iDreamPost
iDreamPost
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపీ వాయుగుండంగా మారడంతో కురుస్తున్న భారీ వర్షాలతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాతీరం అతలాకుతలమవుతుంది. ఇప్పటికే ముంపుబారిన ఉన్న చెన్నై మహానగరం భారీ వర్షాలతో మరింత ముంపులో చిక్కుకుంది. తమిళనాడు, ఏపీలలో కోస్తా జిల్లాలో కురుస్తున్న వర్షాలు అన్నదాత నడ్డివిరుస్తున్నాయి. వాయుగుండం గురువారం సాయంత్రానికి మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాయుగుండం తమిళనాడులో తీరం దాటుతున్నా ఏపీలో కోస్తా జిల్లాలో బుధవారం అర్థరాత్రి నుంచి
భారీ వర్షాలు కురుస్తుండడంతో వరి రైతుల్లో వణుకు పుట్టిస్తోంది…
తమిళనాడు రాజధాని చెన్నై నగరం ఇప్పటికే ముంపులో ఉంది. దీనికితోడు గడిచిన 20 గంటల నుంచి ఎడతెరపి లేని వర్షం కురుస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో చెన్నై 27 సెంటీమీటర్ల వర్షం పడిరదని ఐఎండీ వెల్లదించింది. ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో చిత్తూరు, నెల్లూరు నుంచి విశాఖ వరకు కోస్తా వెంబడి భారీ వర్షాలు పడుతున్నాయి. తమిళనాడులో తీరం దాటుతున్నందున సమీప జిల్లాలైన నెల్లూరు, చిత్తూరుపై వాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. తూర్పు గోదావరిలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. ఆ తరువాత కూడా వర్షం పడుతూనే ఉంది. తుఫాను ప్రభావంతో చెట్లు కొమ్మలు విరిగి పడడంతో తిరుమల పాపవినాశం రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అత్యధికంగా నెల్లూరులోని ముత్తుకూరులో 7.62 సెం.మీ, చిత్తూరు వరదాయిపాలెంలో 6.87 సెం.మీటర్ల వర్షం కురిసింది.
తడ, సూళ్లూరుపేటలో భారీ వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల పడుతున్న జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కృష్ణా జిల్లా బాపులపాడు, తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు, గుంటూరు జిల్లా సత్తెనపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, ప్రకాశం జిల్లా మర్రిపూడి, ఉలవలపాడు, కందుకూరు, విశాఖపట్నం ఆనందపురంలో భారీ వర్షం కురిసింది. వర్షాలకు వరి రైతులకు ఎక్కువగా నష్టం జరగనుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఖరీఫ్ వరి కోతలకు సిద్ధమైంది. గోదావరి డెల్టాలో 8.63 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగగా, రెండు జిల్లాల్లో మెట్ట ప్రాంతాల్లో మరో మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని అంచనా. భారీ వర్షాల వల్ల తీరప్రాంత మండలాల్లో వరిచేలు నేలకొరిగి, ముంపులో చిక్కుకున్నాయి. వాయుగుండం వల్ల మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు.
Also Read : Hyderabad- హైదరాబాద్ లో దారుణం: ప్రేమించలేదని పట్టపగలు 18 కత్తి పోట్లు, అసలు ఏం జరిగింది…?