన్లు ఎక్కువగా ఏర్పడడానికి ఇదే కారణం. అయితే ఈ ఏడాది ఆగస్టులో అంతర్వేదిలో ఒక రోజు సముద్రం 45 మీటర్లు ముందుకు వస్తే, మరునాడు 2 కిమీలల వెనక్కి వెళ్లిపోయింది. ఇది దేనిక సంకేతం? ప్రళయం రాబోతుందా? తీరప్రాంతం కనుమరుగు కాబోతుందా? అనే ప్రశ్నలు అందరిలోను ఉత్పన్నమవుతాన్నాయి.

దేశ నైసర్గిక స్వరూపాన్ని పరిశీలించినట్టయితే తూర్పుతీరంలో తమిళనాడు, దక్షణ కోస్తాలోని ఆంధ్రప్రదేశ్‌ వరకు భూభాగం సముద్రంలోకి చొచ్చుకువచ్చినట్టు ఉంటుంది. అంతర్వేది వద్ద ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. ఇలా బంగ్లాదేశ్‌ వరకు పలుచోట్ల సముద్రంలోకి చొచ్చుకువస్తూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది నుంచి భూభాగం ఒక బ్రడ్జి మాదిరిగా సముద్రంలో ఉంది. దక్షిణాయన కాలంలో అంటే జూల్‌ 16 నుంచి జవవరి 13 వరకు బంగాళాఖాతంలో అలలు అన్నీ దక్షిణం నుంచి ఉత్తరం వైపునకు వీస్తాయి. ఫలితంగా అప కేంద్ర బలాలు వలన అంతర్వేది ప్రాంతంలో నేల కోతకు గురవుతుంది.

Also Read : Air Services – భారతదేశంలో విమానయానం మొదలైన రోజు

‘ఉప్పాడ’ కనుమరుగు…

కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు కోసం సముద్రంలో ఇసుక పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తున్నారు. లక్షల మిలియన్‌ టన్నుల ఇసుకను తోడేస్తుండటంతో దాని ప్రభావం సమీపంలోని ‘ఉప్పాడ’ గ్రామంపై పడుతుంది. సముద్రంలో ఇసుక పూడుకుంటుండడం వల్ల వత్తిడికి ఉప్పాడ వద్ద ఆలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రంలో చిన్న అలజడి ఏర్పడినా ఉప్పాడ కోతబారిన పడుతుంది. ఇప్పటికే ఆ గ్రామం చాలా వరకు కోతకు గురైంది. దీని నివారణకు రక్షణ గోడ నిర్మించినా ఫలితం లేకుండా పోయింది. కోత ఇలా కొనసాగితే కొద్ది సంవత్సరాలలో ఉప్పాడ గ్రామం కనుమరుగైపోతుంది. అదే విధంగా తమిళనాడులో మహాబలిపురం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలో దేవాలయాలు సముద్రంలో కలిసిపోతాయి. ఒడిస్సా, పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌లలో అనేక తీరప్రాంతాలు సముద్రంలో కలిసిపోతున్నాయి.

మానవతప్పిదాలే కారణం..

ఇటువంటి దుష్పరిణామాలన్నింటికీ కారణం మానవతప్పిదాలే. సముద్ర ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయి తుఫాన్లకు దారితీస్తున్నాయి. గతంలో ఏడాదికి ఒకటో, రెండో తుపాన్లు వస్తే, ఇప్పుడు ఏడాదికి ఎనిమిది తుఫాన్లు వరకు వస్తున్నాయి. ఫలితంగా అలలు ఎగిసిపడుతూ సముద్రం తీరాన్ని కోసివేస్తుంది. తీరానికి రక్షణగా ఉండే మడ అడవులను ఇష్టానుసారం నరికివేయడం, సముద్రతీరంలో ఇసుక దోపిడీ వల్ల కూడా తీరంకోత పెరగడానికి కారణమువుతుంది. ఇటీవల కాలంలో చంద్రుడు, భూమికి మధ్య ఆకర్షణ శక్తి పెరుగుతుందని, ఫలితంగా అలలు ఉధృతి పెరిగిందని అంతర్జాతాయ నిపుణులు చెబుతున్నారు. అదే నిజమైతే అలల అలజడి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. దీనికితోడు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆర్కిటికా, అంటార్కిటికా వద్ద మంచు వేగంగా కరిగిపోవడంతో సముద్ర మట్టాలు కూడా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా కారణాలు ఏదైనా సముద్ర ‘అల’జడి వల్ల రాబోయే వంద ఏళ్లలో తీరప్రాంత నగరాలు, పట్టణాలు, గ్రామాలు సముద్రంలో కలిసిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. వీటన్నింటికీ కారణం సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడమే.

Also Read : Bhimavaram – ‘మావుళ్లమ్మ’ గురించి తెలుసా ..?

అంతర్వేదిలో ఆలా ఎందుకు జరుగుతుంది?:

అంతర్వేది వద్ద సముద్రం ఎందుకు వెనక్కు వెళ్లింది.? ‘ఇటీవల ఆగస్టు 2021నలో తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు ఆగ్నేయంగా 239 కిమీల దూరంలో సముద్రంలో 10 కిమీల లోతున స్వల్ప భూకంపం సంభవించినట్టు మా పరిశోధనలో తేలింది. ఇది రిక్టారు స్కేలుపై 5 లోపు ఉంది. ఫలితంగా భూ పలకల మధ్య సర్దుబాట్లు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా సముద్రం వెనక్కి వెళ్లడం, చొచ్చుకురావడం జరిగింది’ అని కోనసీమ, గోదావరి కాలుష్య అధ్యయన కర్త, ఎస్‌కేబీఆర్‌ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పెచ్చెట్టి కృష్ణకిషోర్‌ తెలిపారు. దీనిపై సమగ్ర పరిశోధనలు జరపాల్సి ఉందన్నారు. ఏది ఏమైనా ఈ పరిణామాలు రాబోయే విపత్తులకు సంకేతంగా పేర్కొనవచ్చు. తీరం వెంట మడ అడవులను విస్తారంగా పెంచాల్సి ఉంది. హరితగృహ వాయువులను తగ్గించాలి. సముద్ర ఉష్ణోగ్రతలలో తగ్గుదలను తీసుకురావాలి. అప్పుడు ఈ ఉపద్రవాల నుంచి బయటపడే అవకాశముంది.