తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండల కేంద్రంలో శ్రీనివాస్ అనే వ్యక్తికి జ్వరం వచ్చింది. తమ వీధిలో ఉన్న ఆర్ఎంపి వద్దకు చికిత్స కోసం వెళ్లారు. మందు బిళ్ళలు, ఇంజెక్షన్లు చేసి పంపారు. రెండు రోజులైంది జ్వరం తగ్గలేదు. మళ్ళీ వెళ్లారు. అది వైరల్ జ్వరం, తగ్గేందుకు వారం పడుతుందన్నారు. ఈ సారి మందుల డోసు పెంచారు. ఖరీడైన మందులు వాడాలన్నారు. రోజు రావాలన్నాడు. దానికి శ్రీనివాస్ తల ఊపాడు.
వారం తిరిగే సరికి మందుల కోసం అక్షరాలా 10 వేల రూపాయలు ఖర్చు అయింది. ఇనా జ్వరం తగ్గలేదు. ఇక ఇక్కడ కాదు కాకినాడ లోని ప్రవేట్ ఆస్పత్రికి వెళ్ళాలని ఆర్ఎంపి చెబుతూ ఓ ఆస్పత్రి పేరును చీటిపై రాసి ఇచ్చి పంపారు. అక్కడకు వెళ్లిన శ్రీనివాస్ వారం రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. దాదాపు 50 వేలకు పైగా బిల్లు అయింది. మొత్తంగా 15 రోజుల్లో వైరల్ జ్వరం ( అది ఏ జ్వరమో) కారణంగా శ్రీనివాస్ కు 60 వేల రూపాయల ఖర్చు అయింది.
శ్రీనివాస్ ఒక్కడే కాదు.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. వైరల్ జ్వరాల బారిన పడుతున్న గ్రామీణం ఆర్ధికంగా గుల్లవుతోంది. ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడం, వచ్చిన జ్వరం ఎలాంటిదో తెలియకపోవడంతో చికిత్స కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
డెంగ్యూ జ్వరానికే కాదు సాధారణ జ్వరాలకు ప్లేట్లెట్లు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. పోషకాహారం, పండ్లు తీసుకుంటే ప్లేట్లెట్లు తిరిగి యధాతథ స్థితికి చేరుకుంటాయి. ఐతే ప్లేట్లెట్లు తగ్గుతుండడంతో భయపడుతున్న ప్రజలు ఆస్పత్రుల్లో చేరి వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆస్పత్రులు కూడా వైద్య పరీక్షలు, మందులు పేరుతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం సాగిస్తున్నాయి.
ప్రాధమిక వైద్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, వాటి పరిధిలో పని చేసే ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ లు అలంకారప్రాయంగా మారుతున్నారు. ప్రభుత్వ వైద్యం పట్టణాలలో తప్పా గ్రామీణ ప్రాంతాలలో మచ్చుకు కూడా కనిపించడంలేదు. ప్రాంతాలను బట్టి జ్వరాలు, ఇతర వ్యాధులు తరచూ వస్తుంటాయి. ఆయా ప్రాంతాలలో ఏ ఏ జబ్బులు ఏ సమయంలో వస్తున్నాయో ఖచ్చితమైన సమాచారం వైద్య ఆరోగ్య శాఖ వద్ద లేవంటే అతిశయోక్తి కాదు. తరచూ ఆయా ప్రాంతాల ప్రజలు వైద్య పరీక్షలు చేసి. సంబంధిత డేటాను భద్రపరచాలన్న నియమం ఉంది. కానీ సరైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేమి, తదితర కారణాలతో పరీక్షలు జారుతున్న జాడలు కనిపించడం లేదు.
గతంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి విద్యార్థుల రక్త నమూనాలు తీసుకుని పరీక్ష చేసేవారు. కొన్నేళ్లుగా ఆ పని కూడా జరగడం లేదు. జ్వరాలు, సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు నివారణా మందుల పంపిణి మచ్చుకు కనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రజలు చిన్నపాటి అనారోగ్యానికి గురైనా ఆందోళచెందుతున్నారు. ప్రవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థిక కష్ఠాల్లో పడుతున్నారు.
రాష్ట్రంలో జగన్ సర్కార్ పరిపాలనలో కొత్త పంథాను అవలంభించేందుకు 11,158 గ్రామ, 3,786 వార్డు వెరసి 14, 944 సచివాలయాలను ఏర్పాటు చేసింది. శాశ్వత పద్దతిలో వివిధ విభాగాలకు నైపుణ్యమున్న ఉద్యోగులను తీసుకుంది. ప్రతి సచివాలయంలో ఒక వైద్య సహాయకురాలిని నియమించారు. గ్రామాల్లో ప్రతి రెండు వేల మందికి, పట్టణాలలో ప్రతి 4 వేల మందికి వీరు సేవలు అందిస్తారు. వచ్చే నెల నుంచి సచివాలయాలు పూర్తి స్థాయిలో పని చేయనున్నాయి.
నిపుణులైన వైద్య సహాయకుల (హెల్త్ అసిస్టెంట్) ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఒక క్రమ పద్దతిలో తరచూ వైద్య పరీక్షలు జరిపి సంభందిత డేటా భద్రపరచడం వల్ల ప్రజల ఆరోగ్యంపై అవసరమైన చర్యలు తక్షణ చేపట్టేందుకు ప్రభుత్వానికి చాలా చులువుగా ఉంటుంది. అంతే కాకుండా తీసుకున్న చర్యలు తప్పక మంచి ఫలితాలను ఇస్తాయి. హెల్త్ అసిస్టెంట్ తమ పరిధిలోని 2 వేల మందికి తరచూ ప్రాధమిక వైద్య పరీక్షలు చేయడం ఆచరణ సాధ్యమైనదే. జబ్బు చేసినప్పుడు ఆరోగ్యశ్రీ తో ఉచిత వైద్యం అందించే బదులు…. అసలు జబ్బు రాకుండా ముందస్తు నివారణ చర్యలు, ఒకవేళ వచ్చినా ప్రాధమిక దశలో గుర్తించడం వల్ల ఇటు ప్రజలు, ఇటు ప్రభుత్వానికి ఎంతో మేలు జరుగుతుంది. జగన్ సర్కార్.. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇది అమలు చేస్తే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సృష్టించవచ్చనడంలో సందేహం లేదు.