రెండు దశాబ్దాల తర్వాత ఆఫ్ఘన్ ను కబళించిన తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలో కీలక మంత్రులందరూ ఉగ్రవాద కార్యకలాపాల్లో ఆరితేరినవారే. దాడులు, హత్యాకాండలతో అత్యంత ప్రమాదకర వ్యక్తులుగా ముద్ర పడిన వారే. గతంలో 1996లో తాలిబన్లు మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ఈసారి తోటి ఉగ్రవాద ముఠా హక్కానీ గ్రూపునకు స్థానం కల్పించారు.
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే హక్కానీ సంస్థ పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐ ఎస్ ఐ చేతిలో కీలుబొమ్మ. దాంతో పాటు డబ్బులు తీసుకొని ఎంత దారుణానికైనా ఒడిగట్టడం దాని నైజం. అటువంటి ఈ సంస్థ అధ్యక్షుడు సిరాజుద్దీన్ హక్కానీని ఏకంగా హోంమంత్రిని చేయడం దొంగ చేతికి తాళం ఇవ్వడంలాంటిదే. వాస్తవానికి హక్కానీ నెట్ వర్క్ స్థాపన పాపం అమెరికాదే. అది సృష్టించిన పామును పాకిస్థాన్ పెంచి పోషించింది. ఇప్పుడు ఆఫ్ఘన్ లో ఏర్పాటైన తాలిబన్ ప్రభుత్వంలో దానికి చోటు కల్పించడం ద్వారా.. పాలనలో పాక్ ప్రమేయానికి అవకాశం కల్పించినట్లు అయ్యింది.
Also Read:నాలుగు దశాబ్దాల జగిత్యాల జైత్రయాత్ర…
ఎన్నో ఉగ్ర తండాల్లో అదొకటి
సోవియట్ దళాలు 1980లో ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించడం అమెరికాకు కంటగింపుగా మారింది. సోవియట్ దళాలను అడ్డుకొని చికాకు పెట్టేందుకు పాక్, ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని గిరిజన తెగల ప్రజలకు పాకిస్థాన్ తో కలిసి డబ్బు, ఆయుధాలు సమకూర్చి ఎగదోయడం ప్రారంభించారు. అమెరికా తెర వెనుక నుంచి ఆర్థికంగా ప్రోత్సహిస్తే.. పాకిస్థాన్ నేరుగా వారిని పోషించడం ప్రారంభించింది. అలా ఊపిరి పోసుకొని మత ఛాందస ఉగ్రవాద సంస్థలుగా ఎదిగిన వాటిలో తాలిబన్, హక్కానీ నెట్ వర్క్ ముఖ్యమైనవి. ఇందులో కూడా పాకిస్థాన్ తాలిబన్, ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ అని వేర్వేరు గ్రూపులు ఉన్నాయి. తర్వాత కాలంలో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ తన అవసరాలకు హక్కానీని వాడుకోవడం ప్రారంభించింది. అందులో భాగంగా ఆఫ్ఘన్, అమెరికాలకు వ్యతిరేకంగానూ హక్కానీ నెట్ వర్కును ప్రయోగించింది.
పరస్పర సహకారం
హక్కానీ గ్రూప్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీ.. 2001 నుంచి అతని కుమారుడు సిరాజుద్దీన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఫిదాయిన్ (ఆత్మాహుతి) దాడులు ఈ ముఠా ప్రత్యేకత. శ్రీలంక అంతర్యుద్ధంలో ప్రారంభమైన ఆత్మాహుతి దాడుల విధానాన్ని హక్కానీ సంస్థ అఫ్గాన్లోకి తీసుకెళ్లి వందల మందిని హతమార్చింది. 2008లో భారత రాయబార కార్యాలయంపై సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో ఆత్మాహుతి దాడి జరిపి 58 మందిని బలిగొన్నారు.
Also Read:ముత్యాల పాప రాజకీయ స్టెప్ ఎటు ఉండపోతుంది ?
2014లో పెషావర్ లో పాఠశాలపై దాడి చేసి 200 మంది పిల్లలను బలి తీసుకున్నారు. 2017లో కాబూలులో జరిపిన దాడిలో 50 మంది మరణించారు. 2012లోనే హక్కానీ సంస్థపై అమెరికా నిషేధం విధించి, సిరాజుద్దీన్ తలపై ఐదు మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది. అయినా సిరాజుద్దీన్ పాకిస్థాన్లోని వజీరిస్తాన్లో నివాసం ఉంటూ అక్కడి నుంచే ఉగ్రవాద కార్యకలాపాలను నడిపిస్తున్నాడు. తాలిబన్, హక్కానీ రెండు పరస్పరం సహకరించుకుంటుంటాయి. తాజా ఆఫ్ఘన్ దూరాక్రమణలోనూ తాలిబన్ కు హక్కానీ ముఠా సహకరించింది. అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వంలో కీలక స్థానం దక్కింది. దాంతో ప్రభుత్వం పాక్ జోక్యం చేసుకునేందుకు మార్గం సుగమమైంది.